మిస్ యూనివర్స్ – 2024
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.
నలభైలలో...
40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు.
ఎత్తు ఎంతైనా... అంతెత్తున!
ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్‌లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్‌కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది.
హిజాబ్‌తో...
‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్‌తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్‌మెంట్‌లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది.
బార్బీ బొమ్మకు అందాల కిరీటం!
‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు.
బ్యూటీ స్పాట్...
ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్‌కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్‌ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సలాహ్‌కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్‌లు ఉన్నారు.
‘స్కిన్‌పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్‌లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్‌ఫామ్‌లలో క్రియేటివ్ లుక్స్‌పై ట్యుటోరియల్స్‌ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది.
బంగారు పక్షి
‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్‌తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్‌వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్‌ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment