అంతర్జాతీయ సంస్థ టేస్ట్ అట్లాస్ మన దేశంలో చెత్త వంటకాల జాబితాను విడుదల చేసింది. అలాగే మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారాలు, ఇష్టంలేని ఆహారాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. వాటి గురించి వివరాలు సేకరించి... ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను, ఎక్కువ మంది తినడానికి ఇష్టపడని వంటకాల జాబితాను సిద్ధం చేస్తుంది ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ.
టేస్ట్ అట్లాస్ అనేది ఆన్‌లైన్ ఫుడ్ పోర్టల్. ఇది ప్రపంచంలోని బెస్ట్ వంటకాలు, బెస్ట్ రెస్టారెంట్‌ల జాబితాను ప్రకటిస్తుంటుంది. అలానే తాజాగా మనదేశంలో ఎక్కువశాతం ప్రజలు ఇష్టపడే వంటకాలు, ఇష్టపడని వంటకాల గురించి టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ పదిలో ఉన్న చెత్త , ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల వివరాలను వెల్లడించింది.
చెత్త వంటకాలు ఇవే…
టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం చెత్త రేటెడ్ ఫుడ్స్ ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడే జల్జీరా… ఈసారి చెత్త వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర భారతదేశంలో ఈ పానీయాన్ని విపరీతంగా తాగుతారు. అలాంటిది మనదేశంలోని చెత్త వంటకాల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం షాక్‌కి గురిచేస్తుంది. చెత్త వంటకాల్లో రెండో స్థానంలో శీతాకాలంలో అతిగా తినే గజ్జక్ ఉంది.
మూడో స్థానంలో దక్షిణ భారత వంటకం తెంగై సదం, నాలుగో స్థానంలో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ పంతా బాత్, ఐదో స్థానంలో ఆలూ వంకాయ కర్రీ, ఆరో స్థానంలో తండాయ్ ఉన్నాయి. దీని తరువాత, కేరళ వంటకం అచ్చప్పం ఏడవ స్థానంలో, ప్రసిద్ధ హైదరాబాదీ మిర్చి కా సలాన్ ఎనిమిదో స్థానంలో, తీపి వంటకం మల్పువా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో అల్పాహారంలో అధికంగా తినే ఉప్మా పదో స్థానంలో నిలిచింది. ఉప్మాను అధికంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తింటారు.
బెస్ట్ ఫుడ్ ఇవే..
మనదేశంలో బెస్ట్ ఫుడ్ జాబితాలో ఏ ఆహారాలు నిలిచాయో టేస్ట్ అట్లాస్ వివరించింది. ఆ ఫుడ్ లిస్ట్‌లో ఉన్న రుచికరమైన మామిడి లస్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మసాలా చాయ్ రెండో స్థానంలో, బటర్ గార్లిక్ నాన్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానంలో అమృత్ సర్ కుల్చా, ఐదో స్థానంలో బటర్ చికెన్, ఆరో స్థానంలో హైదరాబాదీ బిర్యానీ, ఏడో తేదీన షాహి పనీర్, ఎనిమిదో స్థానంలో అందరికీ ఇష్టమైన చోలే భటురే నిలిచాయి.
ఆ తర్వాత తందూరీ చికెన్ తొమ్మిదో స్థానంలో, కోర్మా పదో స్థానంలో నిలిచాయి. సాధారణంగా హైదరాబాదీ బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఈసారి బిర్యానీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.టేస్టీ అట్లాస్ నిర్వాహకులు తమ పోర్టల్‌లో ఎవరికి ఏ ఆహారం అధికంగా నచ్చుతుందో, ఏ ఆహారం నచ్చదో చెప్పమని అడుగుతారు. మనదేశంలోని ఎవరైనా ఆ పోర్టల్ రెస్పాండ్ కావచ్చు. ఈ సర్వేలో పాల్గొన వచ్చు. ఆ విధంగా ఎక్కువ ఓట్లు పడిన వంటకాల జాబితాను సిద్ధం చేసి విడుదల చేస్తారు.
(చదవండి: ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment