బెల్లం పొడి అమ్మేస్తోంది | Navnoor Kaur jaggery business | Sakshi
Sakshi News home page

బెల్లం పొడి అమ్మేస్తోంది

Published Fri, May 19 2023 5:16 AM | Last Updated on Fri, May 19 2023 5:16 AM

Navnoor Kaur jaggery business - Sakshi

ఇంట్లో అందరికీ షుగర్‌ వస్తే మంచి డాక్టర్‌ ఎవరా అని వెతుకుతారు అంతా.కాని ఎంబీఏ చేసి మంచి హోదాలో ఉన్న నవనూర్‌ కౌర్‌ మాత్రం ఉద్యోగం వదిలేసింది. లోకంలో ఇంత మందికి షుగర్‌ ఉందంటే చక్కెరకు ప్రత్యామ్నాయమైన బెల్లం అమ్మితేఅటు ఆరోగ్యం, ఇటు లాభం అని నిశ్చయించుకుంది. ‘జాగర్‌కేన్‌’ అనే బ్రాండ్‌ స్థాపించి నాణ్యమైన బెల్లం పొడిని తెగ అమ్మేస్తోంది.టీలో కలపాలన్నా, స్వీట్‌ చేయాలన్నా బెల్లం పొడి బెస్ట్‌ అంటోంది. ఈమె వ్యాపారం జామ్మని సాగుతోంది.

నవనూర్‌ కౌర్‌ ప్రచార చిత్రాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఒక పోస్టర్‌లో ‘బెల్లం పాలు తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా? వత్తిడి తగ్గుతుంది, స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి, హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది, చర్మానికి మంచిది, జీర్ణక్రియ బాగుంటుంది, కీళ్ల నొప్పలు తగ్గుతాయి’. ఆ పోస్టర్‌ చూసినవారెవరైనా బెల్లం పాలు తాగాలనే అనుకుంటారు.ఇంకో పోస్టర్‌లో చక్కెరకు బెల్లానికి ఉన్న వ్యత్యాసాలు చూపిస్తుందామె.

‘చక్కెర రక్తంలో వెంటనే కరిగిపోతుంది. కాని బెల్లం మెల్లగా కరిగి మెల్లగా శక్తిని విడుదల చేస్తుంది. చక్కెరలో ఏ పోషకాలూ లేవు. బెల్లంలో ఐరన్, పొటాషియం ఉంటాయి. చక్కెర అసిడిటీ ఇస్తుంది. బెల్లం జీర్ణానికి అవసరమైన ఆల్కలైన్‌గా మారుతుంది’. నవనూర్‌ కౌర్‌ బెల్లం అమ్మకాల్లో ఏదో గుడ్డిగా ప్రవేశించలేదు. ఒక సంపూర్ణ అవగాహన, లక్ష్యంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థి
నవనూర్‌ కౌర్‌ది లూధియానా. తండ్రి ప్రొఫెసర్‌. తల్లి స్కూల్‌ ప్రిన్సిపాల్‌. చురుకైన విద్యార్థి అయిన నవనూర్‌ కౌర్‌ ఐఎంటి ఘజియాబాద్‌ నుంచి ఎంబీఏ చేసింది. వెంటనే కొటాక్‌ మహేంద్ర బ్యాంక్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. కాని తనకు వేరే ఏదో చేయాలని ఉండేది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే చేయదగ్గ వ్యాపారం ఏమిటా అని ఆలోచిస్తే తమ కుటుంబంలో బంధువుల్లో షుగర్‌ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని అర్థమైంది.

డయాబెటిస్‌ పేషెంట్లు, డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తీపి కోసం బెల్లం ఉపయోగించాలని అనుకున్నా మార్కెట్‌లో దొరుకుతున్న బెల్లం నాణ్యంగా లేదని తెలుసుకుంది. ఆర్గానిక్‌ బెల్లం అని చెప్పి అమ్ముతున్నది కూడా కల్తీయే అని అర్థమయ్యాక ఒక వైపు ఉద్యోగంలో తాను సంపాదించిన ఐదు లక్షల రూపాయలతో బెల్లం పొడి తయారీ కేంద్రం పెట్టి, అందులో బెల్లం పొడి తయారు చేసి అమ్మాలని నిశ్చయించుకుంది.

అవాంతరాలు
ఆర్గానిక్‌గా చెరకు పండించి,  రసాయనాలు లేకుండా బెల్లం తయారు చేసి సరుకు వేసేవారి కోసం నవనూర్‌ కౌర్‌ పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌ చాలా తిరగాల్సి వచ్చింది. అలా ఇస్తామని చెప్పిన వారు కూడా మోసం చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారని గ్రహించింది.

అయితే అదృష్టవశాత్తు తన తండ్రి దగ్గర చదువుకుని సేంద్రియ పద్ధతిలో చెరకు పండిస్తున్న కౌశల్‌ అనే రైతు పంజాబ్‌లోనే ఆమెకు దొరికాడు. అతనికి బెల్లం తయారీ కేంద్రం కూడా ఉంది. ‘నువ్వు నాణ్యమైన బెల్లం తయారు చేయ్‌. నేను మార్కెటింగ్, బ్రాండ్‌ చూసుకుంటాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం’ అని చెప్పింది. కౌశల్‌ సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ‘జాగర్‌కేన్‌’ అనే బ్రాండ్‌ మొదలుపెట్టారు.

వెంటనే ఆదరణ
నవనూర్‌ కౌర్‌ తయారు చేసిన బెల్లం పొడి వెంటనే ఆదరణ పొందింది. కల్తీ లేనిది కావడాన... రుచి కూడా బాగుండటాన అందరూ కొనడం మొదలెట్టారు. దుకాణం దారులు నిల్వ ఉండటం లేదని ఫిర్యాదు చేస్తే తగిన ప్రయోగాలు చేసి 9 నెలల పాటు నిల్వ ఉండేలా తయారు చేశారు. ఇప్పుడు 22 జిల్లాల్లో ఆమెకు డిస్ట్రిబ్యూషన్‌ ఉంది. గత సంవత్సరం 2 కోట్ల టర్నోవర్‌ వచ్చింది.

మరో ఐదేళ్లలో 100 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటామని భావిస్తోంది. కృత్రిమమైన చక్కెర కంటే బెల్లం ఎక్కువ ఆరోగ్యకరమైనదని తెలుసుకునే కొద్దీ తనలా బెల్లం ఉత్పత్తులు చేసేవారు తప్పక విజయం సాధిస్తారని ఆమె గట్టిగా సందేశం ఇస్తోంది. ఉద్యోగాలు మంచివే అయినా ఒక మంచి వ్యాపార ఐడియా ఎక్కడికో చేర్చగలదు. నవనూర సక్సెస్‌ స్టోరీ అందుకు ఉదాహరణ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement