ఏవృత్తిలో ఉన్నా మనసుకు నచ్చిన పని, హబీ, లేదా అలవాటు ఇంకోటి ఉంటుంది. ఆ అభిరుచిని ఒక్క పట్టాన వదలాలి అని అనిపించదు. కానీ ఈ విషయంలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు కేరళలోని అలప్పుకు చెందిన పార్వతీ మోహనన్. మొక్కల్ని పెంచడం, అవి పూలో పళ్లో కాస్తో మురిసిపోవడం ఆమెకు చిన్నప్పటినుంచి అలవాటు. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోని టేబుల్ రోజ్ (మాస్ రోజ్) అందమైన రంగులతో మమేకమై పోతూ చివరికి దాన్నే వ్యాపారంగా మార్చేసింది. కేరళకు చెందిన పార్వతి మోహనన్ సక్సెస్‌స్టోరీ గురించి తెలుసుకుందాం రండి!
పార్వతి మోహనన్ కాలేజీ రోజుల్లోనే పోర్టులాకా (పతుమణి) అనే పూల మొక్కలను పెంచడం అభిరుచిగా చేసుకుంది. అయితే ఈ హాబీనే తనకు ఒకరోజు ఇంత ఆదాయాన్ని తెస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. పార్వతి త్రిస్సూర్‌లో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు, 2020లో కోవిడ్ కారణంగా, స్వగ్రామానికి తిరిగి వచ్చి ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేది. ఇంట్లోనే ఉంటూ పోర్టులాకా మొక్కల్ని పెంచడం మొదలు పెట్టింది. వీటి ఫోటలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేది. అందరికీ ఇవి తెగ నచ్చేసేవి. మాకూ కావాలని అడిగేవారు. అలా ఆమె వ్యాపారం మొదలైంది. బ్లాగర్లు, యూట్యూబ్ ఛానెల్‌ల కవరేజీ రావడంతో మరింత పేరు వచ్చింది.
ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉండగానే, అలప్పులోని చేరాల ప్రాంతానికి చెందిన పార్వతి తన ఇంటి సమీపంలోని ఒకటిన్నర ఎకరాల భూమిలో పోర్టులాకా మొక్కలను పెంచడం ప్రారంభించింది. అలా కేవలం ఐదు సంవత్సరాలలో తనహాబీని ఒక బిజినెస్ వెంచర్‌గా మార్చుకుంది.
ప్రస్తుతం కక్కనాడ్‌లోని ఇన్ఫోపార్క్‌లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా పనిచేస్తు, మరోవైపు తోట నుండి సంవత్సరానికి లక్షల్లో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తుంది. అంతేకాదు ప్యాకేజింగ్ , ఆర్డర్‌లను కొరియర్ చేయడం లాంటి పనులకోసం మరో ఇద్దరు మహిళలకు ఉపాధినిస్తోంది. భారతదేశం, థాయిలాండ్, బ్రెజిల్‌లోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన 300 రకాల పోర్టులాకా మొక్కలను పెంచుతోంది. పోర్టులాకా మొక్కల కాంబో ప్యాక్ ఆర్డర్‌లు రోజుకు 50-100 ఆర్డర్‌లను పూర్తి చేసే స్థాయికి చేరుకుంది. ఆమె నెలవారీ ఆదాయం. రూ. 1 లక్షకు పైమాటే. 300 రకాల మొక్కలు ఆమె దగ్గర ఉన్నాయి.
మొక్కల సంరక్షణ చూస్తున్నపుడు చాలా హాయిగా అనిపిస్తుంది.వారాంతంలో మొక్కలతోనే ఉంటారు. అది మిగిలిన వారానికి సరపడా ఉత్సాహాన్ని శక్తిని సంపాదించుకుంటారు. ‘నా మొక్కలే నాకు సర్వస్వం’ అంటారు పార్వతి. మంచి ఆదాయాన్ని సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషించేందుకు మన చుట్టూ అపారమైన అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి అంతే అంటారామె.
Comments
Please login to add a commentAdd a comment