తెలుగు తమిళ, బాలీవుడ్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సమీరా రెడ్డి సైతం ఆ సమస్యతో బాధపడిందట. జనాలంతా అదేదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తూ ఆ సమస్య గురించి తెగ మాట్లాడతారని మండిపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా ఆ సమస్యను ధైర్యంగా ఫేస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలో చూద్దాం!
ఇంతకీ సమీరా ఏ సమస్యతో బాధపడిందంట?..అధిక బరువు. ఆమె ప్రసవానంతరం బయటకి రావడానికే ఇబ్బంది పడిందట. అనుకోకుండా ఓ రోజు తన బాబుతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లితే అక్కడ సెక్యూరిటీ గార్డు ఆమె ఆధార్ కార్డుని తనిఖీ చేస్తూ చేసిన కామెంట్‌ని తానస్సలు మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏంటి మేడం మరీ ఇంత లావయ్యి పోయారు అంటూ జాలిగా చూసిన చూపు గుర్తొస్తే ఒళ్ల మండిపోతుందంటూ వాపోయింది. మహిళ శరీరాల గురించి కొందరూ అదెదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తారు. ఇది ప్రకృతిసహజంగా జరిగే మార్పులు కొన్ని ఉంటాయని అర్థం చేసుకోరు, తెలుసుకోరు అని తిట్టిపోసింది.
ముఖ్యంగా మన సమాజంలో ఇలాంటివి మరి ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఇలాంటప్పుడూ మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వాటన్నింటిని ధైర్యంగా ఫేస్ చేయాలి. జన్మనిచ్చే తల్లుల పట్ల గౌరవం లేకపోయిన పర్లేదు కానీ సహజంగా స్త్రీ తల్లి అయ్యాక వచ్చే శరీర మార్పులను ఎగతాళి చేయొద్దని చెబుతోంది. అదేసమయంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరూ తల్లి అయ్యాక కూడా స్లిమ్‌గా ఉండొచ్చు కానీ అలా అందరికీ సాధ్యం కాదని, అందరీ శరీర నిర్మాణాలు ఒకే రీతిలో ఉండవని గుర్తించాలని చెప్పింది. సమీరా 2014లో అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఈ జంటకు 2015లో కొడుకు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు.
ఇక ఇలాంటి సమస్యలు సమీరా లాంటి సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఫేస్ చేసేదే. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టాలంటే.. మన అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా బయటపడొచ్చు.
ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు..
- సాధారణంగా ప్రసవించిన మహిళలు సాధారణంగా లావుగా కనిపిస్తారు. తగ్గడం కూడా అంత ఈజీగా ఉండదు. ఓ పక్క పిల్లలను చూసుకోవడంతో బిజీగా ఉండటంతో శరీరంపై దృష్టిపెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు ఒళ్లు తగ్గించుకోవాలంటే వాము నీళ్లే చక్కటి పరిష్కారం. గర్భధారణ సమయంలో కూడా వీటిని తాగొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యల్ని అధిగమిస్తుంది. అతిసారం, మలబద్దకాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతే కాదు గర్భధారణ సమయంలో ఏర్పడిన అదనపు కొవ్వుని కరిగించడంలో సాయం చేస్తుంది. ప్రతిరోజు మీ డైట్ లో వామ్ము నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే నాజూకైన అందం మీ సొంతం అవుతుంది. ఈ నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
- యాలకులు, సోంపుతో కలిసి చేసే కషాయం ప్రసవం తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది.
- జాజికాయ పాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఒక కప్పు పాలల్లో పావు టీస్పూన్ జాజికాయ పొడి కలిపి మరిగించి, గోరు వెచ్చగా తాగాలి. ఇలా చేస్తే చాలా సులభంగా ప్రసవానంతరం వచ్చిన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు.
(చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!)
Comments
Please login to add a commentAdd a comment