ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు. రష్యా పశ్చిమప్రాంతంలోని ఫెడరేషన్ ఆఫ్ షెల్యాబిన్‌స్క్‌లో దక్షిణ యూరల్ పర్వత సానువుల సమీపంలో ఉంది. ఈ సరస్సు పేరు కరాచే. ఇది మరీ అంత పెద్దది కాదు. కేవలం 900 మీటర్ల పొడవున విస్తరించిన ఈ సరస్సు ఒకచోట సన్నగా, ఇంకోచోట వెడల్పుగా కాస్త అడ్డదిడ్డంగా ఉంటుంది. అత్యధిక వెడల్పు గల ప్రదేశంలో దీని వెడల్పు 500 మీటర్లు. సాధారణంగా మొసళ్లతో నిండిన సరస్సులోకి అడుగు పెడితేనే ప్రమాదం. కాని, ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే! ఇది పూర్తిగా రేడియో ధార్మిక వ్యర్థాలతో నిండిపోయి ఉండటమే దీనికి కారణం.
ఇదివరకు ఈ సరస్సు సమీపంలోనే ఒక అణుకేంద్రం ఉండేది. అక్కడి వ్యర్థాలన్నీ ఈ సరస్సులోకి చేరడంతో ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక రేడియో ధార్మికత గల సరస్సుగా 1951లోనే ఈ సరస్సు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. అప్పట్లో ఇక్కడ ఉన్న అణుకేంద్రం నుంచి వెలువడిన ప్లూటోనియం–239, యురేనియం–235 ఐసోటోప్స్ ఈ సరస్సులోకి చేరాయి. ఇవి అణ్వాయుధాల్లో ఉపయోగించే రకానికి చెందినవి. ఈ సరస్సుకు దిగువన ఉండే 24 గ్రామాలకు ఇదొక్కటే మంచినీటి వనరుగా ఉండేది.
ఈ గ్రామాల్లో రేడియో ధార్మికత పెరగడంతో జనాలు వాటిని ఖాళీ చేశారు. దీని పరిసరాల్లోనూ గాలిలోకి కూడా తీవ్రస్థాయిలో రేడియో« దార్మికత చేరుతోంది. అమెరికన్ శాస్త్రవేత్తలు 1992లో ఈ సరస్సు ఒడ్డున గాలిలో ఉన్న రేడియో ధార్మిక ప్రభావంపై పరిశోధన చేశారు. ఇక్కడ నిలుచుంటే, గంటకు 5.6 సీవర్ట్‌ల రేడియో ధార్మిక ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలంలో ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని తేల్చారు.
(చదవండి: ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే!)
Comments
Please login to add a commentAdd a comment