విజయసారథి... మీనాక్షి నేగి
‘క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్’ అని పిలుచుకునే సిమ్లా(హిమాచల్‌ప్రదేశ్)లో డ్రైవింగ్ అనేది అంత సులభమేమీ కాదు. అలాంటి చోట ‘సూపర్ డ్రైవర్’గా ప్రశంసలు అందుకుంటోంది మీనాక్షి నేగి. కిన్నార్ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షికి ‘డ్రైవింగ్’ను వృత్తిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రిలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది కానీ కుదరలేదు.
తమ ఇద్దరు పిల్లలను బైక్ మీద స్కూలుకు తీసుకెళుతుండేది మీనాక్షి. అప్పుడప్పుడూ ఇరుగింటి, పొరుగింటి వారు కూడా తమ పిల్లల్ని బైక్‌పై బడికి తీసుకెళ్లడానికి మీనాక్షి సహాయం తీసుకునేవారు. ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకునేవారు.
ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే, డ్రైవింగ్‌నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు? అనుకుంది మీనాక్షి. తన ఆలోచనకు ఎవరూ‘యస్’ చెప్పలేదు. ఇక వెటకారాలు సరేసరి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ట్యాక్సీ (కార్) కొనుగోలు చేసింది. వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి.
భర్త, అత్తామామలను ఒప్పించడం చాలా కష్టం అయింది.
‘ఏనుగును మేపడం ఎంతో ఇది అంతే’ అన్నారు.
సరిగ్గా అదే సమయంలో కోవిడ్ లాక్‌డౌన్ వచ్చింది.
బండి తెల్లముఖం వేసింది.
వాయిదాలు కట్టడం మీనాక్షికి కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెలో ధైర్యం సడలలేదు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా!’ అనుకుంది. అదే నిజమైంది. లాక్‌డౌన్ ఎత్తేశారు. మెల్లగా బండి వేగం పుంజుకుంది.
‘డ్రైవింగ్ వృత్తిలో మగవాళ్లు మాత్రమే ఉంటారు... అని చాలామంది నమ్మే సమాజంలో ఉన్నాం. మహిళలు నడిపే వాహనాల్లో ప్రయాణించడానికి తటపటాయిస్తుంటారు. అలాంటి వారికి నా డ్రైవింగ్‌తోనే సమాధానం చెప్పాను. వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది, భర్త,అత్తమామలు కూడా మెచ్చుకోవడం మరో ఆనందం’ అని చెబుతుంది నలభై రెండు సంవత్సరాల మీనాక్షి.
హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ట్యాక్సీ నడుపుతుంది మీనాక్షి. అయితే, ప్రయాణికుల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇస్తుంది.
మీనాక్షి ఇప్పుడు పేదమహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పిస్తుంది.
‘ఉపాధి అనేది తరువాత విషయం. డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్ విజయాలకు ఇది పునాది’ అంటుంది మీనాక్షి.
మీనాక్షి నేగి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
సిమ్లాలో ఫస్ట్ ఉమెన్ ట్యాక్సీడ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేయాలనేది ఆమె కల.
యూనియన్ సరే, అంతమంది మహిళా ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కడి నుంచి వస్తారు? అనే సందేహం ఉంటే, మీనాక్షి నేగి నుంచి స్ఫూర్తి పొందిన మహిళలను పలకరించండి చాలు. నేగి కల సాకారం కావడానికి ఎంతోకాలం పట్టదని తెలుసుకోవడానికి!
Comments
Please login to add a commentAdd a comment