నాన్న, అన్నయ్య, భర్త, కాకుండా ఎంతో దగ్గరి స్నేహితుడైతేనే అమ్మాయిలు ఇతరుల టూవీలర్ ఎక్కుతారు. అటువంటిది తన స్కూటర్ మీద ఎంతోమందిని ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో దించుతూ వచ్చిన సంపాదనతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది మౌతుషి బసు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మౌతుషి ఊబెర్ టూవీలర్ రైడర్‌గా మారింది.
కరోనా కారణంగా లక్షలాదిమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఆకలికి ఉద్యోగం ఉందా ఊడిందా అనేది తెలియదు. అందుకే ఎంతోమంది తమ అర్హతలకు సరిపోని ఉద్యోగాల్లో చేరి మరీ కుటుంబాలను లాక్కొస్తున్నారు. ఈ కోవకు చెందిన 30 ఏళ్ల అమ్మాయే మౌతుషి. కరోనాకు ముందు పానాసోనిక్ కంపెనీలో ఉద్యోగం చేసేది.
కరోనాతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. దీంతో ఉద్యోగాల కోసం తీవ్రంగా వెతికింది. కానీ ఎక్కడా తనకు సరిపోయే జాబ్ దొరకలేదు. అయినా ఏ మాత్రం నిరాశపడకుండా వెతుకుతూనే ఉంది. చివరికి ఊబెర్‌లో టూవీలర్ రైడర్‌గా చేరింది. అంతకుముందు రైడింగ్‌లో ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైడర్‌గా పనిచేస్తోంది.
అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైటర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కాడు. డ్రైవర్ అమ్మాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తర్వాత మౌతుషితో మాట్లాడి ఆమె గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా ‘సిస్టర్ నువ్వు ఎంతోమందికి ప్రేరణ’ అని అభినందిస్తున్నారు. అంతేగాక రణవీర్‌ని కూడా తెగపొగిడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతని పోస్టు వేలసంఖ్యలో లైక్‌లతో తెగ వైరల్ అవుతోంది. కుటుంబం కోసం తన శాయశక్తులా కృషిచేస్తోన్న మౌతుషి ఎంతోమంది యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment