Is It Necessary To Get Tetanus Shot Every Time After An Injury - Sakshi
Sakshi News home page

Tetanus Shot : దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్‌ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..

Published Fri, Jul 28 2023 12:36 PM | Last Updated on Mon, Jul 31 2023 1:49 PM

Is It Necessary To Get Tetanus Shot Every Time After An Injury - Sakshi

దెబ్బ తగిలిందని టీటీ ఇంజెక్షన్ తీసుకుకున్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా చీము పట్టింది. ఇనుప రేకు గీసుకుపోయింది..టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి". దెబ్బ తగిలింది ఇనుముతో కాదు కదా.. టీటీ ఇంజెక్షన్ ఎందుకు? దెబ్బ తగిలింది.. టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఆరు నెలలకు పైనే అయింది. మరో ఇంజెక్షన్ ఇవ్వండి. ప్రజలు నంచి సాధారణంగా వినే మాటలే ఇవీ.. దీన్నిబట్టి చూస్తే.. టీటీ ఇంజెక్షన్ గురించి సామాన్య ప్రజలకు చాలా అపోహలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అపోహాలకు చెక్‌పెట్టి..అసలుఎప్పుడెప్పుడూ తీసుకోవాలి? అలసెందుకు తీసుకోవాలో చూద్దా!.

ధనుర్వాతం..
టెటనస్.. లాక్ జా.. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి. దీని గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే హిప్పోక్రేట్స్ (Hippocrates) రచనల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోజుకీ ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి, చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌కు కారణం క్లస్ట్రీడియమ్ టెటానీ(Clostridium Tetani) అనే ఒక సూక్ష్మ జీవి (బ్యాక్టీరియా). ఇవి మట్టిలో, నేలలో, దుమ్ములో, ఇలా ప్రతి చోటా ఉంటాయి. అవి శరీరంలోకి చేరుకున్నప్పుడు వ్యాధికి కారణం అవుతాయి. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణను ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజు లోపు దీన్ని తీసుకోవాలి.

ఇది శరీరంలోకి ఎలా చేరతుందంటే?

  • శరీరానికి అయిన పుండ్లు, లేక తగిలిన దెబ్బల ద్వారా ఇవి శరీరంలోకి చేరగలవు. మొల, లేక ఏదైనా పదునైన వస్తువులు గుచ్చుకోడం వల్ల, శరీరానికి గాయం అయినప్పుడు చేరవచ్చు.
  • కాలిన గాయాల నుంచి జరగొచ్చు.
  • కాన్పు సమయంలో తల్లికి లేక పుట్టిన శిశువుకి బొడ్డు కోయడానికి వాడిన పరికరం సరిగ్గా లేకపోతే ఆ శిశువుకి ధనుర్వాతం కలిగే అవకాశం ఉంది.
  • ఏదైన ప్రమాదం జరిగినప్పుడు, తగిలిన గాయాల ద్వారా వ్యాధి కారకాలు శరీరంలోకి చేరగలవు.
  • ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, లేక ఏదైనా పట్టీ కట్టినప్పుడు లేదా మార్చినప్పుడు చేరే అవకాశం ఉంటుంది.
  • కుక్క లేక ఇతర జంతువులు కరిచినప్పుడు ఆ గాయాల ద్వారా సంభవించవచ్చు. ఎముకలు విరగడం, లేక దీర్ఘ కాలిక పుండ్లు, గాయాలు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది.


లక్షణాలు..
వ్యాప్తి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి, ఎన్ని రోజులకు లక్షణాలు కనిపిస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది.
ఎక్కువ శాతం రెండు వారాలలోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన గాయాలలో, లక్షణాలు కొన్ని గంటల నుంచి, ఒకటి రెండు రోజుల్లోనే కనిపిస్తాయి. చిన్న గాయాలతో కొన్ని నెలల తరవాత కూడా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
ఎక్కువ శాతం కేసుల్లో మొదట నోటి కండరాలు పట్టేస్తుంటాయి. తర్వాత ఒకొక్కటిగా అన్ని కండరాలు బిగుసుకుపోవడంతో, నొప్పి ఎక్కువవుతుంది. క్రమేణా, అన్ని కండరాలు బిగించినట్టు పట్టేస్తాయి. ఆహారం మింగడం కష్టంగా మారుతుంది.
తీవ్రమైన తలనొప్పి, అదుపు లేకుండా జ్వరం, చెమటలు కూడా కనిపిస్తాయి. అదుపు లేకుండా శరీర భాగాలలో కదలికలతో మూర్ఛ, ఫిట్స్ తరవాత దశలో కనిపిస్తాయి.
గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్త పోటు పెరిగి క్రమేణా ప్రాణాపాయ స్థితి వస్తుంది.

చికిత్స విధానం:
ఈ వ్యాధిని తొలి దశల్లో కచ్చితంగా నిర్ధారించడం కష్టం. లక్షణాల ఆధారంగా, ఎక్కువ శాతం దీనిని గుర్తిస్తారు.
వ్యాధి లక్షణాలు కనిపించిన తరవాత చికిత్స చాలా వేగంగా అందించాలి. వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేరి, గాయం అయిన చోటును పూర్తిగా శుభ్రపరిచి, యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు, కండరాల నొప్పులకు, పట్టేయడాన్ని తగ్గించే (muscle relaxant) మందులు వాడుతూ, ఒంట్లో నీరు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. అవసరాన్ని బట్టి, కృత్రిమ శ్వాస అందిస్తూ, మందుల ప్రభావం కోసం ఎదురు చూడాలి.

నివారణ:

  • ధనుర్వాతాన్ని నివారించే సులువైన, ఏకైక మార్గం టీకా తీసుకోవడం.
  • అందుకే చిన్న పిల్లలకు ప్రభుత్వం అందించే టీకాలల్లో డిఫ్తీరియా( కంఠవాతము), కోరింత దగ్గు టీకాలతో పాటు ధనుర్వాతం టీకా కూడా ఉంటుంది.
  • అలాగే అయిదు సంవత్సరాలు, పది సంవత్సరాల వయసులో బూస్టర్ డోస్ ఇస్తారు. ఆ తరవాత పెద్ద వాళ్ళల్లో, ప్రతి పది సంవత్సరాలకు ఒక డోస్ టీకా తీసుకోవాలి.
  • కాన్పు సమయంలో బిడ్డకు వ్యాధి సోకకుండా, గర్భిణులు తప్పకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి.
  • ఏదైన దెబ్బ తగిలినా, కాలిన గాయాలు, లేక పుండ్లు ఉన్నా, వాటిని శుభ్రం ఉంచుకోవాలి. అవి మానేవరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
     

టీటీ ఇంజెక్షన్‌పై కొన్ని అపోహలు/ నిజాలు ఇవే...
దెబ్బ వల్ల కలిగే నొప్పిని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. పుండు తగ్గే వరకు జాగ్రత్తగా ఇతర మందులు వాడాలి. ఆ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాదు.. ఏ గాయం వల్ల అయినా కలగవచ్చు. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే పది సంవత్సరాల వరకు అది ధనుర్వాతం రాకుండా రక్షణ ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాంతక వ్యాధి అయిన టెటనస్ రాకుండా ఉండడానికి టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం.

డాక్టర్ నవీన్ రోయ్, ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు

(చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement