పెళ్లిళ్లలో మోటు హాస్యాలు, స్నేహితుల ప్రాంక్‌లు శృతి మించుతున్నాయి. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టే సమయంలో వధూవరుల తలలను మెల్లగా తాడించాలనే సంప్రదాయం కేరళలో రభస సృష్టించింది. అల్లరి బంధువొకరు వధూవరుల తలలను పట్టి ‘ఠాప్పు’మనిపించడంతో వధువు బేర్‌మంది. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి బంధువు పరార్ అయ్యాడు.
మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. అత్తగారు కళ్లొత్తుకుంటూ ఇదంతా చూస్తూ కోడలితోపాటు నెత్తి కొట్టుకుంది. మొన్నటి శుక్రవారం సాజిలా అనే అమ్మాయికి, సచిన్ అనే అబ్బాయికి పెళ్లి జరిగింది. ఊరు పాలక్కాడ్‌లోని పల్లస్సేనా అనే చిన్న పల్లె. ఇక వరుణ్ణి, వధువును ఇంట్లోకి ఆహ్వానించాలి. మన దగ్గర ఆ సమయంలో కొన్ని హాస్యాలు, పరాచికాలు నడిచినట్టే అక్కడ కూడా ఏవో చిన్న చిన్న సరదాలు ఉంటాయి.
గుమ్మం ముందు నిలుచున్న వధువు సాజిలా, వరుడు సచిన్ బంధువులకు నమస్కారాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో చిన్న సాంగెం బాకీ ఉండిపోయింది. అదేంటంటే వధువు, వరుడు ఒకరి తలను ఒకరు మెల్లగా తాడించుకోవాలి. కాని దీనికోసమే వారి వెనుక చేరిన ఒక అల్లరి బంధువు ఇద్దరి తలలూ పుచ్చుకుని ఠపీమనిపించాడు. ఇందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని వధువు ఠారెత్తిపోయింది. కళ్ల ముందు చుక్కలు కనిపించి ఆ తర్వాత కన్నీటి చుక్కలు రాలి పడ్డాయి.
శుభమా అంటూ అత్తారింట్లో కాలు పెడుతుంటే ఏమిటిది అని ఆ అమ్మాయి ఆ వీడియోని తన ఇన్‌స్టాలో పెట్టింది. అంతే. క్షణాల్లో 20 లక్షల వ్యూస్ వచ్చాయి. కేరళ అంతా ఈ వీడియో ప్రచారమయ్యి ‘ఇలాంటి సాంగేలు ఇంకా ఉన్నాయా’ అని కొందరు, ‘కుర్రాళ్ల ప్రాంక్‌లు శృతి మించుతున్నాయ’ ని ఒకరు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. గగ్గోలు రేగేసరికి ఆ తలలు కొట్టించిన బంధువు ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు.
జరిగిందేదో జరిగింది అనుకుందామనుకున్నా ఈ లోపు కేరళ మహిళా కమిషన్ రంగంలో దిగి సుమోటోగా ఈ ఉదంతాన్ని తీసుకుంది. ‘వధువుకు ఎవరు ఇలాంటి బాధ కలిగించారో తేల్చండి’ అని తాకీదులిచ్చింది. యూట్యూబ్ చానెళ్లు వధూవరుల వెంట పడ్డాయి. ప్రచారం కోసమో సానుభూతి కోసమో వధువు విపరీతంగా తల పట్టుకుని ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇవన్నీ చూస్తూ పాపం పెళ్లికొడుకు, పెళ్లికొడుకు తల్లి తల కొట్టుకుంటున్నారు.
ఇదొక్కటే కాదు పెళ్లిళ్లలో పిచ్చిపనులు చేయాలనుకునేవారు బాగా తయారయ్యారు. పర్యవసానాలు అర్థం చేసుకుని నవ వధూవరులను సంతోషంగా సౌకర్యంగా ఉంచడమే అందరూ చేయవలసిన పని.
Comments
Please login to add a commentAdd a comment