
Jammu Kashmir: Pooja Sharma Govt School Teacher Free Cricket Coaching: గ్రౌండ్‌లో పిల్లలకు క్రికెట్‌లో శిక్షణ ఇస్తూ కనిపించే పూజాశర్మను చూస్తే ప్రత్యేకంగా కేటాయించిన కోచ్ అనుకుంటారు ఎవరైనా. కానీ, పూజాశర్మ స్థానిక పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. స్కూల్ సమయం ముగియగానే పిల్లలకు క్రికెట్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉంటుంది. క్రీడల్లో పిల్లలను నిష్ణాతులను చేయడానికి ప్రత్యేకంగా పాటుపడుతున్న పూజాశర్మతో మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి మనకు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాల్లో ఉంటున్న పూజ 25 మంది యువతులను, 15 మంది అబ్బాయిలను క్రికెట్‌లో జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేస్తోంది.
‘ఆడుకోవడానికి వచ్చే పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలన్నదే నా లక్ష్యం’ అంటారు ఈ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ముఖ్యంగా అమ్మాయిలు జాతీయ స్థాయి క్రికెటర్స్‌గా రాణించడానికి ఉచితంగా శిక్షణ ఇస్తూ, వార్తల్లో నిలుస్తోంది. జాతీయస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆమె కల నెరవేరలేదు. దీంతో అమ్మాయిల్లో ఉన్న క్రికెట్ కలలను సాకారం చేయాలనుకొని, ఉచిత శిక్షణకు నడుం బిగించింది. అలా శిక్షణ తీసుకున్న ఆమె విద్యార్థుల్లో సరళాదేవి అనే క్రీడాకారిణి ఇటీవల విజయవాడలో జరిగిన టీమ్ ఇండియా ఆటగాళ్ల ఎంపిక ట్రయల్‌లో పాల్గొని, వార్తల్లో నిలిచింది.
లాక్‌డౌన్ తెచ్చిన ఆలోచన
‘మహమ్మారి సమయంలో ఆన్‌లైన్‌లో పాఠాలు తప్ప, స్కూళ్లు లేవు. దీంతో మా స్కూల్ విద్యార్థులను కొందరిని క్రికెట్ ఆడటానికి గ్రౌండ్‌కు రమ్మని పిలిచేదాన్ని. కొందరు ఆసక్తి చూపారు. ఇంకొందరు ఇతర పిల్లలు కూడా వచ్చి ప్రాక్టీస్ చేసేవారు. ఇందులో అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. వాళ్లకి సౌకర్యాలు తక్కువే. ఇంట్లో నిబంధనలు ఎక్కువ. ఆర్థిక లేమి కారణంగా ఆటల్లో శ్రద్ధ చూపడం లేదు.
దీంతో ఆసక్తి ఉన్న పిల్లలకు ఉచితంగానే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయిలు జాతీయస్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. స్కూల్ సమయం ముగిశాక తర్వాత శిక్షణ కోసం కేటాయిస్తున్నాం. ఉన్నతస్థాయి అధికారులు కూడా స్కూల్‌కి తగినంత స్థలాన్ని కేటాయించడానికి సహకరిస్తున్నారు’ అని ఆనందంగా తెలియజేస్తారు పూజాశర్మ.
సక్సెస్ సాధిస్తాం...
పూజా శర్మ దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని నవ్య మాట్లాడుతూ –‘మేం క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి రోజూ ఇక్కడి వస్తాం. నాకు జాతీయస్థాయిలో ఆడాలన్నది కల. మా టీచర్ మా కలలను నెరవేర్చుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు’ అని ఆనందంగా చెబుతుంది. మరో విద్యార్థిని స్నేహ మాట్లాడుతూ ‘నాకు క్రికెట్ ఆడటం ఇష్టం. పూజా మేడమ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నామంటే మేం తప్పకుండా సక్సెస్ అవుతాం. అంతటి నమ్మకాన్ని మా మేడమ్ మాపై ఉంచుతుంది’ అని బలంగా చెబుతుంది.
ఒకస్థాయికి చేరుకున్నాక ఉద్యోగంలో విశ్రాంతిని కోరుకుంటారు చాలా మంది. తాము సాధించలేని విజయతీరాలను ఇక చేరుకోలేమని నిస్పృహకు లోనవుతారు. కానీ, పూజాశర్మ లాంటి అరుదైన వ్యక్తులే తమ కలల రూపాలను తీర్చిదిద్దుతారు. విజయ శిఖరాలను అవలీలగా చేరుకుంటారు అని నిరూపిస్తున్నారు.