‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్ స్వామి.. ప్రతిరోజూ తమ ఇంటి టెర్రస్ మీద వందల కొద్ది చిలుకలకు దాణా వేస్తూ వాటితో ఆత్మీయానుబంధాన్ని అల్లుకుంటాడు! అలాంటి వ్యక్తులు రియల్ లైఫ్‌లోనూ ఉన్నారు. వాళ్లే నూర్‌బాషా బాబావలీ, లాల్‌బీ దంపతులు!
ఆంధ్రప్రదేశ్, తెనాలిలోని గాంధీనగర్, ఎన్‌వీఆర్ కాలనీలో నివాసముంటారు నూర్‌బాషా బాబావలీ దంపతులు. వృత్తిరీత్యా నూర్‌బాషా టైలర్. తమ మేడ మీదకొచ్చి అరిచే కాకుల గుంపు కోసం నూర్‌బాషా భార్య లాల్‌బీ.. కాసిన్ని బియ్యం చల్లి.. ఓ గిన్నెలో నీళ్లనుంచడం మొదలుపెట్టింది. కాకులు ఆ దాణా తిని, నీళ్లు తాగి ఎగిరిపోయేవి. కొన్నాళ్లకు కొన్ని చిలుకలూ వచ్చి వాలాయి ఆ మేడ మీద.. ఇంచక్కా ఓ పక్క బియ్యం, మరోపక్క మంచి నీళ్లు కనిపించేసరికి సంతోషంగా బియ్యం గింజలు తిని, మంచినీళ్లు తాగి ఎగిరిపోయాయి. మర్నాడు మరిన్ని చిలుకలను వెంటబెట్టుకొచ్చి.. ఆ దాణాను ఆరగించసాగాయి.
క్రమంగా అది వాటికి రోజువారీ కార్యక్రమం అయింది. వాటి సంఖ్యా వందల్లోకి పెరిగింది. ఒక్కపూట కాస్త రెండుపూటలకు మారింది. ప్రకృతి పంపుతున్న ఆ అతిథులను చూసి నూర్‌బాషా, లాల్‌బీ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వాటికోసం ఉదయం, సాయంకాలం రెండుపూటలా దాణా చల్లుతూ చక్కటి ఆతిథ్యమివ్వసాగారు. క్రమంగా అది ఆత్మీయానుబంధంగా బలపడింది. ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య, సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య చిలుకలు ఆ మేడ మీద వాలి.. దాణా తిని, నీళ్లు తాగి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కొన్ని చిలుకలు దాణా తింటున్నప్పుడు మరికొన్ని గుంపులు గుంపులుగా అక్కడున్న దండేల మీద, లేదంటే పక్కనే ఉన్న చెట్ల కొమ్మల మీద వేచి చూస్తుంటాయి.
తమ వంతు రాగానే టెర్రస్ ఫ్లోర్ మీద వాలి విందును ఆరగిస్తాయి. ఏటా గురు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఇలా ఆ చిలుకలు నూర్‌బాషా కుటుంబమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాయి. అవి బియ్యం గింజల్ని తింటున్నప్పుడు నూర్‌బాషా కుటుంబీకులు కాక కొత్తవారెవరు కనిపించినా రివ్వున ఎగిరిపోతాయి. వీటి కోసం ఉదయం మూడు కిలోలు, సాయంత్రం రెండు కిలోల చొప్పున రోజుకు అయిదు కిలోల బియ్యాన్ని ఆహారంగా పెడుతోందా కుటుంబం. అంటే నెలకు 150 కిలోలు. చిలుకలను ఇంత ప్రేమగా ఆదరిస్తున్న నూర్‌బాషా, లాల్‌బీ దంపతులను చూసి ముచ్చటపడిన లాల్‌బీ స్నేహితురాలు అంజమ్మ .. నెలకు 20 కిలోల బియ్యాన్ని తన వంతు సాయంగా అందిస్తోంది.
‘ఇప్పుడు కాకులు, చిలుకలతోపాటు పావురాలు కూడా వచ్చి దాణా తినిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత చిలుకల సంఖ్య బాగా తగ్గుతుంది. మళ్లీ గురు పౌర్ణమి నుంచి వాటి సంఖ్య పెరుగుతుంది. అలా కొన్ని వందల చిలుకలు మా మేడ మీద వాలుతుంటే భలేగా ఉంటుంది!’
– నూర్‌బాషా బాబావలీ.
Comments
Please login to add a commentAdd a comment