ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నారు. ఆ సందర్భం వేరు. ఇక్కడ కూడా ఇంటిలోని పోరే. ఈ సందర్భం వేరు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా గుజరాత్ ఎన్నికల్లో నిలబడింది. ఆడపడుచు నైనాబా ఆమెకు సింహస్వప్నంగా మారింది. వదిన ఓటమి కోసం ఆమె చేయని ప్రచారం ప్రయత్నం లేదు. కోడలికి మద్దతు ఇవ్వకుండా కూతురు పక్షం చేరారు మామగారు. భర్త రవీంద్రకు ఇరకాటం ఉన్నా భార్య పక్షాన నిలిచాడు. రివాబా 50 వేల భారీ మెజార్టీతో గెలిచింది. ఈ గెలుపులో ఎన్నో మలుపులు. టీవీ సీరియల్ వంటి మెరుపులు.
‘ఆడపడుచు అర్ధమొగుడు’ అనే మాట ఎవరు అన్నారోగాని మొన్నటి గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినన్నాళ్లు రివాబా జడేజా(33)కు ఆ మాట గుర్తుకొస్తూనే ఉండి ఉంటుంది. బాల్‌ను బ్యాట్‌తో పిచ్చిగా బాదుతాడనే పేరు గడించిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య అయిన రివాబా జడేజా ఏకంగా నరేంద్ర మోడి ఆశీస్సులతో బి.జె.పి అభ్యర్థిగా జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగింది.
ఆమెకు కాంగ్రెస్, ఆప్ పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులు. కాని అసలు ప్రత్యర్థిగా మాత్రం ఆడపడుచు నైనాబా నిలిచింది. దానికి కారణం ఆమె కాంగ్రెస్ మద్దతుదారు. రవీంద్ర, నైనాల తండ్రి అనిరు«ద్ సింగ్ కూడా కాంగ్రెస్ మద్దతుదారుడే. అంటే ఇంట్లో ఆడపడుచు, మామగారు కాంగ్రెస్ పార్టీ. రివాబా బి.జె.పి. ఎలక్షన్ గెలవాలి... అలాగే ఇంటిలోని బంధాలు చెదిరిపోకుండా నెగ్గుకురావాలి. ఆ విధంగా రివాబాకు ఈ ఎన్నిక కత్తి మీద సాము అయ్యింది.
నైనాబా వ్యతిరేకత
నైనాబాకు బి.జె.పి అంటే అస్సలు గిట్టదు. బి.జె.పి పాలన వల్ల రాష్ట్రంలో అంతా నష్టమే జరుగుతోందని ఆమె అభిప్రాయం. అందుకే 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. తండ్రి కూడా చేరాడు. నైనాబా ఏ వేదిక దొరికినా దేశంలో ధరల పెరుగుదల గురించి, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడి బి.జె.పిని తూర్పార పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె సీట్ ఆశించింది కాని అది జరగలేదు. ఈలోపు ఏకంగా ఆమె వదిన, సోదరుడు రవీంద్ర భార్య అయిన రివాబాకు బి.జె.పి పిలిచి మరీ పార్టీ టికెట్ ఇచ్చింది.
అందుకు తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ జడేజాను పక్కన పెట్టింది. వదిన బి.జె.పిలో చేరడం నైనాబాకు బొత్తిగా నచ్చలేదు. అలాగని ఇంటి వరకు ఆమెతో అనుబంధాన్ని వదలుకోదలుచుకోలేదు. దాంతో పాటు బి.జె.పి అభ్యర్థిగా వదిన గెలవడాన్ని సహించనూ లేదు. దాంతో ఇంటి బయటి యుద్ధానికి తెర లేపింది.
అన్ని అస్త్రాలు
రివాబా తన ఆడపడుచు గురించి జాగ్రత్తగానే ఉంది. పెద్దగా విమర్శలు సంధించలేదు. కాని నైనాబా మాత్రం నిర్దాక్షిణ్యంగా వదిన రివాబా మీద అస్త్రాలు సంధిస్తూనే వెళ్లింది. ‘మా వదినది రాజ్‌కోట్. ఆమె ఒక కోడలిగా జామ్‌నగర్ వచ్చింది. ఆమె ఈ ప్రాంతానికి కొత్త. నాన్ లోకల్. ఆమెను గెలిపించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు’ అని వీధి వీధి ప్రచారం మొదలెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి బిపెందర్ సింగ్‌కు ఓటేయమని కోరింది. అభ్యర్థిత్వం కోసం రివాబా సమర్పించిన అఫిటవిట్‌లో ఆమె పేరు ‘రివా సింగ్ సోలంకి’ అని ఉంది.
దీనిని కూడా నైనా పట్టుకుంది. ‘చూశారా... మా వదినకు పెళ్లయ్యి ఆరేళ్లయినా తన ఇంటి పేరును అధికారికంగా మార్చుకోలేదు. అంత తీరిక లేదా ఆమెకు’ అని పబ్లిక్‌లో చర్చ పెట్టింది. రివాబా తన ప్రచారంలో ఐదేళ్ల కుమార్తెను ఒకటి– రెండుసార్లు తీసుకు వచ్చింది. దానికి కూడా అబ్జెక్షన్ చెప్పింది నైనా. ‘పిల్లల్ని చూపించి మా వదిన సెంటిమెంట్ పండించాలని అనుకుంటోంది.
పిల్లల్ని ప్రచారానికి తీసుకు రాకూడదు. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది’ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే రివాబా మాత్రం ‘రాజకీయాలు వారి వారి వ్యక్తిగతమైనవి. కుటుంబంగా మేమంతా ఒకటి’ అని చెప్పింది. కాంగ్రెస్‌కు ఓటు వేయమని మామగారు వీడియో రిలీజ్ చేసినా ఆమె ఎదురు విమర్శలు చేయలేదు.
భర్త తోడుగా
ఇంట్లో తండ్రి, చెల్లెలు కాంగ్రెస్ పార్టీ కోసం బ్యాటింగ్ చేస్తుంటే రవీంద్ర తన భార్య కోసం ప్రచార బాధ్యత తీసుకున్నాడు. భార్యకు అన్ని విధాలా సపోర్ట్‌గా నిలిచాడు. ఆమె గెలుపు కోసం రోడ్ షోలు నిర్వహించాడు. దాదాపు 2 లక్షల పై చిలుకు ఓట్లు ఉన్న నియోజక వర్గం అది. రాజ్‌పుట్‌ల ప్రాబల్యం ఎక్కువ. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు అదే సామాజిక వర్గానికి చెందిన వారు.
అందువల్ల గెలుపు అంత సులువు కాదు. దానికి తోడు చెల్లెలి బెడద. అందుకే రవీంద్ర చెమట చిందించాడు. డిసెంబర్ ఒకటిన జామ్‌నగర్ నార్త్‌లో పోలింగ్ జరిగింది. 8వ తేదీ భారీ మెజార్టీతో రివాబా విజయం సాధించింది. ‘హలో ఎం.ఎల్.ఏ. నువ్వు ఈ విజయానికి నిజంగా తగినదానివి’ అని సంతోషంగా రవీంద్ర జడేజా భార్యను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. పార్టీ అభ్యర్థిగా రివా గెలిచింది. కోడలిగా ఆమె ఇంటిలోనూ అదే పని చేయాల్సి ఉంది.
చదవండి
Comments
Please login to add a commentAdd a comment