మనం ఏదైనా పూజాది కార్యక్రమాలలో సంకల్పం చెప్పుకునేప్పుడు కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. అంటే కలియుగం మొదటి నాలుగవ వంతులో అని అర్థం. కలియుగం పైన అధికారం కలిపురుషుడిది. అతడి పెత్తనంలో ఉండే కలియుగ లక్షణాలని కొద్దిగానో, విపులంగానో అన్ని పురాణాలు ప్రస్తావించాయి. ధర్మం ఒక పాదం అంటే నాలుగవ వంతు మాత్రమే ఉంటుంది, మూడు పాళ్ళు అధర్మమే ఉంటుంది. అది మరింత పెచ్చు పెరిగి సజ్జనులు బతక లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీమహావిష్ణువు దుష్టసంహారం చేసి, శిష్టరక్షణ చేయటానికి భూమిపై అవతరిస్తాడు. ఆ అవతారం పేరు కల్కి.
శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే సదాచార సంపన్నుడైన నైష్ఠిక బ్రహ్మణుడికి, సుమతికి జన్మించి, పద్మావతి అనే సింహళ రాజకన్యని వివాహమాడి, తెల్లని గుర్రాన్ని అధిరోహించి ఖడ్గం ధరించి దుష్టసంహారం చేస్తాడు. భూ భారాన్ని తగ్గిస్తాడు – ఇదీ పురాణాలన్నింటి క్లుప్తసారాంశం. ఈ అవతారం కలియుగం చివరలో వస్తుంది. త్రేతాయుగం చివరలో రామావతారం, ద్వాపరయుగం చివరలో కృష్ణావతారం వచ్చినట్టు.
కల్కి ఎప్పుడు అవతరిస్తాడు? కలి విజృంభించినప్పుడు కల్కి అవతరిస్తాడు, యుగాంతంలో. యుగాంతం అనగానే సృష్టి అంతా జలమయం అయిపోయి ఏమీ లేని స్థితి అని అర్థం కాదు. కలి లక్షణాలు కలవారు, కలిప్రభావితులు సమసిపోతారు. కృతయుగంలో ఉండదగిన వారు మిగిలి ఉంటారు.
కలి లక్షణాలు: పరీక్షిత్తు పరిపాలన చేస్తున్న కాలంలో కురు జాంగల దేశాలలో పర్యటిస్తూ ఒంటికాలితో సంచరిస్తున్న వృషభరూపంలో ఉన్న ధర్మదేవుడు, గోరూపంలో ఉన్న భూమాతల సంభాషణ విన్నాడు. గోమాత కన్నీరు కార్చటానికి కారణం ధర్మదేవుడు అడిగాడు. ‘‘దేహం వ్యాధిగ్రస్తమై, ముఖం వాడిపోయి ఉన్నాయి. బంధువులకి ఆపద కలిగిందా? మూడు కాళ్ళు లేని నన్ను పట్టుకుంటారని బాధపడుతున్నావా?
ఇక ముందు లోకమెట్లా ఉంటుందో తలుచుకుని దుఃఖిస్తున్నావా?’’ అని గోవు భయానికి కారణాలని అడుగుతాడు. అవి కలియుగ లక్షణాలు. 1. యజ్ఞాలు లేక దేవతలకి హవిస్సులు అందవు. 2.భర్తలు భార్యలను భరించరు. 3. పిల్లలు తల్లితండ్రులను పోషించరు. 4. సరస్వతి చెడ్డవారిని ఆశ్రయిస్తుంది. 5 ఉత్తమ విప్రులు రాజులకి సేవ చేస్తారు. 6. ఇంద్రుడు వానలు కురిపించడు. 7. దేశంలో న్యాయం నశించి పోతుంది. 8. మానవులు ఆహార నిద్రా భయ మైథునాదుల పట్ల మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు. 9. నీచులు పరిపాలిస్తూ ఉంటారు.
"కలి ఉంటే ప్రపంచం ఎట్లా ఉంటుందో గోవు మాటల్లో తెలిసింది. ఈ లక్షణాలు మానవులలో కొద్దిగానైనా ఉంటాయి. అవి కృతయుగంలో నామ మాత్రంగా ఉంటే, త్రేతాయుగంలో సగానికి సగం ఉంటే, ద్వాపరంలో మూడువంతులు ఉంటే, కలియుగంలో క్రమక్రమంగా పెరిగి అవి మాత్రమే ఉండే స్థితికి చేరుకోటం జరుగుతుంది. అప్పుడు కల్కి గుర్ర మెక్కి వచ్చి, కత్తితో దుష్టసంహారం చేస్తాడు. అది ఎప్పుడు? గో వృషభ సంభాషణలో కలియుగం ఎప్పుడు మొదలైనది తెలిసింది కదా! కృష్ణ నిర్యాణంతో. కలియుగం ఆరంభం అయి 5,125 సంవత్సరాలు."
‘‘ఇదంతా కృష్ణుడు శరీరం వదలటం వల్ల జరిగింది. నీవు కూడా ఒక్క కాలితో కుంటుతూ ఉన్నావు. కలిపురుషుడి ప్రేరణతో భయంకర పాపకృత్యాలని చేస్తున్న మానవులని చూస్తే దుఃఖం కలుగుతోంది. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు, నీకు, నానా వర్ణాశ్రమాలకి, గోవులకి బాధ కలుగుతోంది.’’ అని తన బాధకి కారణాన్ని చెప్పింది గోరూపధారి అయిన భూదేవి. ఇది కలి ప్రభావం యొక్క ఫలితం.
పరీక్షిత్తు ధర్మదేవుణ్ణి, భూదేవిని సముదాయించి, కలితో కఠినంగా మాట్లాడుతూ కత్తి తీశాడు. భయపడిన కలిపురుషుడు రాజచిహ్నాలని వదలి పరీక్షిత్తు కాళ్ళమీద పడి దయ తలచమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడిని చంపక ధర్మవర్తనులు ఉండే తన రాజ్యం వదలి దూరంగా ΄÷మ్మన్నాడు. కలిపురుషుడు తాను ఎక్కడ ఉండాలో చెప్పమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడు ఉండటానికి నాలుగు ప్రదేశాలని సూచించాడు. అవి జూదం, మద్యపానం,ప్రాణివధ, స్త్రీ (పరస్త్రీ వ్యామోహం) ఉన్న చోట్లు. అవి చాలవు మరికొన్ని కావాలని అడిగాడు. బంగారం అనే ఐదో చోటు కూడా కలికి ఇచ్చాడు. బంగారంతో వచ్చే అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే మరొక ఐదు స్థానాలు కలి నివాసాలు అయ్యాయి.
ఇప్పుడే ఇట్లా ఉంటే, చివరి నాలుగోవంతు సమయంలో ఎట్లా ఉంటుందో? అని భయం అక్కర లేదు. ధర్మమార్గంలో చరించే వారి దగ్గరకు కలిపురుషుడు రాడు. అధర్మమార్గంలో ఉండేవారిని చక్కజేసి, ప్రేరేపించే వారిని మట్టుపెట్టటానికి కల్కి రానే వస్తాడు. – డా.ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment