మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమానందకరం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు. భారతనేతగా గాంధీ, భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహుదూర్ శాస్త్రి చరిత్రకు చెప్పలేనంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆధునిక నాయకులు. ఇద్దరి ముగింపు విషాదాంతమైంది. గాంధీ తుపాకీ కాల్పులకు గురియై మరణించారు.లాల్ బహుదూర్ మరణం అనుమానాస్పదం. హత్యకు గురిఅయ్యారనే భావనే ఎక్కువమందిలో ఉంది. లాల్ బహుదూర్ శాస్త్రి చాలా గొప్పవాడైనా, గాంధీ-నెహ్రూ ప్రాభవం మధ్య చరిత్రలో, లోకంలో రావాల్సినంత పేరు రాలేదని చరిత్రకారుల అభిప్రాయం.
గాంధీ భారతీయ ఆత్మ. ఆత్మాభిమానం రూపం దాల్చుకుంటే అది లాల్ బహుదూర్. ఇంత ఆదర్శవంతమైన లాల్ బహుదూర్ శాస్త్రి.. జవహర్ లాల్ నెహ్రూకు, గాంధీకి ప్రియ శిష్యుడు. మహాత్మాగాంధీ జీవితం ఒక ప్రయోగశాల. కేవలం భారతదేశానికే కాదు, ఎల్ల ప్రపంచనాయకులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహానాయకుడు గాంధీ. సత్యాగ్రహం,అహింస అనేవి గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలు. ధర్మాగ్రహంతో,న్యాయాగ్రహంతో సత్యాగ్రహంతో అహింసా మార్గంలో నడిచి,భారతదేశానికి బ్రిటిష్ శృంఖలాల నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛను ప్రసాదించాడు. భగవద్గీతను ఆశ్రయించాడు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించాడు, న్యాయపోరాటంలో గాంధీ జాతికి జయాన్ని కానుకగా ప్రసాదించాడు.భారతదేశ చరిత్రలో ఆధునిక కాలంలో,స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత్ కు తొలి విజయాన్ని అందించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి.
1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి, గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి. 20వ శతాబ్దంలో ప్రపంచమానవాళిని ప్రభావితం చేసినవారిలో మహాత్మాగాంధీదే అగ్రస్థానం.సత్యాగ్రహం, సహాయనిరాకరణ గాంధీ ఎంచుకున్న శక్తిమంతమైన ఆయుధాలు.వీటి విలువను ప్రపంచదేశాలు అర్ధం చేసుకోడానికి చాలా కాలం పట్టింది.ఇప్పటికీ చాలా దేశాలకు అసలు అర్ధమే అవ్వలేదు.హిందూ-ముస్లింల మత సామరస్యానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ అంశమే అతన్ని బలితీసుకుంది. టాల్ స్టాయ్ ను గాంధీ గురువుగా భావించాడు.సామ్రాజ్యవాదం, హింసా విధానాలపై వ్యతిరేకత వీరిద్దరినీ మానసికంగా కలిపింది. గాంధీ జీవితం మొత్తం సత్యశోధనకు అంకితం చేశారు. తను చేసిన తప్పులను తెలుసుకోవడం,వాటి నుంచి నేర్చుకోవడం మార్గంగా సాగారు.
అందుకే గాంధీ ఆత్మకథకు 'సత్యశోధన' అని పేరు పెట్టుకున్నారు. సత్యంతో చేసిన ప్రయోగాలే అతని జీవితం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తిగా నిలిచినవాడు మహాత్మాగాంధీ.ఇటువంటి వ్యక్తి నిజంగా మన మధ్యనే జీవించాడంటే? తర్వాత తరాలవారు నమ్మలేరని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్య అజరామరం. జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరించాడని మరో మహానేత మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు.నా జీవితమే సందేశం,అని గాంధీయే అన్నాడు. ఇంతటి గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి,నిజాయితీ, ప్రయోగాలు,పవిత్రత,సత్యం, ఆత్మాభిమానం ఉఛ్వాసనిశ్వాసలుగా జీవించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూత్న ప్రయోగాలు ఆవిష్కరించాడు.
జవానులను, రైతులను సమానంగా భావించాడు. ఒకరు యుద్ధక్షేత్రంలో ఉంటారు. ఇంకొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు.జై జవాన్-జై కిసాన్ నినాదం తీసుకువచ్చినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రెవల్యూషన్) కు బాటలు వేసింది కూడా ఈయనే. పంటకు ఎంత విలువ ఇచ్చాడో, పాడికి కూడా అంతే విలువ ఇచ్చాడు.శ్వేతవిప్లవం ఈయన తెచ్చిందే.సోవియట్ యూనియన్, శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకొని బంధాలను గట్టి పరచి, విదేశీ విధానంలోనూ తన ముద్ర వేసుకున్నాడు.నెహ్రు క్యాబినెట్ లో మొట్టమొదటి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి.
దేశంలో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.అన్నేళ్లు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు.కుటుంబ సభ్యుల ఒత్తిడితో అప్పుచేసి కారు కొనుక్కున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే? మహాత్మాగాంధీ , జవహర్ లాల్ నెహ్రు విధానాలకు లాల్ బహుదూర్ శాస్త్రి ఆత్మీయమైన అసలు సిసలు వారసుడు.ఆర్ధిక విధానాలలో నెహ్రును కూడా దాటి ముందుకు వెళ్లారు.మరో గాంధీ పుట్టడు, మరో లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టడు.వీరి సిద్ధాంతాలు, ఆచరించిన మార్గాలు ప్రస్తుత కాలంలో ఆచరించడానికి కష్టమైనా,ఏదో ఒక రోజు వీరిని తప్పక అనుసరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ మహానేతలు సర్వకాలీనులు. వీరి సిద్ధాంతులు ఎప్పటికీ అవసరంగానే నిలుస్తాయి.
-మాశర్మ సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment