తల్లిగుణం అందరి మేలు కోరుతుంది. కూతురి అనారోగ్య సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తినిపించాలని వెతికితే దాని ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేదనిపించిందామెకు. తన కూతురు లాంటి వాళ్లు ఎందరో ఈ పండుకు దూరం కావలసిందేనా అని బాధ పడింది. పట్టుదలతో ఏకంగా పంటే పండించింది. డ్రాగన్ ఫ్రూట్ రైతు రేణుక కథ ఇది.
‘మీ అమ్మాయికి ప్లేట్‌లెట్స్ బాగా పడిపోయాయి. ప్లేట్‌లెట్స్ పెరగడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమ్మా’ అని డాక్టర్ చెప్పిన మాట ఆ తల్లిని డ్రాగన్ పంట స్వయంగా సాగు చేసే వరకు తీసుకువెళ్లింది.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రేణుక, పరశురాములు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. ఇంటర్ చదువుతున్న కూతురు విజయకు కరోనా కాలంలో సుస్తీ చేసింది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయని గుర్తించిన వైద్యులు ప్లేట్‌లెట్స్ పెర గడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమని చె΄్పారు.
దాంతో తల్లి రేణుక కామారెడ్డి పట్టణంలో పండ్ల దుకాణాలన్నింటా డ్రాగన్ ఫ్రూట్ కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఆఖరుకు ఒక సూపర్ మార్కెట్‌లో దొరికాయి. ఒక్కో పండు రూ.180 చె΄్పారు. అంత ఖరీదా అని ఆశ్చర్యపోయింది రేణుక. అంత రేటు పెట్టాల్సి వచ్చినందుకు చిన్నబుచ్చుకుంది. అయినా సరే కొనుగోలు చేసి తీసుకువెళ్లి కూతురికి తినిపించింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు.
మనం ఎందుకు పండించకూడదు?
రేణుకకు చదువు లేదు. కానీ వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది. రేణుక భర్త పరశురాములు కూడా చదువుకోకున్నా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆశ ఉంది. అంతవరకూ సంప్రదాయ సేద్యం చేస్తున్న ఆ ఇద్దరూ కూర్చుని ‘డ్రాగన్ ఫ్రూట్’ గురించి చర్చించుకున్నారు. ‘మనం పండించి తక్కువకు అమ్ముదాం’ అంది రేణుక. ఆ తర్వాత భర్తతో కలిసి డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతుల గురించి పిల్లలతో కలిసి యూ ట్యూబ్‌లో చూసింది. ఆ పంట పండించాలన్న నిర్ణయానికి వచ్చిన రేణుక, పరశురాములు జగిత్యాల జిల్లాలోని అంతర్గాంలో డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించిన మొలకలు దొరుకుతాయని తెలుసుకున్నారు.
ఓ రోజు అక్కడికి వెళ్లి పంట సాగు గురించి వారితో మాట్లాడారు. ఎకరంలో సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అడిగి తెలుసుకున్నారు. వాళ్లిచ్చిన సూచనల మేరకు ఇంటికి చేరుకున్న తరువాత ఎకరం పొలం దుక్కి దున్నారు. చుట్టూరా ఇనుపజాలీతో కంచె ఏర్పాటు చేశారు. మొక్కల కోసం స్తంభాలు, కర్రలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే డ్రిప్ సౌకర్యం కల్పించుకున్నారు. పొలం తనఖా పెట్టి రూ.3 లక్షలు, అలాగే డ్వాక్రా సంఘం నుంచి రూ. 2 లక్షలు అప్పు తీసుకుని పంట సాగు మొదలుపెట్టారు.
43 పండ్లు దక్కాయి
పంట సాగు చేసిన తొలి ఏడాది నలబై మూడు పండ్లు మాత్రమే చేతికందాయి. దాంతో మరిన్ని మెళకువలు తెలుసుకుని మరింత కష్టపడి సాగు చే యడంతో రెండో ఏడాదికి వచ్చేసరికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులకు అమ్మితే గిట్టుబాటు కాదని భార్య, భర్త ఇద్దరూ గంపల్లో పండ్లను పెట్టుకుని సిద్దిపేట, మెదక్, కామారెడ్డి తదితర పట్టణాలకు తీసుకు వెళ్లి ఒక్కో పండు. వంద నుంచి రూ.150 వరకు అమ్ముకుంటే రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.4 లక్షలు ఆదాయం సమకూరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పది పదిహేనేళ్లపాటు పంట వస్తుందని, తాము అనుకున్నదానికన్నా ఎక్కువే సంపాదిస్తామన్న ధీమాతో ఉన్నారు.
– ఎస్.వేణుగోపాలాచారి,
సాక్షి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment