నోటి దుర్వాసన దూరమయ్యేదిలా!  | Oral Hygiene And Bad Breath Health Story | Sakshi
Sakshi News home page

నోటి దుర్వాసన దూరమయ్యేదిలా! 

Published Thu, Aug 20 2020 11:07 AM | Last Updated on Thu, Aug 20 2020 11:07 AM

Oral Hygiene And Bad Breath Health Story - Sakshi

నోటి దుర్వాసన సమస్య వచ్చిందంటే అందుకు ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది సరైన నోటి శుభ్రత (ఓరల్‌ హైజీన్‌) పాటించకపోవడం, రెండవది కడుపులో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం. ఇటీవలి లాక్‌డౌన్‌ కాలంలో అందరూ ఇళ్లలోనే ఉండాల్సి రావడం, ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేకపోవడం వంటి కారణాలతో నోటి శుభ్రత విషయంలో అంతగా శ్రద్ధ పెట్టడం లేదన్నది నోటివైద్యనిపుణుల తాలూకు పరిశీలనల్లో ఒకటి.

దీనికి తోడు జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే... నోటిదుర్వాసన పెరిగే అవకాశాలు మరింత ఎక్కువ. నోటి దుర్వాసన సమస్యను వైద్యపరిభాషలో ‘హాలిటోసిస్‌’ అంటారు. నోటి నుంచి దుర్వాసన వస్తోందంటూ డాక్టరును సంప్రదిస్తే, ఆయన మొట్టమొదట వారు ‘మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో కాస్త చెప్పండి’ అంటూ అడుగుతారు. 

ఇలాంటి ఆహారం మేలు... 
మంచి జీర్ణవ్యవస్థ కోసం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం, తాజా తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తినాలంటారు. అలాగే ద్రవ పదార్థాలు పుష్కలంగా తాగాలంటారు. ఇవన్నీ మీ గ్యాస్ట్రో ఇంటస్టైనల్‌ ట్రాక్ట్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపులో ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులూ తలెత్తవు. ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన మరో జాగ్రత్త కూడా ఉంది. అదే... ఆహారం తీసుకున్న ప్రతిసారీ దంతాలను శుభ్రం చేసుకోవాలి. వీలైతే బ్రషింగ్‌ లేదా ఫ్లాసింగ్‌ (దారంతో పళ్ల మధ్య చేరే వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం). 

హాలిటోసిస్‌ను ఎదుర్కొనే హెర్బల్‌ మార్గం... 

  • నోటి దుర్వాసనను సమర్థంగా ఎదుర్కోవడంలో కొత్తిమీర, పుదీన, యూకలిప్టస్, రోజ్‌మేరీ, ఏలక్కాయ వంటివి బాగా పని చేస్తాయి. ఈ ఔషధీయ పదార్థాలను అలాగే నమలడం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని అపసవ్యతలు తగ్గి, పనితీరు మెరుగవుతుంది. దాంతో నోటి దుర్వాసనా దూరమవుతుంది. అలాగే మనం రోజూ తీసుకునే ఆహారం తరవాత కూడా చివరగా ఏలక్కాయ, కొత్తిమీర, పుదీన వంటి వాటిని తినడం ద్వారా నోటి దుర్వాసనను దూరంగా ఉండవచ్చు.

నోటి దుర్వాసనను దూరం చేసే చిన్న చిన్న చిట్కాలు 

  • తాజాపరిశోధనల ప్రకారం... రోజూ తాజా పెరుగు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు కారణమైన హైడ్రోజెన్‌ సల్ఫేడ్‌ పాళ్లను అదుపుచేయవచ్చు. పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా దంతాల మీద పాచి పేరుకోవడాన్ని, చిగుళ్ల వ్యాధులను కూడా నివారించవచ్చు. 
  • నమిలినప్పుడు కరకరలాడే (అంటే క్రంచీగా అనిపించే పండ్లు) పండ్లు అయిన ఆపిల్స్, క్యారట్స్‌ వంటి పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉండేవాటినీ, కూరగాయలు నోటి దుర్వాసనకు విరుగుడుగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల లాలాజలం ఎక్కువగా విడుదలై నోటిని శుభ్రంగా ఉంచుతుంది.
  • కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లతో కూడిన చాలా రకాల పోషకాహారం దంతాల మీద పాచి పేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ సమస్యను పండ్లు, ఆకుకూరలు, కాయగూరలను తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు.
  • హాలిటోసిస్‌కు చిగుళ్ల వ్యాధులు, జింజవైటిస్‌ వంటి దంతాల సమస్యలు ముఖ్యమైన కారణాలు. వీటిని నివారించాలంటే‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉండే నిమ్మజాతి పండ్లు, ఉసిరితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది నోటి దుర్వాసననూ అరికడుతుంది. విటమిన్‌–సి వల్ల ఈ కరోనా కాలంలో వ్యాధినిరోధక శక్తీ సమకూరుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement