Boxer Nikhat Zareen Successful Journey In Telugu: నిజామాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన నిఖత్ జరీన్ క్రీడాప్రస్థానం అక్కడి కలెక్టర్ గ్రౌండ్స్‌లో మొదలైంది. అది కూడా కాకతాళీయంగానే. నిఖత్... వంద మీటర్లు, రెండు వందల మీటర్ల పరుగులో ప్రాక్టీస్ చేయడం కూడా అసంకల్పితంగానే జరిగింది. తనను అథ్లెట్‌గా పరుగులు పెట్టించిన గ్రౌండ్స్‌ను, బాక్సింగ్ ఆకర్షించిన వైనాన్ని వివరించింది నిఖత్. ‘‘మేము నలుగురం అమ్మాయిలం. మా చిన్నప్పుడు నాన్న విదేశాల్లో ఉద్యోగం చేస్తుండేవారు. దాంతో మేమంతా అమ్మమ్మగారింట్లో పెరిగాం. నాన్న ఇండియాకి వచ్చిన తర్వాతనే మా జీవితంలోకి స్పోర్ట్స్ వచ్చాయి. ఇంట్లో అక్కలిద్దరూ చదువుకుంటూ ఉంటే నేను అల్లరి చేస్తూ విసిగిస్తుండేదాన్ని.
అక్కల చదువుకు ఇబ్బందవుతోందని నాన్న నన్ను రోజూ ఉదయాన్నే గ్రౌండ్‌కి తీసుకువెళ్లేవారు. ఒక కోచ్ నా ఫిట్‌నెస్ బాగుందని, రన్నింగ్‌లో ఒడుపు ఉందని గమనించి... నాతో మాట్లాడారు. మా నాన్నను చూపించాను. నాన్నని చూసి ఆశ్చర్యపోయిన ఆయన నన్ను స్పోర్ట్స్‌లో ఎంకరేజ్ చేయమని చెప్పారు. నాన్న పేరు జమీల్ అహ్మద్. కాలేజ్ డేస్‌లో ఆయన కూడా స్పోర్ట్స్ పర్సనే. అప్పుడు నాన్నకు తెలిసిన వ్యక్తే నన్ను గుర్తించిన ఆ కోచ్. అప్పటి నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ మొదలైంది. వంద మీటర్లు, రెండు వందల మీటర్ల రన్నింగ్ రేస్‌లో మెడల్స్ కూడా వచ్చాయి. ఆ రకంగా గ్రౌండ్‌కి వెళ్లడం నాన్నకు, నాకూ డైలీ రొటీన్ అయింది.
ఆ గ్రౌండ్‌లో క్రీడాకారులు, పిల్లలు రకరకాల ఆటల్లో ప్రాక్టీస్ చేస్తుండేవాళ్లు. అన్ని ఆటల్లోనూ అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ కనిపించేవారు. కానీ బాక్సింగ్ రింగ్‌లో ఎప్పుడూ అబ్బాయిలే కనిపించేవారు. ఓ రోజు ‘నాన్నా! అమ్మాయిలు బాక్సింగ్ చేయరా, అమ్మాయిలు బాక్సింగ్ చేయకూడదా’ అని నాన్నను అడిగాను. ‘చేయవచ్చు, కానీ బాక్సింగ్ చేయాలంటే చాలా బలం ఉండాలి. అందుకే అమ్మాయిలు ఇష్టపడరు’ అని చెప్పారు. అప్పుడు నాన్న చెప్పిన సమాధానమే నన్ను బాక్సింగ్ వైపు మళ్లించింది. వెంటనే... ‘నేను చేస్తాను’ అని చెప్పాను. మొదట్లో నాన్న కూడా లైట్‌గానే తీసుకున్నారు. కానీ రోజూ బాక్సింగ్ చేస్తానని మొండికేయడం, కోచ్ కూడా ‘ఈ రంగంలో అమ్మాయిలు ఆసక్తి చూపించడం లేదు.
మీ అమ్మాయికి కోచింగ్ ఇప్పించండి. ఫస్ట్ జనరేషన్ ఉమన్ బాక్సర్ అవుతుంది’ అని చెప్పడంతో నాన్న కూడా ఒప్పుకున్నారు. ఆడపిల్ల ఏంటి? పొట్టి దుస్తులు వేసుకుని ప్రాక్టీస్ చేయడమేంటని బంధువులు, స్నేహితుల్లో కొందరన్నారు. కానీ నాన్న వెనుకడుగు వేయలేదు. నాన్న ఆలోచనలు విస్తృతంగా సాగుతాయి. అందుకే అలా అన్న వాళ్లందరినీ సమాధానపరచ గలిగారు. ఒకసారి బాక్సింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఇది నాకు నేనుగా తీసుకున్న చాలెంజ్. ఒక్కొక్క లక్ష్యాన్ని ఛేదిస్తూ వస్తున్నాను. చాంపియన్‌షిప్స్‌కి వెళ్తే స్వర్ణం, రజతం, కాంస్యం... ఏదో ఒక పతకంతో వస్తానని మా కోచ్‌లకు నా మీద నమ్మకం. ఇప్పటి వరకు వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చాను. ఇకపై కూడా నిలబెడతాను’’ అంటోంది నిఖత్ జరీన్. అన్నట్లు ఆమె చెల్లి అఫ్నాన్ జరీన్. ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్.
బ్యాంకు ఉద్యోగం
నిఖత్ జరీన్‌కి స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడామె హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్‌లో జూనియర్ మేనేజర్. ఉద్యోగం చేస్తూ బాక్సింగ్ ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. ఆమె ఆడిన మూడు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం సాధించింది. 51 కిలోల విభాగంలో శిక్షణ పొందిన నిఖత్‌కు బల్గేరియాలో 54 కిలోల విభాగంలో పోటీ పడాల్సి వచ్చింది. ఊహించని పరిణామాన్ని సంభాళించుకుని బరిలో దిగిన నిఖత్ అందులో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లగలిగింది. ఆమెను తడబాటుకు గురిచేసిన ఏకైక సంఘటన అది. ఇప్పుడు ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ చేయడంతోపాటు రాబోయే మార్చిలో ఇస్తాంబుల్‌లో జరిగే ప్రపంచ స్థాయి చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది.
రిటైర్ అయిన తర్వాత...
బాక్సింగ్‌లో తన లక్ష్యాలను సాధించిన తర్వాత మాత్రమే రిటైర్ అవుతానని, రిటైర్ అయిన తర్వాత బాక్సింగ్ కోసం శిక్షణ కేంద్రాన్ని స్థాపించే ఆలోచన చేస్తానని చెప్పింది నిఖత్. బాక్సింగ్ శిక్షణలో అమ్మాయిలను ప్రోత్సహించడం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా చెప్పింది. అయితే ప్రస్తుతం తన లక్ష్యం 2024 ఒలింపిక్స్ అనీ, అప్పటి వరకు మరే విషయాన్నీ మెదడులోకి రానివ్వనని చెప్పింది. ముదితల్ నేర్వగరాని విద్య గలదె... ముద్దార నేర్పింపగన్... అనే పద్యాన్ని స్ఫూర్తి పొందాల్సిన స్థితి నుంచి మహిళలు అనేక వందల సోపానాలను చేరుకున్నారు. అయినప్పటికీ మహిళలు ఛేదించాల్సిన పరిధులు ఇంకా ఉన్నాయని నిఖత్ జరీన్ వంటి వాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది. ఒక్కో సరిహద్దును చెరిపేస్తూ విజయపథంలో పరుగులు తీస్తున్న మహిళలకు మరో తాజా ప్రతీక నిఖత్ జరీన్.
జరీన్ తాజా లక్ష్యం ఒలింపిక్స్!
టర్కీలో ‘ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్స్ (2011)’లో బంగారు పతకం, బల్గేరియాలో జరిగిన ‘యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్(2014)’లో రజతం, ‘సీనియర్ ఉమన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్’లో బంగారం, ‘నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్’లో మరో బంగారు పతకం... ఇలా ఈ అమ్మాయి స్పోర్ట్స్ ఖాతాలో జాతీయ, ప్రపంచస్థాయి పతకాలు పాతిక వరకున్నాయి. గడచిన అక్టోబర్‌లో హరియాణాలో జాతీయస్థాయి బంగారు పతకంతోపాటు బెస్ట్ బాక్సర్ అవార్డుతో రాష్ట్రానికి వచ్చింది నిఖత్ జరీన్. ఇప్పుడు రాబోయే ఒలింపిక్స్ (2024)కి సిద్ధమవుతూ తదేక దీక్షతో ప్రాక్టీస్ చేస్తోంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment