భిన్న సంప్రదాయం
కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దానికి కృతజ్ఞత ప్రకటించే పండుగ చేసుకోవాలి గదా. నేపాలీలకు శునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి మరుసటి రోజును ‘కుకుర్ తిహార్’ పేరుతో శునకాల పండుగ నిర్వహిస్తారు. ఆ రోజు పెంపుడు శునకాలకు, వీధి కుక్కలకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. మూగ జీవులకు మనిషి ఆశ్రయం ఇచ్చి వాటిని పెంచాలనే సందేశం ఈ పండుగలో ఉంది.
నేపాల్‌లో శునకాల మీద ప్రేమ బాల్యం నుంచి నేర్పిస్తారు. అక్కడ దీపావళి పండుగ ఐదు రోజుల పాటు చేస్తారు. మొదటి రోజు దీపావళి అయితే రెండోరోజు ‘కుకుర్ తిహార్’. అంటే శునకాల పండుగ. ఆ రోజున శునకాలకు పూజ ఎలా చేయాలో ఇళ్లల్లో ఉన్న నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు నేర్పిస్తారు. ‘పిల్లలూ... మనిషిని ఏ స్వార్థం లేకుండా ప్రేమించే జీవి కుక్క ఒక్కటే. అది మనతోపాటే ఉంటుంది. మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది. అంతేకాదు... మనం చనిపోయాక స్వర్గం వరకూ దారి చూపించేది అదే. అందుకే దానికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టాలి. కుకుర్ తిహార్ రోజు దానికి పూజ చేసి నమస్కరించుకోవాలి’ అని చెబుతారు.
నేపాలీలు తరతరాలుగా ఇలా ఈ సంప్రదాయాన్ని అందిపుచ్చుకుని ‘కుకుర్ తిహార్’ నిర్వహిస్తారు.
కుంకుమ బొట్టు... బంతి పూల మాల
‘కుకుర్ తిహార్’ రోజు పెంపుడు కుక్కలకు గాని, ఇంటి కుక్కలకు గాని ప్రతి ఇంటి వారు తప్పక పూజ చేస్తారు. పూజలో మొదట కాళ్లు కడుగుతారు. ఆ తర్వాత దానికి పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. ఆ తర్వాత నేత దారంతో చేసిన దండ తొడుగుతారు. ఆపైన బంతి పూల మాల వేస్తారు. ఆ పైన హారతి ఇచ్చి నమస్కరించుకుంటారు. ఇక అప్పుడు దానికి కొత్త బంతి, కొత్త బొమ్మలు ఇచ్చి ఉడికిన గుడ్లు, బిస్కెట్లు లాంటివి తినిపిస్తారు. కుక్కలు కూడా బుద్ధిగా కూచుని ఇవన్నీ చేయించుకుంటాయి. తమ యజమానులను మరింతగా ప్రేమిస్తాయి.
విశ్వాసానికి కృతజ్ఞత
కుక్కలా విశ్వాసంగా ఉండే జీవి మరొకటి లేదు. చరిత్రలు దాదాపు 14 వేల సంవత్సరాల క్రితం నుంచే మనిషికి, కుక్కకు స్నేహం కుదిరిందని ఆధారాలు చెబుతున్నాయి. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కుక్క. నేపాలీలు మరో అడుగు వేసి కుక్క యముడికి తోడుగా వస్తుందని భావిస్తారు. మృత్యు సమయంలో అది సహాయంగా ఉండి దారి చూపుతుందని నమ్ముతారు. అందుకే కుకుర్ తిహార్ ఎంతో శ్రద్ధగా జరుపుతారు. మరో విషయం ఏమిటంటే కుక్కలకే కాదు మూగ జీవులకు ఆశ్రయం ఇవ్వడం మనిషి బాధ్యత అని, వాటిని పోషించే ఓర్పు మనిషికి ఉండాలని చెప్పడానికి కూడా ఈ పండుగ జరుపుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment