అపర్ణా టాండలే (PC: Aparna Tandale Instagram)
గత సంవత్సరం టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్‌గా యూ ట్యూబ్ ప్రకటించిన వారిలో 22 ఏళ్ల అపర్ణా టాండలే ఉంది. మన దేశంలో ఇంటింటా తెలిసిన పని మనిషి పాత్రను చీపురు పట్టి హాస్యం చిలికేలా పోషించడమే అపర్ణా సక్సెస్‌కు కారణం. ఆమె చేసే ‘కామ్‌వాలీ బాయి’ వీడియోలకు 37 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు.
3 కోట్ల వ్యూస్
అపర్ణ చేసిన ‘బారిష్ మే భీగ్‌నా’ (వానలో తడవడం) అనే మూడు నిమిషాల వీడియోకు 3 కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఆమె ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. అపర్ణ పరిచయం. పని మనిషి అప్పుడే ఇల్లు తుడిచి మొత్తం శుభ్రం చేసి ఉంటుంది. అంతలో కాలింగ్‌బెల్ మోగుతుంది.
‘బారిష్ మే భీగ్‌నా’
తలుపు కన్నం నుంచి చూస్తే వానలో పూర్తిగా తడిసి వచ్చిన అమ్మగారూ, అయ్యగారూ. పని మనిషి గతుక్కుమంటుంది. ‘అమ్మో.. ఇప్పుడు వీళ్లు ఇంట్లోకి వస్తే ఇల్లంతా నీళ్లు, బురదా. మళ్లీ పనంతా చేయాలి’ అనుకుంటుంది. అంతే. తలుపుకు ఇంకో బోల్టు పెట్టేస్తుంది. అమ్మగారు కాలింగ్ బెల్ నొక్కితే బోల్ట్ తీస్తున్నట్టుగా నటిస్తూ ‘అమ్మా... బోల్ట్ స్ట్రక్ అయ్యింది’ అని లోపలి నుంచి అరుస్తుంది.
బయటి నుంచి అమ్మగారి పిలుపులు... లోపలి నుంచి తలుపు రావడం లేదని పని మనిషి అరుపులు. తడిసి వచ్చిన అమ్మగారిని, అయ్యగారిని ఇంటి బయటే గంట సేపు కూచోబెట్టి ఈ లోపు హాయిగా టీవీ చూస్కుంటూ వాళ్లు పూర్తిగా ఆరారు అని తేల్చుకున్నాక అప్పుడు తలుపు తీస్తుంది పని మనిషి. ఇది అపర్ణా టాండాలె తీసిన మూడు నిమిషాల‘బారిష్ మే భీగ్‌నా’ షార్ట్ వీడియో. సూపర్‌హిట్ అయ్యింది. మూడు కోట్ల వ్యూస్ వచ్చాయి.
పూణె అమ్మాయి
పూణెకు చెందిన 22 ఏళ్ల అపర్ణ టాండాలె 2022లో యూట్యూబ్‌లో ఒక టాప్ కంటెంట్ క్రియేటర్‌గా నిలిచింది. ఆమె షార్ట్ వీడియోస్ కోసం చేసే పాత్ర పేరు షీలా దీదీ. సిరీస్ పేరు ‘కామ్‌వాలీ బాయి’. కామ్‌వాలీ అంటే పని మనిషి. ∙∙ పనిమనిషి లేని మధ్యతరగతి ఇల్లు ఉండదు. పని మనిషితో పేచీ పడని ఇల్లాలూ ఉండదు. పని సరిగ్గా చేయడం లేదని అమ్మగారు సణిగితే, పని ఎక్కువైందని పనిమనిషి గొణుగుతుంది.
స్మార్ట్ పనిమనిషి పాత్ర
బాగా తెలివైన పని మనిషైతే ‘స్మార్ట్ వర్క్’ చేసి పనిని తగ్గించుకోవడమో, తప్పించుకోవడమో చేస్తుంది. అపర్ణా టాండాలె తన సిరీస్‌లో ధరిస్తున్నది ఈ స్మార్ట్ పనిమనిషి పాత్రనే. ఎప్పుడూ ఆకుపచ్చని చీర, మేచింగ్ బ్లౌజ్, కొప్పు వేసిన జుట్టు, మెడలో నల్ల పూసలు, చేతిలో చీపురు... ఇది పనిమనిషి షీలా ఆహార్యం. ఆమె పని చేసేది ఒక యువ జంట ఇంట్లో. చేయాల్సిన పని చేస్తుంటుంది గాని ఒక్కోసారి తేడా వచ్చిందంటే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది.
ఆ ట్రిక్సే ఒకటీ ఒకటిన్నర నిమిషాల వీడియోలుగా మనం చూస్తుంటాము. – ఒక వీడియోలో యజమాని ఒకసారి బోల్డన్ని ఇండోర్ ΄్లాంట్స్ తెస్తుంది. ‘దీనికి స్ప్రే చేస్తే చాలు. దానికి అరగ్లాసు నీళ్లు చాలు. ఈ దానికి రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి’... ఇలా పది కుండీల లెక్క చెబుతుంది అమ్మగారు. పని మనిషి షీలా ఇంత పని చేస్తుందా?
ఒక రోజు పెద్ద బకెట్టు నిండా నీళ్లు మొక్కలకు పోయబోతూ అమ్మగారికి కంగారు పుట్టిస్తుంది. మరోరోజు మొక్కల దగ్గర ఒళ్లు గీరుకుంటూ ‘నాకు మొక్కలంటే ఎలర్జీ’ అంటుంది. మరోరోజు అమ్మగారి మీదే తుమ్ముతూ ‘మొక్కలకు నీళ్లు పోస్తే తుమ్ములు’ అంటుంది. దెబ్బకు మొక్కలకు నీళ్లు పోసే పని అయ్యగారు తీసుకుంటాడు. ఇదంతా ఎంతో ఫన్నీగా ఉంటుంది.
మామూలుగా కాదు
మరో వీడియోలో అమ్మగారు అల్మారాలోని తన బట్టలన్నీ సర్దమంటే ఒక్కదాన్నే చేయాలా అనుకున్న పని మనిషి ‘అమ్మగారూ... పొరుగింట్లో ఏమయ్యిందో తెలుసా?’ అని అమ్మగారిని పిలిచి మాటల్లో పెట్టి ఆమె చేతే మొత్తం బట్టలు మడత పెట్టిస్తుంది.
ఇంకో వీడియోలో స్టోర్‌రూమ్ సర్దమంటే ‘బాబోయ్ ఎలుక...’ అని అరిచి యజమానిని పిలిచి ‘అటు పోయింది... ఇటు పోయింది’ అంటూ మొత్తం సామాను అతడే సర్దేలా చేస్తుంది. ఈ వీడియోలు చూసే ప్రేక్షకులు యజమానుల్లో తమని, షీలా పాత్రలో తమ పని మనిషిని చూసుకోవడం వల్ల ఈ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది.
∙∙ పూణెకు చెందిన యూ ట్యూబర్ అపర్ణ టాండాలెకు ‘షార్ట్స్ బ్రేక్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. అందులో ‘కామ్ వాలీ బాయి’ సిరీస్ చేస్తుంది. ఈ ఒక్క యూ ట్యూబ్ చానల్ కాకుండా ‘టేక్ ఏ బ్రేక్’, ‘మ్యాడ్ ఫర్ ఫన్’ అనే ఇంకో రెండు మూడు చానల్స్ నడుపుతోంది అపర్ణ.
మధ్యతరగతి కుటుంబం
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అపర్ణకు బాల్యం నుంచి నటి కావాలనే కోరిక. స్కూల్, కాలేజీలో స్టేజ్ మీద నాటకాలు వేసేది. 2018 నుంచి యూ ట్యూబ్‌లో షార్ట్ వీడియోలు మొదలెట్టింది. పలుచటి శరీరంతో చురుగ్గా కదులుతూ హుషారైన ముఖ కవళికలతో ఆకట్టుకుంటుంది అపర్ణ.
‘ప్రతి ఇంట్లో ఇంటి పని ఉంటుంది. అలాగే పని మనిషి కూడా కావాల్సిందే. ఆ పాత్రను తీసుకుంటే ఎంతో హాస్యం పండించవచ్చు. బాధగా ఉన్నవారు కూడా నా వీడియోలు చూసి నవ్వాలి’ అంటుంది అపర్ణ. అలా నవ్వుతున్నారు కనుకనే ఆమెకు పాపులారిటీ. సృజనాత్మక ఐడియాలు ఉంటే భారీగా పాపులర్ కావచ్చనేదానికి అపర్ణే ఒక పెద్ద చీపురంత ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment