పులస చేపకే పుస్తెలమ్ముకోవాలనుకునే మన జనాలు ఈ పీత ధర వింటే ఏకంగా ఆస్తులకు ఆస్తులే అమ్మేసుకోవాలనుకుంటారు. జపాన్‌లో దొరికే ఈ అరుదైన పీత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పీత. సముద్రంలో మూడువందల మీటర్లకు పైగా లోతులో మాత్రమే ఇది దొరుకుతుంది. అంత లోతున వేటాడినా, అదృష్టం బాగున్న వేటగాళ్ల వలలకే ఇది చిక్కుతుంది. అందుకే దీనికి అంత ధర. దీనిని ‘మాత్సుబా క్రాబ్’ అని, ‘స్నో క్రాబ్’ అని అంటారు.
ఈ పీత మాంసం చాలా రుచిగా ఉంటుందట! సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ పీతలు వలలో చిక్కినప్పుడు వాటిని వేలంలో అమ్ముతారు. గత ఏడాది నవంబర్‌లో ఒక మత్స్యకారుడి వలలో ఈ రకం పీత చిక్కింది. వేలంలో అమ్మితే, 1.2 కిలోల బరువు ఉన్న ఈ పీతకు ఏకంగా 10 మిలియన్ యెన్‌లు (రూ.58 లక్షలు) ధర పలికింది. జపాన్‌లోని రెస్టారెంట్లలో ఈ పీతలను సన్నగా తరిగి వేయించి ‘కనిసుకియాకి’, గంజిలో ఉడికించి ‘జోసుయి’, గ్రిల్డ్ క్రాబ్ వంటి వంటకాలను తయారు చేస్తారు. వీటిని ఆరగించేందుకు డబ్బున్న బడాబాబులు ఎగబడుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment