కథాబాణాల విలుకాడు | Kotha Bangaram The Short The Long And The Tall Book | Sakshi
Sakshi News home page

కథాబాణాల విలుకాడు

Published Mon, Nov 30 2020 12:09 AM | Last Updated on Mon, Nov 30 2020 12:12 AM

Kotha Bangaram The Short The Long And The Tall Book - Sakshi

పరిచయం చేయడానికి అతిశయోక్తులు వాడవలసిన అవసరం లేని రచయిత జెఫ్రీ ఆర్చర్‌ కేవలం కథనంతోనే మాయాజాలాన్ని సృష్టించగలడు. ఈ సంవత్సరం ఆర్చర్‌ ఎనభై ఏళ్లు పూర్తిచేసుకున్న
సందర్భంగా, తను రాసిన తొంభైరెండు కథల్లో పాఠకులు మెచ్చిన ఇరవై కథలతో ప్రత్యేకమైన కథాసంపుటిని తీసుకురావాలన్న సంకల్ప ఫలితమే ‘ది షార్ట్, ది లాంగ్‌ అండ్‌ ది టాల్‌’. పాతకథలే అయినా,
ఇందులోని ప్రత్యేకత– పాల్‌ కాక్స్‌ గీసిన బొమ్మలు. చదువుతున్న కథని వదిలేసి వాటినే చూస్తూండేలా చేస్తుంటాయి!

చరిత్రని కల్పనతో కలగలిపిన కథలలోని చారిత్రకఘట్టం ప్రముఖమైనదైతే కథాపరికల్పన రాణిస్తుంది. ఆర్చర్‌ ఎంచుకునే చారిత్రకాంశాలు సరీగ్గా అలానే ఉంటాయి. క్రీస్తుశకపు ప్రారంభం గురించి రాసిన ‘ది
ఫస్ట్‌ మిరకిల్‌’ కథలోకి సూటిగా వెళ్లిపోయి, కథ ముగిసే సమయానికి ఆ అద్భుతాన్నంతా అనుభవింపజేయిస్తుంది. నాజీల కాలంలోని దురాగతాల్లో వాడిన గాస్‌ ఛాంబర్‌ని నిర్మించినవారి సంతతి
అనంతరకాలంలో అవమానభారాన్ని మోయక తప్పదు 

‘ది రోడ్‌ టు డమాస్కస్‌’ కథలో. భాషని బోధించిన జర్మన్‌ గురువునే ఒక ఆంగ్లేయుడు యుద్ధంలో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, జాతివిభేదాలకి
అతీతంగా మానవతాంశపు విలువలు ముందుకొచ్చి స్థిరంగా నిలబడటం వల్ల ‘ఎ గుడ్‌ టాస్‌ టు లూజ్‌’ అంతులేని ఉపశమనాన్ని కలిగిస్తుంది. రాజకీయాల్లో అవినీతిని గురించి రాసిన ‘క్లీన్‌ స్వీప్‌
ఇగ్నేషియస్‌’ కొసమెరుపు కథలాగా అనిపించినా, అవినీతి అనేది సార్వజనీనం. ఒక బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి నేపథ్యంగా రాసిన ‘ది గ్రాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ గ్రీనర్‌’ కథలో ప్రతి ఉద్యోగీ తనకంటే పైవాణ్ణి చూసి
అసూయపడేవాడే. మరి అందరికంటే పైనున్న బ్యాంక్‌ చైర్మన్‌ ఎవర్ని చూసి అసూయ పడాలి? ఆర్చర్‌ చెప్పిన సమాధానంలో కథాతాత్వికత నిండివుంటుంది. 

ప్రేమకంటే మరేవో అంశాలు ముందుకొచ్చి కనిపిస్తుండే ప్రేమకథలు ఆర్చర్‌ ప్రత్యేకత. ‘వన్‌ మాన్స్‌ మీట్‌’లోని అబ్బాయి, అమ్మాయిల మధ్య చదువుల్లో స్పర్ధలు ప్రధానంగానూ, ‘క్రిస్టినా రోసెంథాల్‌’లో
పరస్పర విముఖత ప్రధానంగానూ కనిపిస్తాయి. మొదటికథలోని నాలుగు ముగింపులూ ఎంత వైవిధ్యభరితంగా ఉంటాయో, రెండోకథలోని రెండు ముగింపువాక్యాలూ అంత విషాదభరితంగా ఉంటాయి.
వ్యాపారాలు, మోసాలు, ఎత్తుకి పైఎత్తులు ఆర్చర్‌కి ఇష్టమైన సబ్జక్ట్‌. సగం ధరకే నగని సంపాదించినట్టు కనిపించే ‘చీప్‌ ఎట్‌ హాఫ్‌ ప్రైస్‌’, ఉంగరాన్ని షాప్‌నుంచి దొంగిలించడానికి వేసిన పథకంతో ‘స్టక్‌ ఆన్‌
యు’ ఈ తరహా కథలు. ఈ రెండు కథల్లోని వాతావరణ పోషణ, సూక్ష్మవివరాల పట్ల రచయిత పరిశీలనని ప్రస్ఫుటపరుస్తుంది. 

సాహిత్యం నేపథ్యంగా సాగే ‘ఎ జెంటిల్‌మన్‌ అండ్‌ ఎ స్కాలర్‌’లో షేక్స్‌పియర్‌
సాహిత్యం అంతర్వాహిని అయితే, ‘ఎ వేస్టెడ్‌ అవర్‌’లో ప్రముఖ రచయిత జాన్‌ స్టైన్‌బెక్‌ ప్రధానపాత్ర. ఈ కథల్లోని భాషాచాతుర్యం ప్రత్యేకంగా గమనించవలసిన అంశం. ఆర్చర్‌ కథల్లో పైకి కనిపించే వస్తువు
మాటున మరో అంశం కూడా తొంగిచూస్తుంటుంది. ‘హూ కిల్డ్‌ ద మేయర్‌’ కథలో హత్యోదంతం ప్రధానస్రవంతి, మరో ప్రేమకథ ఉపాంగం. ‘ది క్వీన్స్‌ బర్త్‌డే టెలిగ్రాం’ కథలో వందవ పుట్టినరోజు జరుపుకోవడం
ప్రధానాంశమే కానీ, ఆలస్యంగా వెలుగుచూసే రహస్యాలు కొసరు కథ. దీనికి విరుద్ధంగా ఆర్చర్‌ చేసే ప్రయోగం మరోటుంది. ‘నెవర్‌ స్టాప్‌ ఆన్‌ ద మోటార్‌వే’ కథలో హంతకుడు వెంబడిస్తున్నాడనుకోవడం
భ్రమ; గమనించని నిజం వేరే ఉంటుంది. అలానే, ‘ఇట్‌ కాన్ట్‌ బి అక్టోబర్‌ ఆల్‌రెడీ’ కథలోని పాత్ర చెబుతూండే అసంపూర్ణ కథే అసలుకథ అనే భ్రమ నుంచి, ఒక పాత ఐరిష్‌ జోక్‌లోకి మారిపోవడం
బాగుంటుంది.

 ""... but however hard she tried she could not be other than beautiful'' అంటాడు కథకుడు ఒక కథలో. ఈ సంపుటిలో రెండుమూడు కథలు చేర్చి ఉండకపోయినా ఫరవాలేదు అనిపిస్తుంది కానీ, అవి కూడా ‘బ్యూటిఫుల్‌’ కథలే! ముఖ్యంగా– అవి కూడా ఆర్చర్‌కి నచ్చిన కథలే కావడం వల్ల.  
-ఎ.వి.రమణమూర్తి
9866022150 

పుస్తకం: ది షార్ట్, ది లాంగ్‌ అండ్‌ ది టాల్‌
రచన: జెఫ్రీ ఆర్చర్‌
ప్రచురణ: సెయింట్‌ మార్టిన్స్, 2020

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement