‘కిలిమంజారో అధిరోహణ నా జీవితంలో ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది’ అన్నారు కూరగాయల శారద. పర్వత ప్రపంచంలోని ఏడు శిఖారాలలో భాగమైన కిలిమంజారోను అధిరోహించిన మొదటి భారతీయ శాకాహారి (వీగన్)గా వార్తల్లో నిలిచారు ఆమె. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించడానికే ఈ ప్రయత్నం చేశానంటున్న నలభై నాలుగేళ్ల శారద స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. జంతు ఆధారిత ఆహార ఉత్పత్తులను దూరం పెట్టి ఐదేళ్లుగా వీగన్‌గా జీవిస్తున్న విధానాన్ని ఆమె ఇలా పంచుకున్నారు.
‘‘బలంగా ఉండాలంటే మాంసాహారం, గుడ్లు తినాలని, ఆరోగ్యంగా ఉండాలంటే పాలు తాగాలనే ఆలోచన మనందరిలోనూ ఉంది. పర్వతారోహణ చేసేవారిలో శక్తికి ఇవన్నీ అవసరమే అనే ఆపోహ మనందరిలోనూ ఉంది. జీవ హింస చేయకూడదని, పూర్తి శాకాహారులు కూడా బలవంతులుగా ఉండవచ్చని నిరూపించడానికే కిలిమంజారో పర్వతారోహణ చేశాను.
విదేశాల్లో వీగన్‌గా..
జర్నలిజంలో డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాద్‌లోని న్యూస్ చానెళ్లలో జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేశాను. అవకాశం రావడంతో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాను. రేడియో మాధ్యమంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలా మంది శాకాహారుల(వీగన్)ను కలిశాను. మనదేశంలో వీగన్ ఫుడ్‌కి సంబంధించిన శోధన ఎంతో జరుగుతుంది. కానీ, పూర్తి శాకాహారులు అక్కడ పర్వతారోహణతో పాటు ఎన్నో వైవిధ్యమైన పనుల్లో చురుకుగా పాల్గొనడం చూశాను. వారితో కలిసి అవగాహనా సదస్సుల్లో పాల్గొన్నాను. జంతువులను హింసించి తయారు చేసే ఉత్పత్తులన్నింటికీ అప్పుడే స్వస్తి చెప్పాను. పాలు–పెరుగు వంటివి కూడా కొబ్బరి, బాదం మొదలైన ఉత్పత్తుల నుంచి తయారు చేసినవే వాడటం మొదలుపెట్టాను. ఐదేళ్లుగా కేవలం ప్రకృతి సంబంధిత ఉత్పత్తులతోనే నా జీవనం కొనసాగుతోంది. సౌందర్య ఉత్పత్తులు, ఇంటికి సంబంధించినవి ఏ వస్తువైనా జీవహింస ఏ మాత్రమూ లేకుండా తయారు చేసినవే వాడుతుంటాను. చాలావరకు వాటిని నేనే స్వయంగా తయారుచేసుకుంటాను.
మొదట అమ్మానాన్నలే వద్దన్నారు
చిన్ననాటి నుంచి శాకాహారిని ఏమీ కాదు. నా ఈ పద్ధతులను మొదట అమ్మానాన్నలే వద్దన్నారు. అలాంటి ఉత్పత్తుల ద్వారా బలం వస్తుందా అని వారి సందేహం. కిలిమంజారో ప్రపంచ ప్రసిద్ధ పర్వతాలలో ఒకటి. అలాంటి పర్వతాన్ని ఆరోహించడం ద్వారా నా బలమెంతో మా అమ్మనాన్నలకే కాదు మన దేశ ప్రజలకూ అర్థమైంది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు జరిపి, అప్పుడే పర్వతారోహణకు అనుమతినిస్తారు. ఆఫ్రికాలో ఉన్న ఈ పర్వతాన్ని అధిరోహించడానికి చాలామంది వస్తుంటారు. కానీ, కొంతమంది బలవంతులు అనుకున్నవారు కూడా కొంత ఎత్తు అధిరోహించాక వెనుదిరిగిన వారున్నారు. స్పృహ తప్పి పడిపోవడం, వారిని రెస్క్యూ టీమ్ రక్షించడం వంటి సంఘటనలు కూడా చూశాను. ఈ పర్వతారోహణ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. మాంసాహారం తింటే బలం వస్తుందనడంలో అర్థం లేదు. జీవ హింస లేకుండా జీవిద్దాం. మూగజీవాలను ప్రేమిద్దాం’’ అని శాకాహారిగా తన అభిప్రాయాన్ని, పర్వతారోహణ అనుభవాలను తెలిపారు శారద.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment