వర్షాకాలం వచ్చిందంటే... మేమున్నామంటూ దోమలు విజృంభిస్తాయి. దీంతో సీజనల్‌గా వచ్చే అనేక వ్యాధుల్లో చాలావరకు వివిధ రకాల దోమల వల్లే వస్తాయి. అందుకే దోమలను నివారించే కొన్ని సహజమైన నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో తడి, తేమ లేకుండా వాతావరణ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులుంటే మరింత జాగ్రత్త అవసరం.
దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇంటిని, ఇంటి చుట్టుపక్కలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టైర్లు, చిన్ని చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, కుండలు లాంటివాటిల్లో కూడా నీరు ఉండిపోకూడా జాగ్రత్త పడాలి. వర్షాకాలంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. దోమతెరలను వాడాలి.
దోమలు తీపి వస్తువులు, శరీర దుర్వాసనకు ఆకర్షితులవుతాయని మనందరికీ తెలుసు, అయితే కొన్ని సుగంధ పరిమళాలు వాటికి నచ్చవు. అలాంటి కొన్ని రకాలు వాసనలొచ్చే మొక్కల్ని పెంచుకుంటే చుట్టూ ఉన్న దోమలు, ఇతర కీటకాల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా దోమల నివారణకు రసాయన రహిత పద్ధతుల ద్వారా దోమలను నివారించే ప్రయత్నాలు చేయాలి.
పెరటి మొక్కలు
లెమన్ గ్రాస్: ఇంట్లో లెమన్ గ్రాస్ చెట్టు పెంచుకుంటే దోమలు రావు. లెమన్ గ్రాస్ కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని ఇంటి బాల్కనీ లేదా మెయిర్ డోర్ దగ్గర ఏర్పాటు చేయాలి. లెమన్ గ్రాస్ వాసనకు దోమలు పారి పోతాయి.
నిమ్మ ఔషధతైలం ఈ మొక్కను హార్స్‌మింట్ అని కూడా అంటారు. దీని సుగంధం దోమలను దూరం చేస్తుంది. ఇంకా తులసి మొక్కలు, బంతి పువ్వు మొక్కలు కూడా దోమల నివారణకు పనిచేస్తాయి.
వేపాకుల్లో ఔషధ గుణాలు దోమల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిప్పుల్లో వేపాకులు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పొగ ఇంట్లో వ్యాపించేలా చూసుకోవాలి. ఈ పొగ ప్రభావంతో దోమల బెడద క్రమంగా తగ్గుతుంది. వేపనూనె చర్మానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. కర్పూరం సువాసన కారణంగా దోమలను అరికట్టడానికి ఉపయోగించవచ్చు.
వెల్లుల్లి ఉత్తమ సహజ దోమల వికర్షకాలలో ఒకటిగా చేస్తుంది. వెల్లుల్లి ఘాటైన రుచి , వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిని నీటిలో వేసి మరిగించి, ఆ నీటికి చుట్టూ పిచికారీ చేయండి.
కొబ్బరినూనె, లవంగాలు: దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరినూనె మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే ఫలితం బాగుంటుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో నిల్వ చేసి రోజూ సాయంత్రం చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు.
టీ ట్రీ ఆయిల్ ఈ వాసన దోమలకు అస్సలు పడదు. హోం డిప్యూజర్, కొవ్వొత్తులు, క్రీమ్, లోషన్ వంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. అలాగే దోమ కుట్టిన చోట ఈ నూనె రాస్తే దురద తగ్గుతుంది.
మస్కిటోకాయిల్స్, రిపెలెంట్స్, ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ఒడోమస్ వంటి ఉత్తమ నాణ్యతగల, హాని చేయని క్రీములు వాడవచ్చు. చిన్న పిల్లలు రాత్రి పూట కాళ్లను పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment