ప్రముఖుల రొమాన్సులు, వివాహాలే కాదు విడాకులు కూడా మీడియాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అందరూ దాని గురించి చర్చించుకుంటారు. గతంలో ఆమీర్ ఖాన్-కిరణ్ రావు, అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా, సమంతా రూత్ ప్రభు-నాగ చైతన్య, తాజాగా సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు చర్చనీయాంశాలయ్యాయి. అసలు కారణాలు ఎవరికీ తెలియకున్నా ఎవరి కారణాలు వారు వెతుక్కున్నారు. అయితే ఈ విడాకులను గాసిప్ లెన్స్ ద్వారా కాకుండా సైకాలజీ లెన్స్ ద్వారా పరిశీలిస్తే, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దొరుకుతాయి.
ఫేమ్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి
నిరంతరం ప్రజల దృష్టిలో ఉండటం ఏ సెలబ్రిటీ జీవితానికైనా కష్టమైన, నష్టం కలిగించే విషయం. వారు చేసే చిన్న పొరపాటు కూడా భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడి అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది.
పాపులారిటీతో పెరిగే అహంభావం
కీర్తి, సంపద, నిరంతర పాపులారిటీ వ్యక్తిలో అహంభావాన్ని, తద్వారా నార్సిసిజంను పెంచుతాయి. అంటే తనను తాను ప్రేమించుకోవడం పెరిగిపోతుంది. ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి, రాజీపడే తత్వం తగ్గిపోతాయి. భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీపడే కాంపిటీటర్‌గా మారుస్తుంది. పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది.
బిజీ జీవితంతో బలహీనపడే బంధాలు
సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్‌లు, చాలాకాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్సర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలను సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్ కనెక్ట్ అవుతారు.
ఆర్థిక భద్రత పెంచే స్వాతంత్య్ర భావం
సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్‌లా కనిపించినప్పటికీ, సాంప్రదాయిక నిబద్ధతలను చెరిపేసే స్వాతంత్య్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదుర్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సయోధ్యకోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్‌ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం.
అయితే ఇవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే. ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దానివైన ప్రత్యేక కారణాలు ఉంటాయని గుర్తించడం చాలా ముఖ్యం. పాపులారిటీకే ప్రాధాన్యం ఇవ్వడం, వైవాహికేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, అహంకారం, అననుకూలత లాంటి అనేక అంశాలు అనేకం ఉండవచ్చు. తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేకానేక చీకటి గాధలు, బాధలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో అహానికి పోకుండా, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉండవచ్చు.
--సైకాలజిస్ట్ విశేష్
ఫోన్ నెం: 8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment