చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరం (హైఫీవర్) తో బాధపడుతున్నారనుకోండి.. ‘ఆ... జలుబే కదా... చిన్న గొంతునొప్పే కదా..’ అని నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ వాస్తవం. పిల్లలకు జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదు. ఇందుకు ఓ కారణం ఉంది. జలుబు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇది కొందరిలో గ్రూప్–ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే దీనికి సరైన యాంటీబయాటిక్స్‌తో పూర్తి కోర్సు వాడుతూ చికిత్స అందించాలి. అలా జరగకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది.
లక్షణాలు
తొలుత జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే ఈ పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపిస్తాయి గానీ... ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలు.
అయితే చిన్న పిల్లల్లో ముందుగా వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. అది రుమాటిక్ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని కూడా వారికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.
చదవండి: పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త!
నిజానికి రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దాదాపు పదేళ్లు కొనసాగితే మాత్రం... గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది.
చికిత్స / నివారణ
వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా చికిత్స చేస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్‌తోనే సమస్య పూర్తిగా ముగిసిపోతుంది. కానీ ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది (చాలా కొద్దిమంది పిల్లల్లోనే). మరికొందరిలో బ్లడ్‌థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు సైతం అదీ ఓ సమస్యగా పరిణమించవచ్చు.
అందుకే పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకూడదు. పీడియాట్రీషియన్‌ను ఓసారి తప్పనిసరిగా సంప్రదించడమే మేలు. ఇంత పెద్ద సమస్య కేవలం ఒక పూర్తి (కంప్లీట్) కోర్సు యాంటీబయాటిక్‌తోనూ... అంతేగాక... శారీరక/వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)తోనూ నివారించవచ్చని గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment