కుక్కకు... ప్రేమతో..!
ఖాట్మండ్: ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుందని ఇంగ్లీషు సామెత. నిజమే కానీ.. కుక్కల కోసం ఒక రోజును డెడికేట్ చేసిన దేశం ఉంది తెలుసా.. అంతే కాదు.. ఆరోజు తమ పెంపుడు కుక్కలకు పూజలు కూడా చేస్తారు. ఈ వింత ఆచారం మన పొరుగున ఉన్న నేపాల్ లో ఉంది.
ప్రతి ఏటా నేపాల్ లో జరిగే.. తిహర్ పండగ సందర్భంగా నేపాల్ వాసులు తమ పెంపుడు కుక్కలను పూజిస్తారు. నేపాలీల ముఖ్య మైన పండుగల్లో తిహర్ ఒకటి. మన దేశంలో దీపావళిని పోలి ఉండే ఈ పండుగను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో రెండో రోజును కుక్కల కోసం కేటాయించారు. దీన్నే 'కుకుర్ తిహర్' గా వ్యవహరిస్తారు. మనుషులకు అత్యంత విశ్వాస పాత్రమైన ఈ నాలుగు కాళ్ల జీవిని ఈ సందర్భంగా గౌరవించుకుంటారు.
రుగ్వేదంలో ఇంద్రుడు తన గోవులను కనుగొనటంలో సమర అనే కుక్క సహాయ పడిందని.. అప్పటి నుంచి శునకాన్ని పూజించటం మొదలైందని నేపాలీలు భావిస్తారు. అంతేకాకుండా.. కుక్క యముడి దూత అని ఇక్కడి వారి నమ్మకం. అందువల్ల కుక్కను గౌరవించాలని అంటారు నేపాల్ వాసులు. అంతే కాదు.. పశువులను పూజించడం తిహర్ ఉత్సవాల ప్రత్యేకత.. నాలుగు రోజుల్లో ప్రతి రోజు ఒక జంతువును పూజిస్తారు.
కుకుర్ రోజు తమ పెంపుడు కుక్కు నుదుటన తిలకం దిద్ది, దాని మెడలో పూల మాల వేసి.. సత్కరిస్తారు. మానవుడికి అత్యంత విశ్వాస పాత్రంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ పూజిస్తారు. అయితే కుక్కలను ప్రత్యేకంగా గౌరవించే ఈ రోజుపట్ల ప్రపంచ వ్యాప్తంగా కుక్కల ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.