Sandhya Devanathan Appointed as Head and Vice President of Meta India
Sakshi News home page

Sandhya Devanathan: మెటా పవర్‌

Published Sat, Nov 19 2022 4:04 AM | Last Updated on Sat, Nov 19 2022 8:40 AM

Sandhya Devanathan Appointed Head and Vice President of Meta India - Sakshi

మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్యా దేవనాథన్‌

‘బిగ్గెస్ట్‌ రిస్క్‌ ఏమిటో తెలుసా? రిస్క్‌ చేయకపోవడమే’ అంటాడు మెటా సీయీవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌. మెటాలో భాగమైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ప్రస్తుతం రకరకాల సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితులలో రానున్న జనవరిలో ‘మెటా ఇండియా’ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది సంధ్యా దేవనాథన్‌.
ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ వరకు ఎన్నో ప్రసిద్ధ విద్యాలయాల్లో చదువుకున్న సంధ్య నిత్య విద్యార్థి. అదే ఆమె నైపుణ్యం. నాయకత్వ బలం...


ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ ‘మెటా’ సంధ్యా దేవనాథన్‌ను ‘మెటా ఇండియా’ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రాయూనివర్శిటీ(ఏయూ, విశాఖపట్టణం)లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన సంధ్య దిల్లీ యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ‘లీడర్‌షిప్‌’ కోర్స్‌ చేసింది.
సిటీబ్యాంక్‌లో ఉద్యోగం చేసిన సంధ్య ఆ తరువాత స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకులో చేరి మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ పేమెంట్‌ ప్రొడక్ట్స్‌) స్థాయికి ఎదిగింది.
జనవరి 2016లో మెటాలో చేరిన సంధ్య ఆగస్ట్‌లో మెటా మేనేజింగ్‌ డైరెక్టర్‌(సింగపూర్‌), మెటా బిజినెస్‌ హెడ్‌ (వియత్నాం)గా పనిచేసింది. మెటాకు సంబంధించి ఆగ్నేయాసియా ఇ–కామర్స్‌ వ్యవహారాలను పర్యవేక్షించింది.

 మెటా ప్రకటనకు ముందు వరకు ఆసియా–పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి గేమింగ్‌–వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది సంధ్య.
మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం సాధారణ విషయం ఏమీ కాదు. ఇంతకీ సంధ్య బలం ఏమిటి?
వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే నైపుణ్యం, సమర్థవంతులైన ఉద్యోగులతో బృందాన్ని ఏర్పాటు చేసుకొని అత్యున్నత ఫలితాలు రాబట్టడం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ‘ఇది నా బలం’ అని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. మీడియాలో పెద్దగా ఇంటర్య్వూలు కూడా కనిపించవు. అయితే ఆమె ట్రాక్‌ రికార్డ్‌ ఆమె బలం ఏమిటో చెప్పకనే చెబుతుంది.

పెప్పర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గ్రూప్, నేషనల్‌ లైబ్రరీ బోర్డ్‌(సింగపూర్‌), సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్శిటీ, మినిస్టర్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌
(సింగపూర్‌), ఉమెన్స్‌ ఫోరమ్‌ ఫర్‌ ది ఎకా నమీ అండ్‌ సొసైటీ... మొదలైన వాటిలో బోర్డ్‌ మెంబర్‌గా పనిచేసిన సంధ్యకు స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు అంటే ఆసక్తి.
మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే మెటా ఉమెన్స్, ఏపీఏసీలో ఎగ్జిక్యూటివ్‌ స్పాన్సరర్‌గా విధులు నిర్వహించింది.
డిటిటల్‌ రంగంపై మన ఆసక్తిని గమనించిన మెటా తన టాప్‌ ప్రాడక్ట్స్‌ను ఇండియాలోనే లాంచ్‌ చేసింది.
మన దేశంలోని లీడింగ్‌ బ్రాండ్స్, క్రియేటర్స్, అడ్వర్‌టైజర్‌లతో కంపెనీకి ఉండే స్ట్రాటిజిక్‌ రిలేషన్‌ను బలోపేతం చేయడానికి బలమైన వ్యక్తి కోసం వెదికింది మెటా.
తమ భవిష్యత్‌ లక్ష్యాలను నెరవేర్చే శక్తి సామర్థ్యాలు సంధ్యలో ఉన్నాయి అనే బలమైన నమ్మకంతో  పెద్ద బాధ్యతను అప్పగించి ఘన స్వాగతం పలికింది.

లీడర్‌షిప్‌ పాఠాలలో నొక్కి వక్కాణించి చెప్పే మాట...
‘లీడర్‌షిప్, లెర్నింగ్‌ అనేవి వేరు వేరు ధ్రువాలు కాదు. ఒకదానిపై ఒకటి అనివార్యంగా ఆధారపడతాయి’
సిటీబ్యాంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేసినా, మెటా లాంటి సంస్థలో బాస్‌గా కీలక విధులు నిర్వహించినా నేర్చుకోవడాన్ని మాత్రం సంధ్య ఎప్పుడూ ఆపలేదు. వ్యక్తులు మొదలు సామాజిక పరిస్థితుల వరకు ఎన్నో విషయాలు నేర్చుకొని తనను తాను తీర్చిదిద్దుకుంది. ప్రసిద్ధ విద్యాలయాల్లో ఆమె నేర్చుకున్న పాఠాలు ఎన్నో సందర్భాలలో తనకు దారి చూపాయి.

ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు రకరకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వాటిని అధిగమించి ఆదాయాన్ని పెంచడం చిన్న విషయమేమీ కాదు.
బ్యాంకింగ్, పేమెంట్స్, టెక్నాలజీ రంగాలలోఅంతర్జాతీయ స్థాయిలో 22 సంవత్సరాల అనుభవం ఉన్న సంధ్యా దేవనాథన్‌కు సవాళ్లు కొత్త కాదు. విజయాలు సాధించడమూ కొత్త కాదు.
బెస్టాఫ్‌ లక్‌ సంధ్య గారూ!     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement