ముఖ కవళికలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి మంచి సాధనం మేకప్. ఒకప్పుడు అందాన్ని పెంచడానికి వాడే ఈ సాధనం నేడు అనేక రకాల మేకప్ ట్రెండ్స్‌తో కొత్త పుంతలు తొక్కుతోంది. మేకప్‌లో సరికొత్త మెళకువలతో చిత్ర విచిత్ర జిమ్మిక్కులను ఆకర్షణీయంగా రూపొందించి అలరిస్తున్నారు కళాకారులు.
మేకప్ మీద ఉన్న మక్కువతో చేస్తోన్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి మంచి ఆర్టిస్ట్‌గా మారింది ప్రియాంక పన్వర్. దేశవిదేశాల్లోని ప్రముఖ సెలబ్రెటీల ముఖాన్ని తన ముఖంపై చిత్రించి ఔరా అనిపిస్తోంది. దివికేగిన ఎంతో మంది సెలబ్రెటీలకు సైతం తన మేకప్ ద్వారా నివాళులర్పిస్తోంది.
ఆసక్తి లేకపోవడంతో..
ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంక పన్వర్ ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తరువాత, రెగ్యులేటరీ అఫైర్స్‌లో ఉద్యోగం చేసుకుంటూ బిజీగా ఉండేది. ఉద్యోగంలో చేసే పని బావున్నప్పటికీ తనకి పెద్ద ఆసక్తి ఉండేది కాదు.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. తనకి ఎంతో ఇష్టమైన కెనడాకు చెందిన ఇల్యూషన్ ఆర్టిస్ట్ ‘మిమి చాయిస్’ మేకప్ వీడియోలను చూస్తూ తను కూడా ఆమెలానే ఆర్టిస్ట్ కావాలనుకుంది. అనుకున్న వెంటనే బేసిక్ మేకప్ కోర్సు నేర్చుకుంది. తనకు నచ్చిన సెలబ్రెటీల రూపాలను వేయడం ప్రారంభించి చక్కగా వేయడం వచ్చాక చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ఇల్యూషన్ మేకప్‌కు కేటాయించింది.
అతని మరణ వార్త విని..
తనకు నచ్చిన ముఖ కవళికలను మేకప్ మెళకువలతో అందంగా రూపొందిస్తూ ‘మేకప్ బై ప్రియాంక పన్వర్’ పేరుతో ఉన్న తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేస్తుండేది. ప్రియాంక మేకప్ వీడియోలు నెటిజనులకు నచ్చుతుండడంతో మరింత ఉత్సాహంతో ఇల్యూషన్ స్కెచ్‌లు వేస్తుండేది. సుశాంత్ రాజ్‌పుత్‌సింగ్ ఇక లేడన్న వార్త తెలియడంతో .. మేకప్‌తో తనముఖంపై సుశాంత్ ముఖాన్ని చిత్రించి నివాళులు అర్పించింది.
సుశాంత్ రూపం తీసుకురావడానికి ఏడు గంటలపాటు కష్టపడి పనిచేసింది. తొలి సెలబ్రెటీ రూపం అయినప్పటికీ ఎంతో చక్కగా వచ్చిందని వ్యూవర్స్ కామెంట్స్ చేయడంతో ఆమె అప్పటినుంచి ఇల్యూషన్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోంది.
సెలబ్రెటీల నుంచి సినిమాలదాకా
సుశాంత్ సింగ్‌ముఖంతో ప్రారంభమైన ప్రియాంక ఇల్యూషన్ మేకప్ ఆ తరువాత విరాట్ కోహ్లి, మనీ హీస్ట్ నటులు, బప్పీ లహరీ, రాజ్‌కుమార్ రావ్, అల్లు అర్జున్, గురురంధ్వా, కెల్లీ జెన్నర్, బిల్లీ పోర్టర్, దిల్జిత్ సింగ్, మిల్కా సింగ్, మొన్న హత్యకు గురైన గాయకుడు మూసావాల రూపాలను చక్కగా తీర్చిదిద్ది వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
సెలబ్రెటీల ముఖాలేగాక ‘రే’ సినిమాలోని కేకే మీనన్ క్యారెక్టర్‌ను తన ఇల్యూషన్ ఆర్ట్‌తో చక్కగా తీర్చిదిద్దింది. ఎంతోమంది సెలబ్రెటీల రూపాలు చిత్రించిన ప్రియాంక తన నానమ్మ ముఖాన్ని చిత్రించిన వీడియో బాగా వైరల్ అయ్యింది.
మనసు పెడితే కష్టం కాదు
మేకప్‌లో చిన్న తప్పు జరిగినా మొత్తం పాడైపోతుంది. అనుకున్న రూపు రేఖలు రావు. ఇల్యూషన్ ఆర్ట్ సవాలుతో కూడుకున్నదైనప్పటికీ మనసుపెట్టి వేస్తే పెద్ద కష్టం కాదు. ఒక్కో ముఖాన్ని అచ్చుగుద్దినట్టు తీసుకురావడానికి కొన్ని గంటలు పడితే, మరికొన్నింటికి రోజంతా పడుతుంది. త్రీడి ఇమేజ్ రావాలంటే చాలా కష్టపడాలి.
యాక్సెసరీస్, విగ్స్, లెన్స్, అవుట్ ఫిట్స్ అన్నీ చక్కగా కుదిరితేనే ఇల్యూషన్ ఇమేజ్ చక్కగా వస్తుంది. ‘‘ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ బాత్ర, జీత్‌లాల మా నానమ్మ ముఖాలు నేను రూపొందించిన వాటిలో నాకు బాగా నచ్చినవి. – ప్రియాంక పన్వర్
చదవండి: వ్యర్థాల నుంచి అర్థాలు: హీనంగా చూడకు దేన్నీ పనికొచ్చేవేనోయ్ అన్నీ!
Comments
Please login to add a commentAdd a comment