బెంగళూరుకు చెందిన నిహారిక ఇంజినీరింగ్, ఎంబీఏ చేసింది. అయితే తనలోని క్రియేటివిటీ ఆమెను వేరే మార్గం వైపు నడిపించింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న నిహారికాకు ‘డోన్ట్ జస్ట్ ఫాలో ట్రెండ్స్. సెట్ దెమ్’ అనే మాట అంటే చాలా ఇష్టం...
ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు ‘ఇంజినీరింగ్ తప్ప ఏదైనా చేయాలి’ అని గట్టిగా అనుకుంది నిహారిక! పేరెంట్స్ ససేమిరా అన్నారు. దీంతో చదువు తప్పలేదు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. సోషల్ లైఫ్ పెద్దగా లేని నిహారిక తన స్టడీరూమ్‌లో ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకుంటూనే, మరోవైపు కామెడీ స్కెచ్‌లు రాసేది. ‘మొదట్లో నన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకునేవారు కాదు.
నన్ను అనుకరిస్తూ కామెంట్స్ పెట్టేవారు. అయితే వాటికి నేనెప్పుడు బాధ పడలేదు. స్వభావరీత్యా నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. అయితే కాలేజీలోకి అడుగు పెట్టిన తరువాత మరీ ఇంత సున్నితంగా ఉంటే బాగుండదు అనిపించింది. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రతిదానికి బాధ పడాల్సిన అవసరం లేదు. మానసికంగా దృఢంగా ఉండడం అనేది కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు బాగా ఉపయోగపడింది. మొదట్లో వెక్కిరించిన వారే ఆ తరువాత మెచ్చుకునేవారు’ అంటుంది నిహారిక.
చవకబారు విమర్శల మాట ఎలా ఉన్నా నిర్మాణాత్మక విమర్శను ఇష్టపడుతుంది. ‘కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం మెరుగు పెట్టుకోవడానికి నిర్మాణాత్మకమైన విమర్శ తోడ్పడుతుంది’ అంటుంది నిహారిక. ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’ ద్వారా నిహారిక పేరు ఎక్కడికో వెళ్లియింది. నిహారిక కంటెంట్‌కు తొలి ప్రేక్షకురాలు నిహారికానే! ప్రేక్షక స్థానంలో కూర్చున్నప్పుడు తాను ఆ కంటెంట్ ఎంజాయ్ చేయగలిగితేనే ప్రేక్షకుల్లోకి తీసుకువెళుతుంది. 2022లో తన తొలి షార్ట్–ఫార్మట్ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగిచూసుకోలేదు. తన ఫస్ట్ వైరల్ వీడియో ‘లివింగ్ ఎలోన్ 101’పదమూడు రోజుల వ్యవధిలోనే 11 మిలియన్‌ల వ్యూస్‌ను దాటేసింది. ‘ప్రేక్షకుల పెదాల మీద నవ్వులు పూయించే ఔషధం ఇంట్లో దొరకదు. జనాల్లోకి వెళ్లాలి. చిన్న ఎక్స్‌ప్రెషన్ నుంచి విలువైన మాట వరకు ఎన్నెన్నో బయటి ప్రపంచంలోనే దొరుకుతాయి’ అంటుంది నిహారిక.
‘నాకు ఏదైనా సరే త్వరగా బోర్ కొడుతుంది. దీని వల్ల నాకు జరిగిన మేలు ఏమిటంటే నా కంటెంట్‌ను ఇతరులు బోర్‌గా ఫీల్ కావడానికి ముందుగానే కొత్త కంటెంట్ కోసం ప్రయత్నిస్తాను’ అంటుంది నిహారిక ఎన్‌ఎం.
Comments
Please login to add a commentAdd a comment