గుండెల్లో గుసగుసలు అన్న మాట ఇక్కడ కవిత్వమో, భావుకతో కాదు. ఇది పక్కా వాస్తవం. కొందరు చిన్నపిల్లల్లో ఇది చాలా సాధారణం. దీన్నే ఇన్నోసెంట్ హార్ట్ మర్మరింగ్ అంటుంటారు డాక్టర్లు. ఈ గుసగుసలు ఎందుకో, అప్పుడేం చేయాలో తెలిపే కథనం ఇది.
నెలల పిల్లలు మొదలుకొని... ఏడాదీ లేదా రెండుమూడేళ్ల పిల్లలను డాక్టర్లు స్టెతస్కోప్‌తో పరీక్షించినప్పుడు కొంతమంది చిన్నారుల్లో గుసగుస శబ్దం (మర్మర్) వినపడుతుంది. అలా వినగానే ‘ఇదేమిటి?... ఇదేదో తేడాగా ఉందే!’ అనిపిస్తుంది. కానీ అలా వినిపించినప్పటికీ దాదాపు చాలా కేసుల్లో తేడా ఏమీ ఉండదు. ఇది చాలావరకు నిరపాయకరమైన కండిషన్. అందుకే దీన్ని ఫంక్షనల్, బినైన్, ఫ్లో మర్మర్ లేదా స్టిల్ మర్మర్ అంటుంటారు.
మర్మర్ మర్మమేమిటి?
మర్మర్ మర్మమేమిటని పరిశీలిస్తే... ఇదేమైనా గుండె ఆకృతి (స్ట్రక్చరల్) లేదా నిర్మాణపరమైన (అనటామికల్) కారణాలతో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అంతా నార్మల్ అయితే ఈ శబ్దం ఎక్కడిది అనే అనుమానం వస్తుంది. అయితే ఈ శబ్దమంతా రక్తప్రవాహానిది. గుండెలోకి రక్తం వస్తున్నప్పుడు కలిగే ప్రవాహపు ఆటంకాలు (ఫ్లో డిస్ట్రబెన్స్)గానీ లేదా రక్తం అక్కడ సుడులు తిరగడం (ఫ్లో టర్బ్యులెన్సెస్), ఆ శబ్దం ప్రకంపనలు (రెసొనెన్సెస్) వల్ల ఇలా జరగవచ్చు. ఒక్కోసారి ఏ సమస్యా లేకపోయినా శబ్దం వినిపించవచ్చు. అందుకే చాలా సందర్భాల్లో ఇది ఏమాత్రం అపాయం కలిగించని సమస్యగా డాక్టర్లు చెబుతుంటారు.
ఇది ఎంతమంది పిల్లల్లో? ఎవరిలో?
పుట్టిన పిల్లల్లో కనీసం సగం మందికి... అంటే 50 శాతం మంది పిల్లల్లో ఈ హార్ట్ మర్మర్ ఉంటుంది. పుట్టిన పిల్లలు మొదలుకొని... చిన్నారుల్లో ఏదో ఒక దశలో ఇది కనిపించవచ్చు. ఇక ఏ చిన్నారిలోనైనా ఇది రావచ్చు. అయితే జ్వరంతో బాధపడే పిల్లల్లోనూ లేదా గుండె వేగంగా కొట్టుకునేవారిలోగానీ లేదా ఉద్వేగాలకు గురైనప్పుడు గుండె వేగం పెరిగే పిల్లల్లో సాధాణంగా ఈ కండిషన్ కనిపిస్తుంది. పెరిగాక ఈ కండిషన్ తగ్గిపోయినప్పటికీ... కొందరిలో వారు వ్యాయామం చేస్తున్నప్పుడు, బాగా ఉద్వేగానికి గురైనప్పుడు శబ్దం మళ్లీ వినపడవచ్చు.
లక్షణాలేమిటి?
సాధారణంగా కనిపించే గుండె స్పందనలు కాకుండా... కాస్తంత రక్తప్రవాహపు శబ్దాలు వినిపించడం తప్ప మరే రకమైన ఇతర లక్షణాలూ వీళ్లలో ఉండవు. ఒకవేళ వాళ్లలో ఇంకా ఏవైనా లక్షణాలు కనిపిస్తే అవి మాత్రం గుండెకు ఆపాదించకూడదు.
పరీక్షలు ఏవైనా అవసరమా?
స్టెతస్కోప్‌తో విన్నప్పుడు నిపుణులైన డాక్టర్లకు గుండె శబ్దం, లయను బట్టి అది సాధారణమా లేక ఏదైనా సమస్య (అబ్‌నార్మాలిటీ) ఉందా అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ల ఆధ్వర్యంలో కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. పిల్లల ఆరోగ్య చరిత్రను బట్టి ఆ పరీక్షలేమిటన్నది నిర్ణయిస్తారు. సాధారణంగా ఈసీజీ, అటు తర్వాత ఎకోకార్డియోగ్రామ్‌తో అది సాధారణమా, అసాధారణమా అన్నది తెలిసిపోతుంది. ఒక్కోసారి గుండె, ఊపిరితిత్తుల పరిస్థితి తెలుసుకోడానికి ఓ సాధారణ ఎక్స్–రే సరిపోతుంది.
చికిత్స ఏదైనా ఉందా?
చాలా సందర్భాల్లో ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. ఈ చిన్నారులు, పెద్దపిల్లలుగా ఎదిగే సమయానికి ‘గుండె గుసగుసలు’ వాటంతట అవే తగ్గిపోవచ్చు. చిన్నతనంలో ఇలా హార్ట్ మర్మర్ ఉన్న పిల్లలు ఎదిగాక... వారు పూర్తిగా నార్మల్ వ్యక్తుల్లాగే పెరుగుతారు. అంతే ఆరోగ్యంగా ఉంటారు. మరేదైనా కారణాలతో వారికి గుండె సమస్యలు రావచ్చేమోగానీ... భవిష్యత్తులో వారికి వచ్చే గుండె సమస్యలకు ఇది మాత్రం కారణం కాబోదు. అందుకే హార్ట్ మర్మర్ అంటూ రిపోర్ట్ వచ్చే పిల్లల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు చిన్నపిల్లల వైద్యులూ... చిన్నారుల గుండెనిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment