జంతు పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ప్రతిసారి వారికి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. లండన్‌కు చెందిన పరిశోధక బృందం ఇప్పుడు ఓ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. భారీ సైజులో ఊలుతో ఉండే మంచు ఏనుగులు (మమోత్) అంతరించిపోయే ముందు మనుషులతో కలసి నివసించాయని వారి పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు ఉన్న ఇంగ్లండ్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 12,800 ఏళ్ల క్రితం వరకూ ఇవి సంచరించాయని గతంలో భావించారు.
తొలి తరం మానవులు సుమారు 10,500 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో కూడా ఇవి ఇక్కడ ఉన్నాయని ఇప్పుడు నిర్ధారించారు. గతంలో పరిశోధనల్లో.. పశ్చిమ మధ్య ప్రాంతంలో మానవులు వాటిని చంపేశారని చెబుతూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా ఈశాన్య ప్రాంతంలో మమోత్‌లు మానవులతో కలసి చాలాకాలం జీవించాయని డార్ట్ మౌట్ కాలేజీ ప్రొఫెసర్లు చెప్పారు. వెర్మాంట్ ప్రాంతంలో 1848లో దొరికిన మంచు ఏనుగు పక్కటెముకను రేడియో కార్బన్ డేటింగ్, 3డి ప్రక్రియల ద్వారా పరిశీలించి వీరు ఈ విషయాన్ని వెల్లడించారు.
పర్యావరణ మార్పులతోనే..
ఈశాన్య ప్రాంతంలో నివసించిన మంచు యుగానికి చెందిన జీవుల్లో మమోత్ ఆఖరిదని పరిశోధకులు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పరిశోధనల్లో మమోత్‌లు అంతరించిపోవడానికి మానవుల వేట కూడా కారణమని నమ్మారు. అయితే అవి కనుమరుగు కావడానికి ఈ ప్రాంతంలో మంచు కరిగిపోవడం కూడా కారణమని తాజా పరిశోధనల్లో తేలింది. మనిషి, మమోత్ కలసి జీవించాయనే విషయం తొలిసారి తెలిసిందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. 18, 19 వేల ఏళ్ల క్రితం నుంచి ఇంగ్లండ్ ప్రాంతంలో మంచు కరగడం ప్రారంభమైందని, కొన్ని వేల ఏళ్ల తర్వాత ప్రస్తుత ఇంగ్లండ్ దేశం ఏర్పడిందని పరిశోధనల్లో కనుగొన్నారు. అంతరించి పోయిన మమోత్ శిలాజాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. అలాంటి వాటిని ఇంగ్లండ్‌లోని పలు మ్యూజియాల్లో భద్రపరిచారు. హుడ్ మ్యూజియంలో ఉన్న ఎముక శిలాజంపై ఆ బృందం పరిశోధనలు చేసింది.
మమోత్‌ల గురించి మరిన్ని విషయాలు
- సుమారు 1,40,000 ఏళ్ల పాటు ఊలీ మమోత్‌లు యూరప్, నార్త్ అమెరికా ప్రాంతంలో నివసించాయి. మంచు యుగాంతంలో అంటే సుమారు 10 వేల ఏళ్ల క్రితం ఇవి అంతరించిపోయాయి.
- మంచు యుగానికి సంబంధించిన విషయాలు ఈ మమోత్ శిలాజాలతో మనకు తెలుస్తున్నాయి.
- మమోత్‌లలో మగవి 12 అడుగుల ఎత్తు ఉండేవి. ఆడవి వాటికన్నా కొంచెం చిన్నగా ఉండేవి.
- వాటి మెలితిరిగిన దంతాలు సుమారు 16 అడుగుల పొడవు ఉండేవి. గడ్డిని తుంచడానికి దంతాల చివర్న రెండు వేళ్లు వంటి అవయవాలు ఉండేవి.
- వాటికి ఉన్న ఊలు వెంట్రుకలు సుమారు 3 అడుగుల పొడవు ఉండేవి.
- మమోత్‌లకు చిన్న చెవులు, చిన్న తోక ఉండేది. ఇవి వీటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా చూసేవి.
- ఇప్పటి ఏనుగులకు, అప్పటి మమోత్‌లకు చాలా సారూప్యం ఉందని, 99.4 శాతం జీన్స్ షేరింగ్ ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- మాంసం, ఆయుధాల తయారీకి ఊలీ మమోత్‌లను మనుషులు చంపి ఉంటారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment