పనివేళల్లో సరిగా పనిచేయకుండా ముచ్చట్లతో కాలక్షేపం చేసే ఈ రోజుల్లో ‘మంతి కుమారి’ నదులు, గుట్టలు దాటి అడవుల్లోకి సైతం కాలినడకన వెళ్లి విధులు నిర్వర్తిస్తోంది. జార్ఖండ్‌లో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎమ్‌గా పనిచేస్తోన్న మంతి కుమారి తన ఏడాదిన్నర పాపను వీపున కట్టుకుని పసిపిల్లల్లో రోగనిరోధకతను పెంచే టీకాలు వేస్తున్నారు. వయసు, సీజన్‌ను బట్టి చిన్నారులకు రెగ్యులర్‌గా అందించాల్సిన మందులను వైద్య సదుపాయంలేని మారుమూల ప్రాంత చిన్నారులకు అందించేందుకు బుర్రా నదిని దాటి మరీ సేవలందిçస్తుండడం విశేషం.
గతేడాది జనవరిలో చెట్మా హెల్త్ సబ్ సెంటర్‌లో ఉద్యోగంలో చేరిన మంతి కుమారి అప్పటినుంచి వ్యయప్రయాసలను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో మంతి భర్త సునీల్ ఓరాన్ ఉద్యోగం పోవడంతో మంతి ఉద్యోగమే కుటుంబ పోషణకు ఆధారం అయ్యింది. దీంతో మంతి చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాల వారికి ఆరోగ్య సేవలందిస్తున్నారు. తిసియా, గోరియా, సుగబంద్ గ్రామాలకు నెలకు ఒక్కసారైనా వెళుతుంది. ఈ గ్రామాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా నది దాటాల్సి వస్తుంది. కొంత దూరం వరకు తన భర్త బండిమీద దింపినప్పటికీ..మిగతా దూరం తను ఒక్కటే ప్రయాణిస్తోంది.
‘‘నేను విధులు నిర్వర్తిస్తోన్న ప్రాంతంలో సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల తప్పనిసరిగా నదులు దాటాల్సి వస్తుంది. అయితే ఈ నదులు లోతు తక్కువగా ఉండడం వల్ల ధైర్యంగా దాటగలుగు తున్నాను. వర్షాకాలంలో నదిలో నీళ్లు ఎక్కువైతే అప్పుడు ఆయా గ్రామాలకు వెళ్లను. రోజూ నా డ్యూటీలో భాగంగా మహద్నార్ మొత్తం 25 కిలోమీటర్లు పరిధిలోని గ్రామాలను కవర్ చేస్తాను. వారానికి ఆరు రోజులు నేను డ్యూటీ చేయాల్సి ఉంటుంది. దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు తక్కువగా ఉంటాయి. నాలాంటి ఏఎన్‌ఎమ్ సేవలైనా వాళ్లకు అందాలన్న ఉద్దేశ్యంతో కాస్త కష్టమైనా ముందుకు సాగుతున్నాను’’ అని మంతి కుమారి వివరించింది.
‘‘చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ఆరోగ్య కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మంతి తన కూతుర్ని వీపుపై కట్టుకుని ప్రయాణించి మరీ విధులు నిర్వర్తించడం నిజంగా ప్రశంసనీయం’’అని చెట్మా హెల్త్ సబ్‌సెంటర్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.
మంతి నిజాయితీ!
Published Thu, Jun 24 2021 12:13 AM | Last Updated on Thu, Jun 24 2021 12:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment