కుశలత అంటే నేర్పరితనం. ఏ పని చేయటానికైనా ఒక నేర్పరితనం అవసరం. ఏదో ఒక తీరులో తోచిన విధంగా చేయటం కాక, సులువైన పద్ధతిలో సునాయాసంగా చేయగలగటం నేర్పరితనం. బుద్ధిని దాని సామర్థ్యాన్ని తగిన విధంగా ఉపయోగించటమే బుద్ధి కుశలత.
సాధారణంగా మనస్సుని, బుద్ధిని సమానార్థకాలుగా వాడుతూ ఉంటాం. కాని రెండింటికీ తేడా ఉంది. ఆలోచన చేసేది, పంచేంద్రియాలని ప్రేరేపించేది, వాటిపై పెత్తనం చేసేది, తనకి నచ్చినట్టు, కావలసినట్టు ఊహ చేసేది, కలలు కనేది, ఆశపడేది, రాగద్వేషాలకి నిలయమైనది మనస్సు. బుద్ధిలో కూడా మనోవ్యాపారం ఉన్నా, దానిలో విచక్షణా, సహేతుకతా ఉంటాయి.
ఒక మంచిపని, తనకి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేది చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు పని చేసింది బుద్ధి. తీరా ఆ పని మొదలుపెట్టిన తరువాత ఏవేవో పనికిరాని కారణాలతో సమర్థించుకుని వాయిదా వేసుకుంటూ వచ్చినప్పుడు పని చేసింది మనస్సు. మనస్సు శారీరిక, మానసిక సుఖాన్ని అపేక్షిస్తుంది. మంచి చెడులను వేర్పరచి విచక్షణతో నిర్ణయం తీసుకునేది బుద్ధి. అయితే ఎన్నో సందర్భాలలో మనసు బుద్ధి వేషం వేసుకుని వస్తుంది. పని వాయిదా వేయటానికి కారణాలు వెదకినట్టుగా మనోవ్యాపారమైన ఆలోచనల సహకారంతో ఏది మంచి ఏది చెడు ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది తనకి, సమాజానికి ఉపయోగ పడుతుంది, ఏది ఉపయోగ పడదు అనే అంశాలను విడదీసి, విమర్శించి, వేర్పరచి సరైన నిర్ణయం తీసుకునేందుకు సహకరించే శక్తి బుద్ధి.
ఒకప్పుడు గురుకులాల్లో గురువులు శిష్యులకి విద్యాబుద్ధులు నేర్పేవారు. విద్యావంతులు బుద్ధిమంతులుగా ఉండేవారు. విద్య అంటే విషయ సేకరణ మాత్రమే కాదు. సేకరించిన విషయాలను, సముపార్జించిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయం చేసి, ఆచరణలో పెట్టగలగటం, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎంత అవసరమో నిర్ణయించగల మెలకువ కలిగి ఉండటం. అదే బుద్ధికుశలత.
ఒక పండితుడికి, శాస్త్రవేత్తకి తమ తమ రంగాలకి సంబంధించిన జ్ఞానం చాలా ఉండవచ్చు. దానిని సందర్భానుసారంగా ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక నలుగురిలోనూ నవ్వులపాలు కావటం చూస్తూ ఉంటాం. మెదడు బాగా ఎదిగింది కాని, విచక్షణ లేదు అని అర్థం. గొప్ప మేథావులు కూడా జీవితంలో సరయిన నిర్ణయం తీసుకోక నష్టపోవటానికి ఎంతోమంది శాస్త్రవేత్తల జీవితాలని ఉదాహరణలుగా గమనించవచ్చు.
కారణం విద్యతో పాటు బుద్ధి గరపిన వారు లేకపోవటమే. ప్రస్తుత విద్యావిధానంలో చదువులు నేర్పి అక్షరాస్యులని తయారు చేయటం మాత్రమే కనిపిస్తోంది. కాని, బుద్ధివికాసం ఎంతవరకు జరుగుతోంది? అన్నది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే పెద్ద పెద్ద విద్యార్హతలు ఉన్న వారు కూడా సంఘవిద్రోహకశక్తులుగా మారటం, దేశద్రోహులుగా మారటం కుటుంబ దేశ పరువు ప్రతిష్ఠలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించటం చివరికి తమకే హాని చేసుకోవటం గమనించవచ్చు.
ఆకలి దహించుతోంది, నిద్ర ముంచుకు వస్తోంది. తినటం, పడుకోటం లలో ఏది ముందు చేయాలి? అని నిర్ణయించుకుని మేలు పొందటానికి కావలసినది విచక్షణ మాత్రమే కాని చదువులు కాదు.
కార్యసాధకుల లక్షణాలలో ప్రధానమైనది బుద్ధికుశలత. జీవితంలో గొప్ప విజయాలు సాధించి అత్యున్నత స్థానానికి చేరుకున్నవారందరు బుద్ధికుశలురే. చదువులు సహాయం చేసి ఉండవచ్చు.
కుశలత... విచక్షణ
ప్రతి మనిషికి మనసు ఉన్నట్టే బుద్ధి కూడా ఉంటుంది. కాని, అందరూ బుద్ధిని సరిగా ఉపయోగించరు. దానిని ఉపయోగించటంలోని మెలకువలు తెలియటమే బుద్ధి కుశలత. ఏ పని ఎట్లా చేయాలో తెలిసి ఉండటమన్న మాట. దీనినే ఒడుపు అని కూడా అనవచ్చు. ఏ పనినైనా గుడ్డెద్దు చేలో పడ్డట్టు అడ్డదిడ్డంగాను చేయవచ్చు. ఎక్కువమంది చేసేది ఆ విధంగానే. లేదా క్రమపద్ధతిలోనూ చేయవచ్చు. ఇది నేర్పరులు చేసే పద్ధతి. బుద్ధిని ఉపయోగించటంలో ఇటువంటి నేర్పరితనం ఉంటే దాన్నే బుద్ధి కుశలత అనవచ్చు. అంటే చురుకుగా పనిచేసే విచక్షణాజ్ఞానం అన్నమాట.
– డా.ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment