ఇంతవరకూ ప్లాస్టిక్ బౌల్స్‌లో తినకూడదు... అందులోని ప్లాస్టిక్ ఒంట్లోకి చేరడంతో ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నోట్లోకి వెళ్లని వస్తువులతోనూ ఒంటి బరువు పెరుగుతుందనీ, దాంతో పెరిగిన బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, అందుకే ఈ ప్లాస్టిక్‌ను ‘ఒబిసోజెన్స్’ అంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
ఉదాహరణకు... షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచేస్తుందంటున్నారు నిపుణులు. షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్‌లాంటి ప్లాస్టిక్ సీసాలూ, తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువును పెంచేస్తుందని నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ పరిశోధనల్లో తేలింది.
ఈ అధ్యయనంలో 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లోని దాదాపు 55,000 రకాలకు పైగా రసాయనాలను పరీక్షించారు. ప్లాస్టిక్‌లోని దాదాపు పదకొండు రకాల రసాయనాలు బరువు పెంచడానికి కారణమవుతున్నాయంటూ తెలుసుకున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ పేర్కొన్నారు. ఆ ప్లాస్టిక్ సీసాలను వాడినప్పుడు దేహంలోకి ప్రవేశించే
పదకొండు రకాల రసాయనాల కారణంగా బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ అని వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో పాల్గొనడంతోపాటు కొవ్వు నిండిపోయేలా ఫ్యాట్ సెల్స్ సంఖ్యను పెంచుతాయని తేలింది.
దాంతో దేహం బరువు అమాంతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నరాల సంబంధిత వ్యాధులూ, వ్యాధినిరోధకతను తగ్గించే సమస్యలూ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగవచ్చని తేలింది.
ఇప్పుడు అవే ప్లాస్టిక్ ఉపకరణాలూ, పరికరాలు... బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా పరిశోధనల్లో విస్పష్టంగా తేలింది. ‘ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
(చదవండి: నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..! )
Comments
Please login to add a commentAdd a comment