ప్రతీకాత్మక చిత్రం
గర్భధారణను గతంలో ఎవరూ ప్లాన్ చేసుకునేవారు కాదు. అది వచ్చినప్పుడే వచ్చేది. కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయని మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదెందుకో తెలుసుకుందాం. సాధారణంగా గతంలో నెలతప్పాక ఒక వారం లేదా రెండువారాల మహిళకు అది అర్థమయ్యేది.
తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కొన్ని పరీక్షలు చేయించుకోవడం పరిపాటి. కానీ ముందునుంచే గర్భధారణను ప్లానింగ్ చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కొన్ని లోపాలను ముందునుంచే నివారించుకునే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ మహిళకు ఫోలిక్ యాసిడ్ ఇవ్వడమే ఓ మంచి ఉదాహరణ.
మాత్రల రూపంలో అమ్మే ఈ ఫోలిక్ యాసిడ్ చాలా చవక. పైగా అది మనం తీసుకునే అన్ని ముదురాకుపచ్చని ఆకుకూరల్లో పుష్కలంగా ఉండే పోషకం. సరైన పోషకాలు తీసుకోని కొందరు తల్లుల్లో పిల్లలు పుర్రె, వెన్నుపాము లోపాలతో పుడుతుంటారు. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తగినన్ని పాళ్లలో తీసుకోని తల్లులకు వెన్నుపాము లోపాల (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్)తో పిల్లలు పుడతారు. పుట్టుకతో వచ్చే ఈ కండిషన్‌ను ‘స్పైనా బైఫిడా’ అంటారు.
ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న మహిళల్లో కనీసం మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఆబ్‌స్ట్రెటీషియన్స్/ గైనకాలజిస్టులు సూచిస్తుంటారు. దాంతో న్యూరల్‌ట్యూబ్ డిఫెక్ట్‌తో పిల్లలు పుట్టే ముప్పును పూర్తిగా నివారించవచ్చు. అంతేకాదు... పౌష్టికాహారలోపాల వల్ల పిండదశలోనే వచ్చే మరెన్నో సమస్యలనూ నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన రేపటిపౌరులకు జన్మనివ్వవచ్చు.
ఇక మన దేశంలోని మహిళల్లో దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత (అనీమియా) చాలా సాధారణం. ప్రెగ్నెన్సీని ముందే ప్లాన్ చేసుకునే మహిళకు ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా కూడా తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసుకునే అవకాశం ఉంది.
అంతకుమునుపు ఉన్న ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా... గర్భం ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి మహిళకు ఆరోగ్యకరమైన సమతులాహారాన్ని ఇవ్వడం, అందులో అన్ని పోషకాలు అందేలా కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలతో ఇటు కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ చిన్నారికి తగినంత రోగనిరోధక శక్తి సమకూరేలా చూడటం/జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమాజానికీ మంచి మేలు కలిగేందుకు ఆస్కారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment