‘అ’ అంటే ‘అమ్మ’.. ‘ఆ’ అంటే ‘ఆవు’ పాఠాలు కాదు కావలసినవి. అమ్మకు సాయం చేసే ఇంటి సభ్యుల పాఠాలే కావాలని కేరళ ప్రభుత్వం పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది. అమ్మ వంట చేస్తుంటే నాన్న ఆఫీసుకు వెళ్లే చిత్రాలతో ఉండే గత పాఠాలకు బదులు అమ్మకు వంటలో సాయం చేసే నాన్నలను ప్రవేశ పెట్టింది. ఆడపిల్లలను ఒక విధంగా, మగ పిల్లలను ఒక విధంగా కాకుండా అందరూ అన్ని పనుల్లో సమానమే అని చెప్పే పాఠాలు ఇప్పుడు అవసరం.
అంకుర స్థాయిలో విద్యాబోధన వేసే ప్రభావాలు చాలా గట్టివి. గతంలో ఇవి తెలియకుండా లింగ వివక్షను ప్రతిపాదించేవి. లేదా పరిమితులను నిర్థారించేవి. లేదా ఎవరి పనులు ఏమిటో, ఎవరి స్థాయి ఏమిటో స్టీరియోటైప్ చేస్తూ ముద్ర వేసేవి. టెక్ట్స్‌బుక్స్‌లో ఎప్పుడూ అమ్మ ఎప్పుడూ వంట చేస్తూ. అక్కకు జడ వేస్తూ. ముగ్గు వేస్తూ, ΄÷లం గట్ల మీద నాన్నకు క్యారేజీ తీసుకువెళుతూ, రోలు దంచుతూ, వెన్న చిలుకుతూ కనిపించేది.
నాన్న పడక్కుర్చీలో పేపర్ చదువుతూ ఉంటాడు. లేదా ఆఫీసుకు వెళుతూ లేదా ఆఫీస్‌లో పని చేస్తూ కనిపిస్తాడు. అంటే అబ్బాయిలు ఉద్యోగాలకి, అమ్మాయిలు ఇంటి పనికి పరిమితం కావాలని తెలియకనే మనసుల్లోకి ఎక్కేది. ఇప్పటికీ ఇలాంటి పాఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. కాని కేరళ రాష్ట్రం ఈ పద్ధతిని వదిలి ‘జెండర్ న్యూట్రల్’ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది.
ముందే నేర్పించండి
‘టీచ్ దెమ్ అర్లీ’ అని కేరళ ప్రభుత్వం కొత్త ధోరణిని ఎంచుకుంది. చిన్న వయసులోనే స్త్రీ, పురుష అస్తిత్వాల మధ్య వివక్షను చెరిపేసే పాఠాలు చె΄్పాలని నిర్దేశించింది. మూడవ తరగతి మలయాళం, ఇంగ్లిష్ టెక్ట్స్‌బుక్కుల్లో ఇంటి పనుల పాఠం ఉంది. మూడవ తరగతి టెక్ట్స్‌బుక్‌లో కొబ్బరి తురుము తీస్తున్న నాన్న వంటగదిలో కనిపిస్తే ఇంగ్లిష్ టెక్స్›్టబుక్‌లో పాపకు ఇష్టమైన చిరుతిండిని సిద్ధం చేస్తున్న తండ్రి కనిపిస్తాడు.
ఈ పాఠాలను ప్రస్తుతం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. ‘అయితే పాఠాల కంటే ముందు లింగ వివక్ష విషయంలో ఉపాధ్యాయులకు కూడా దృష్టి కోణంలో మార్పు తేవాలనే అవగాహనతో వేసవి సెలవుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాం’ అని తెలిపాడు కేరళ ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ జయప్రకాష్. ఇది మాత్రమే కాదు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రకాల జెండర్ల, వారి జీవన హక్కుల గురించి అవగాహన కలిగించే పాఠాలను కాలక్రమంలో స్కూల్ టెక్ట్స్‌బుక్కులు చేరుస్తామని కేరళ విద్యాశాఖ తెలిపింది.
ఐదవ తరగతి లోపు 200 రోజులు
ఈ విద్యా సంవత్సరం కేరళ విద్యాశాఖ తీసుకున్న మరో కీలక నిర్ణయం 1 నుంచి 5 వ తరగతి లోపు పిల్లలకు 200 పని దినాలు చాలని నిబంధన విధించడం. ప్రాథమిక విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతి లోపు పిల్లలకు 200 పని దినాల్లో 800 గంటల చదువు చాలు. అంతకు మించి చదివించడం వల్ల ఏం ప్రయోజనం ఉండటం లేదని ఉపాధ్యాయ సంఘం చేసిన సూచన మేరకు అక్కడి విద్యాశాఖ కొత్త నియమాన్ని అమలులోకి తెచ్చింది.
దీని వల్ల అన్ని స్కూళ్లు ఐదవ తరగతి లోపు పిల్లలకు వారానికి ఐదు రోజులే పని చేస్తాయి. ఉపాధ్యాయ సంఘం మరో సూచన కూడా చేసింది. బడి గంటలు పెంచి హైస్కూల్ తరగతులకు కూడా 200 రోజుల పని దినాలు చేయాలని. హైస్కూల్ సిలబస్‌లు పూర్తి కావాలంటే సంవత్సరంలో 1000 గంటలు పాఠాలు సాగాలని అందుకు వారానికి ఐదు రోజులు ఎక్కువ పీరియడ్లు చెప్పి శని, ఆదివారాలు సెలవు ఇవ్వొచ్చని సంఘం సూచించింది. దీనికి విద్యాశాఖ అనుమతించలేదు గాని పరిశీలనకు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment