ప్రభుత్వాలు నేరస్తులను పట్టుకునేందుకు రివార్డులు ప్రకటించడం చూశాం. అంతగా లేకపోతే కాస్త ధనవంతులు తమ వాళ్ల కోసం, లేదా పోయిన వస్తువులు తీసుకొస్తే వేలల్లో డబ్బిస్తామని ప్రకటించడం విని ఉంటారు. ఇలాంటి ప్రమాదకరమైన వింత ప్రకటన గురించి మాత్రం విని ఉండరు. ఇలాంటి వింత ప్రకటన ఇచ్చిన తొలి ప్రభుత్వం ఆ దేశమే కాబోలు. ఏం జరిగిందంటే..
బంగ్లాదేశ్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ షాహ్ మద్ ఇష్తియాక్ ఆరిఫ్ ఓ వింత ప్రకటన చేశాడు. ఆయన ఎవరైనా.. రక్తపింజరి పాముని చంపితే వారికి రూ. 35 వేలకుపైగా పారితోషకం ఇస్తామని ప్రకటించాడు. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది కూడా. ఆ తర్వాత రోజునే మాట మార్చి రక్తిపంజరిని పట్టుకొచ్చిన వారికే ఆ రివార్డు అని ప్రకటించాడు ఆరిఫ్. అయితే అలియాబాద్ యూనియన్‌లో రెజాల్ అనే రైతు ఈ విషయం తెలుసుకుని బహుమతి ఎలాగైన పొందాలని అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా రక్తపింజరని రెజాల్ తన స్నేహితుల సాయంతో ప్రాణాలు పణంగా పెట్టి మరీ పట్టుకున్నాడు.
దాన్ని ఓ పెద్ద వంటపాత్రలో ప్యాక్ చేసి నేరుగా ఫరిదీపూర్ ప్రెస్‌క్లబ్‌కి తీసుకువచ్చాడు. అయితే ఆ ప్రభుత్వం రెజాల్‌కు మొండి చేయి చూపి ఇంతవరకు ఎలాంటి పారితోషకం అందజేయలేదు. ఇక ఎదురు చూసి.. చూసి.. రెజాల్ రెండు రోజుల క్రితమే ఆ పాముని చంపినట్లు తెలిపాడు. ఇలా రెజాల్ మాదిరిగా చాలామంది ఆ ప్రకటనను చూసి రక్తపింజర్లను పట్టుకుని నగరానికి వస్తుండటం గమనార్హం. వారందరికీ కూడా ఎలాంటి రివార్డు దక్కలేదు. అయితే సదరు పార్టీ నేత మాటమార్చి.. పాములు పర్యావరణంలో భాగమే. కాకపోతే ఫరీద్‌పూర్ ప్రజలు వీటివల్ల భయపడుతున్నారని ఇలా ప్రకటించామే తప్ప ప్రతిఫలం ఇస్తామనలేదంటూ బుకాయించాడు.
పైగా ప్రకటించిన రివార్డు గురించి ఊసెత్తిన పాపాన పోలేదు. అబ్బా..! నాయకులు ఎంతలా మాట మార్చగలరు అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇలా ప్రకటించడం చట్ట విరుద్ధమని ఫరీద్‌పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గోలమ్ ఖుద్దూస్ భుయాన్ అన్నారు. నిజానికి ఈ పారితోషకం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు వారంతా..ఒకవేళ ఆ క్రమంలో చనిపోవడం లేదా గాయపడటం జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రకటనలు కారణంగా చాల పాములు చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. వాటిని పట్టుకున్న వారంతా మనుషులు సంచరించిన ప్రదేశంలో విడిచిపెట్టాలని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment