మనసు మెచ్చిన పని! | Rachana Intipanta Special Story in Sagubadi | Sakshi
Sakshi News home page

మనసు మెచ్చిన పని!

Published Tue, Jul 28 2020 9:34 AM | Last Updated on Tue, Jul 28 2020 9:34 AM

Rachana Intipanta Special Story in Sagubadi - Sakshi

రోణంకి రచన విశాఖపట్నం నగరంలో పుట్టి పెరిగినప్పటికీ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచే మక్కువ. నాన్న మోహనరావు వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. ఊరెళ్లినప్పుడల్లా పొలానికి రచన తప్పకుండా వెళ్లి వ్యవసాయం గురించి గమనిస్తూ పెరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరారు. 

ఎందుకో గాని సంతృప్తిగా అనిపించలేదు. ఉద్యోగానికి బై చెప్పి.. తిరిగి వైజాగ్‌ వచ్చేశారు. రచన ఇక అక్కడ ఏ ఉద్యోగంలోనూ చేరలేదు.. మనసుకు నచ్చే పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటిపైనే కూరగాయల సాగు మొదలు పెట్టారు, సుమారు రెండేళ్ల క్రితం. 

విశాఖ పీఎంపాలెంలో నివసిస్తున్న రచన తొలుత 10 కుండీల్లో ఆకుకూరలు పెంచడం ప్రారంభించారు. వాళ్లు ఉంటున్న అపార్ట్‌మెంట్‌.. 5 అంతస్థుల భవనం. లిఫ్ట్‌ లేదు. మట్టి, సేంద్రియ ఎరువు కొని తెచ్చి తండ్రితో కలిసి స్వయంగా మేడపైకి  మోసుకుంటూ వెళ్లి మొక్కల పెంపకం ప్రారంభించారు. నగర శివార్లలో ఉన్న పశువుల కొట్టాం నుంచి ఆవుపేడ ఎరువును కొనుగోలు చేసి, మట్టిలో కలిపి కుండీలు, మడుల్లో వినియోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలను ఏ రోజుకారోజు కుండీలు, మడుల్లో వేస్తున్నారు. నెలకోసారి వర్మీ కంపోస్టు కొంచెం కొంచెం మొక్కలకు వేస్తున్నారు. జీవామృతం కూడా ఇక మీదట వాడాలనుకుంటున్నానని తెలిపారామె. 

రెండేళ్ల క్రితమే మొదలు పెట్టినా ఏడాది క్రితం నుంచి పూర్తిస్థాయిలో సేంద్రియ ఇంటిపంటలపై దృష్టి కేంద్రీకరించానన్నారు. వంగ, మిరప, మొక్కజొన్నతో పాటు వేరుశనగ వంటి పంటలు కూడా పండిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కొన్ని కుండీల్లో రాగులు కూడా పండించారు. జామ తదితర పండ్ల మొక్కలను సైతం నాటారు. 

ఎత్తు తక్కువలో ఉండే సిల్పాలిన్‌ మడిలో మొక్కల్ని పెంపుడు కుక్క తవ్వి పాడు చేస్తోందని ఓ ఉపాయం ఆలోచించారు రచన. టెర్రస్‌ మీద కొద్ది అడుగుల ఎత్తులో కట్టెలతో మంచె లాగా కట్టి.. దానిపైన సిల్పాలిన్‌ బెడ్‌ను ఏర్పాటు చేశారు. అందులో గోంగూర, తోటకూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. వీటితో పాటు టమాటా, మిరప నారు కూడా పోశారు. మొక్కలు పెరిగిన తర్వాత పీకి కుండీల్లో నాటుతానన్నారు. 

దేశవాళీ కూరగాయలతోపాటు నలుపు, పసుపు రంగు టమాటాలు, పర్పుల్‌ బీన్స్‌ వంటి విదేశీ రకాలను కూడా సాగు చేయటం తనకు ఇష్టమన్నారు. 
కోవిడ్‌ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో సేంద్రియ ఇంటిపంటలపై మరింత శ్రద్ధ పెరిగిందన్నారు. తమ టెర్రస్‌ గార్డెన్‌లో పండించే కూరగాయలు, ఆకుకూరలతో సుమారు 50% మేరకు ఇంటి అవసరాలు తీరుతున్నాయని.. తాను ఇంకా చాలా మెలకువలు నేర్చుకోవాల్సి ఉందని, మరింత ఎక్కువ పంటలు ఏడాది పొడవునా కొరతలేకుండా పండించాలన్నది తన అభిమతమని రచన అంటున్నారు. – కరుకోల గోపీ కిశోర్‌ రాజా, సాక్షి, విశాఖపట్నంఫోటోలు: ఎమ్‌డీ నవాజ్‌

రైతు కష్టం తెలుస్తుందని..
మా ఇంటిపైన పండిస్తున్న పంటలను చూసి స్నేహితులు చాలా మంది అభినందిస్తున్నారు. అందుకే ఈ పంటలపై అందరికీ అవగాహన కల్పించాలని భావించాను. ఇందుకోసం సోషల్‌ మీడియాని వేదికగా ఎంచుకున్నాను. నా ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో మా మేడపై పండుతున్న కూరగాయల ఫోటోల్ని షేర్‌ చేశాను. అందరూ అభినందిస్తున్నారు. కొంతమంది తాము కూడా ఇంటిపంటల సాగు ప్రారంభిస్తామని మెసేజ్‌ చేస్తున్నప్పుడు చాలా ఆనందమనిపించింది. నా ఏజ్‌ ఉన్న వారిలో చాలా మందికి పంటలు పండించేందుకు రైతులు ఎంత కష్టపడతారనే విషయం తెలీదు. ఇలా స్వయంగా ప్రారంభిస్తే.. రైతు కష్టం తెలుస్తుందని నా ఉద్దేశం. మొక్కల వెరైటీలు.. ఇంకా ఎక్కువ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను.     – రోణంకి రచన, విశాఖపట్నం 
ఇన్‌స్టాగ్రామ్‌:@organic.blooms

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement