ఓ డాక్టర్‌ హార్ట్‌ బిట్‌..! హృదయాన్ని మెలితిప్పే కేసు..! | A Rare Heart Beat Case: Irregular Heartbeat | Sakshi
Sakshi News home page

ఓ డాక్టర్‌ హార్ట్‌ బిట్‌..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!

Published Sun, Sep 29 2024 10:55 AM | Last Updated on Sun, Sep 29 2024 11:51 AM

A Rare Heart Beat Case: Irregular Heartbeat

గుండెకు రూపం ఉంటుంది. హృదయానికి కాదు. గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడు తన హృదయం చేసే ఉద్వేగాలను అదుపు చేసుకోవాలి. అయితే అన్నిసార్లూ అలా ఉండదు. ఒక్కోసారి గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడి గుండె కొట్టకులాడుతుంది. ఆ గుండెను ఎలాగైనా కాపాడాలని పెనుగులాడుతుంది. పరితపిస్తుంది. అలాంటి ఒక అరుదైన కేసు వివరాలివి... 

దాదాపు రెండేళ్ల కిందట మా దగ్గరికి 32 ఏళ్ల సతీష్‌ (పేరు మార్చాం) తీవ్రమైన ఛాతీనొప్పి, గుండెదడతో వచ్చాడు. వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసుకుని చూస్తే అతడి గుండె నార్మల్‌ కంటే చాలా వేగంగా కొట్టుకుంటూ, ఆగిపోయింది. ఇలాంటప్పుడు కరెంట్‌తో షాక్‌ ఇచ్చి మళ్లీ కొట్టుకునేలా చేస్తుంటాం. గుండె మరీ బలహీనంగా కొట్టుకుంటున్నప్పుడు లేదా హార్ట్‌ అటాక్‌తో గుండె ఆగిపోయినప్పుడు  కరెంట్‌తో షాక్‌ ఇచ్చి తిరిగి స్పందించేలా చేయడం మామూలే. సతీష్‌కూ  ఇలాగే షాక్‌ ఇచ్చి ఆగిపొయిన గుండె మళ్లీ స్పందించేలా చేశాం. 

ఆ తర్వాత వెంటనే అతణ్ణి కాథ్‌ల్యాబ్‌కు తీసుకెళ్లి యాంజియోగ్రామ్‌ చేసి చూస్తే అందులో ఏమీ తేడా లేదుగానీ, వేగంగా కొట్టుకుంటున్న అతడి గుండె స్పందనలు నార్మల్‌ కాలేదు. గుండె బాగా బలహీనంగా ఉంది. లంగ్స్‌లోకి నీరు చేరింది. వెంటిలేటర్‌ మీద ఉంచాల్సి వచ్చింది. గుండె ఇలా వేగంగా కొట్టుకునే కండిషన్‌ను ‘వెంట్రిక్యులార్‌ ట్యాకికార్డియా – వీటీ’ అంటారు. ఒకసారి షాక్‌ తర్వాత... గుండె స్పందించడం మొదలయ్యాక మళ్లీ మునుపటి పరిస్థితి రాకుండా ఉండటానికి అనేక ఇంజెక్షన్లు ఇచ్చాం. 

కానీ వీటీ అదుపులోకి రాలేదు. మల్టిపుల్‌ ఇంజెక్షన్స్‌ తర్వాత కూడా అతడి పరిస్థితి చక్కబడకపోవడంతో చాలా బాధేసింది. పాపం... పెళ్లి వయస్సుకు వచ్చిన కుర్రాడు. సాధారణంగా వెంట్రిక్యులార్‌ ట్యాకికార్డియా (వీటీ)ని చక్కదిద్దడానికి పేస్‌ మేకర్‌ అమర్చుతారు. ఇది గుండె స్పందనల్లో మార్పులు వచ్చినప్పుడల్లా ఓ చిన్న షాక్‌ను ఉత్పన్నం చేసి, గుండె స్పందనలను సాధారణ స్థితిలోకి వచ్చేలా చేస్తుంది.

 కానీ అతడికి వస్తున్నది వీటీల పరంపరం. దాన్ని వీటీ స్టార్మ్‌ అంటారు. అంటే వీటీల తుఫాను. ఇలా ఆగకుండా వస్తున్న వీటి పరంపరకు పేస్‌మేకర్‌ అమర్చినా లాభం ఉండదు. అది వేగంగా మాటిమాటికీ కరెంట్‌తో షాక్‌లిస్తూ పోతుంటే అందులోని బ్యాటరీ అయిపోతుంది తప్ప... ఇంక పెద్దగా ప్రయోజనం ఉండదు. బయటి నుంచే ఓవర్‌ డ్రైవ్‌ పేసింగ్‌ చేసే ఓ చిన్న పేస్‌ మేకర్‌ పెట్టి చూశాం. లాభం లేదు. వైద్య చికిత్సల్లో ఇలాంటి పరిస్థితిని ఎన్ని రకాలుగా ట్యాకిల్‌ చేయవచ్చో అన్నీ చేశాం. సిటీలోని ఇతర కార్డియాలజిస్టులతోనూ మాట్లాడాం. 

ఇలా వీటీ వచ్చినప్పుడల్లా బ్లడ్‌ప్రెషర్‌ డౌన్‌ అయిపోతోంది. కొన్నిసార్లు 50కు కూడా పడిపోయింది. వీటీలు ఆగడం లేదు. ఊపిరితిత్తుల్లో నీరు. పేషెంట్‌ వెంటిలేటర్‌ మీద. అలా  వెంటిలేటర్‌ మీద ఉంచాల్సిరావడంతో కిడ్నీలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్‌ చేయాల్సి వచ్చింది. ఎక్కడెక్కడి మెడిసిన్స్‌ ఇచ్చాం. ఎన్నెన్నో ఇంజెక్షన్లు చేశాం. నార్మలైజ్‌ చేయడానికి ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నీ చేసి చూశాం. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. చిన్న వయసు. లోకం అంతగా చూడని కుర్రాడు కళ్ల ముందే చనిపోతున్నాడనిపించింది. చనిపోవడం ఖాయం. 

ఒక చివరి ప్రయత్నంగా మెడికల్‌ లిటరేచర్‌ అంతా చదివా. ‘‘సింపథెక్టమీ’’ అనే ఓ ప్రోసీజర్‌ ఉంటుంది. ఇందులో నెర్వ్‌కు సంబంధించిన గ్యాంగ్లియాన్స్‌కు ఇంజెక్షన్‌ ఇస్తే సింపథెటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌లోని నరాలు  నెమ్మదిస్తాయి. దాంతో వీటీ ఆగుతుంది అని లిటరేచర్‌లో ఉంది. పేషెంట్‌ బంధువులను అడిగితే ‘ఎలాగూ చనిపోయేలా ఉన్నాడు. ఆ ప్రోసీజర్‌ చేస్తే బతుకుతాడేమో చేయండి సర్‌’ అన్నారు.

దాంతో సింపథెక్టమీ చేసే నా జూనియర్‌... డాక్టర్‌ విజయభాస్కర్‌ అని ఉన్నాడు. అతణ్ణి పిలిపించాం. వెంట్రిక్యులార్‌ ట్యాకికార్డియాకు సింపథెక్టమీ చేయడం మెడికల్‌ లిటరేచర్‌లో రాసి ఉన్న చాలా అరుదైన ప్రోసీజర్‌. నిత్యం మెడికల్‌ ప్రాక్టీస్‌లో అనుసరించేది కాదు. కేవలం ప్రయోగాత్మకంగా చేయాలనుకున్నది మాత్రమే. ప్రపంచం మొత్తమ్మీద ‘వీటీ’కి అప్పటికి జరిగిన సింపథెక్టమీ ప్రోసీజర్లు చాలా తక్కువ. 

పేషెంట్‌ను క్యాథ్‌ల్యాబ్‌లోకి తీసుకెళ్లాం. వెంటనే సింపథెక్టమీకి పూనుకున్నాం. వెన్నుపూస ఇరువైపులా ఉన్న గ్యాంగ్లియాన్స్‌కు ఇంజెక్షన్‌ ఇవ్వడం కోసం డాక్టర్‌ విజయభాస్కర్‌ సహాయంతో ‘బై లేటరల్‌ సర్వైకల్‌ సింపథెక్టమీ’ అనే ప్రోసీజర్‌ చేశాం.  ఒకసారి సింపథెక్టమీ చేశాక... ఒకటి రెండు సార్లు వీటీ వచ్చింది. 

అయితే ‘ఓవర్‌డ్రైవ్‌ పేసింగ్‌’తో తగ్గిపోయాయి. ఆ తర్వాత మళ్లీ వీటీ రాలేదు. వీటీ ఆగిపోగానే నెమ్మదిగా బాధితుడి కండిషన్‌ మెరుగవ్వడం మొదలైంది. మూత్రం రావడం మొదలైంది. డయాలసిస్‌ ఆపేశాం. వెంటిలేటర్‌ కూడా తీసేశాం. ఆ తర్వాత పేస్‌ మేకర్‌ అమర్చాం. రెండేళ్ల తర్వాత మొన్ననే ఓసారి అతడు వచ్చాడు. 

పరీక్షల్లో గుండె కండిషన్‌ బాగా మెరుగైనట్లు కనిపించింది. ఈమధ్య పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇదో టీమ్‌ వర్క్‌. ఓ బృందంలా చాలా ఫోకస్‌డ్‌గా పనిచేశాం. చావు తప్ప మరో దారే లేదనుకున్న ఓ బాధితుడి జబ్బును పూర్తిగా నార్మల్‌ చేయడం మా కార్డియాలజిస్టులకు దేవుడిచ్చిన ఒక అరుదైన అవకాశమని భావిస్తున్నాం.   
డా. ఎమ్‌.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్‌ 

(చదవండి:  కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement