బతుకు బండికి భరోసా! | Sankalpa Voluntary Organization In Khammam | Sakshi
Sakshi News home page

బతుకు బండికి భరోసా!

Published Sat, Aug 17 2024 12:10 PM | Last Updated on Sat, Aug 17 2024 12:10 PM

Sankalpa Voluntary Organization In Khammam

ఆమె చేస్తున్నది టీజీఎస్‌ ఆర్టీసీలో కండక్టర్‌ ఉద్యోగం. ఆమె భర్త హోంగార్డు.. వారిది దిగువ మధ్య తరగతి కుటుంబం.. అయితేనేం, థలసీమియా వ్యాధి బారిన పడిన చిన్నారులకు చేతనైన మేరకు అండదండలు అందించాలన్న సంకల్పానికి ఇవేమీ అడ్డంకి కాలేదు. తన సమీప బంధువు కుమారులు థలసీమియాతో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు పడిన వేదనను చూసి చలించి పోయింది. అప్పుడే ఆమె థలసీమియా బాధితులకు చేతనైన సేవ చేయాలని సంకల్పించింది. ఆమె సంకల్ప బలం ముందు తనకు వచ్చే ఆదాయం ఎంత..? తాను ఎలా సాయపడగలననే ఆలోచనలు చిన్నవే అయ్యాయి.

ఖమ్మం నగరంలోని ఇందిరానగర్‌ కాలనీలో ఉంటున్న ప్రోద్దుటూరి అనిత ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త రవిచందర్‌ సీపీ కార్యాలయంలో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వారి బంధువుల పిల్లలిద్దరూ థలసీమియాతో బాధపడుతూ మృతిచెందారు. ఆ బాలల తల్లిదండ్రులు పడిన వేదనను దగ్గర నుంచి చూసిన అనిత అలాంటి చిన్నారుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. గతంలో హెచ్‌ఐవీపై అవగాహన కల్పించే స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన అనుభవంతో రక్త సేకరణపై దృష్టి పెట్టారు. ఆమె నిర్ణయానికి కుటుంబం మద్దతుగా నిలిచింది.

స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం...
థలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్‌ వెళ్లి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు. దీంతో గతంలో అనిత పనిచేసిన ఎ జీవో ద్వారా సేవ చేద్దామని చూసినా.. వీలు కాక΄ోవడంతో వ్యక్తిగత దాతల నుంచి రక్తదానం చేయించడం ద్వారా పిల్లలకు రక్తం ఎక్కించే వారు. ఆ తర్వాత 2010లో ‘సంకల్ప స్వచ్ఛంద సంస్థ’ పేరుతో రిజిస్టర్‌ చేశారు. తొలుత 25 మందికి ఈ సంస్థ ద్వారా రక్తం ఎక్కించడం ్ర΄ారంభించారు. హైదరాబాద్‌ వెళ్లి రక్తం ఎక్కించుకోవడం చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని కావడంతో ఇక్కడ సంఖ్య పెరిగింది. దీంతో రక్తదాతల కోసం కాలేజీలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రక్తదాతల భాగస్వామ్యంతో ఇప్పుడు ‘సంకల్ప’ ద్వారా 220 మందికి రక్తం అందుతోంది. ఇక్కడ చికిత్సతో పాటు మందులు కూడా ఉచితమే. 2009 నుంచి ఇప్పటివరకు 500కు పైగా బ్లడ్‌క్యాంపులతో΄ాటు వ్యక్తిగత దాతల నుంచి 15 వేల లీటర్లకు పైగా రక్తాన్ని సేకరించి చిన్నారులకు అందజేశారు.

‘కరోనా’ కాలంలోనూ...
కరోనా కష్ట కాలంలోనూ థలసీమియా చిన్నారులకు రక్తం ఎక్కించే ప్రక్రియ నిరాటంకంగా సాగింది. అనిత చేస్తున్న సేవతో స్ఫూర్తి పోందిన అనేకమంది బయటకు రావడానికే భయపడుతున్న ఆ సమయంలోనూ ఆ చిన్నారుల కోసం రక్తదానం చేశారు.

సంస్థ ఆధ్వర్యంలో అవగాహన...
థలసీమియా అనేది నివారించదగిన వ్యాధి. అలాగే వంశ΄ారంపర్యంగా వస్తుంది. పెళ్లికి ముందు హెచ్‌బీఎ –2 (ఎలక్ట్రో ఫోర్సెస్‌) పరీక్ష చేయించుకుంటే థలసీమియా వ్యాధితో పుట్టే పిల్లలు లేకుండా చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వాలు కూడా పోలియో, ఎయిడ్స్‌పై ప్రచారం చేసినట్లుగా థలసీమియా పరీక్షలపై అవగాహన కల్పించడం లేదు. ఈ క్రమంలో సంకల్ప స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 7,500 మంది డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. థలసీమియాపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ర్యాలీ నిర్వహిస్తున్నారు.

బోన్‌ మ్యారో ఆపరేషన్లపై దృష్టి...
థలసీమియా రహితం కావాలంటే బోన్‌ మ్యారో ఆపరేషన్‌  ఒక్కటే మార్గం. ఇది సామాన్యులకు సాధ్యపడేది కాదు. అయితే చిన్నారులకు ఈ ఆపరేషన్లు చేయించడం పై దృష్టి పెట్టింది సంకల్ప. నామమాత్రపు ధరలతో ఆపరేషన్‌  జరిగేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఈ సంస్థ ్రపారంభించిన తర్వాత రక్తం అందక చనిపోయిన వారు లేరంటే సంస్థ సంకల్ప బలం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
– బొల్గం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం

కడుపు కోత తప్పించాలనే...
ఓ కుటుంబంలో తలసేమియాతో ఉన్న పిల్లలు పుట్టారంటే వారిని ఎలా కా΄ాడుకోవాలన్నది బాధ చెప్పలేనిది. ఆ నరకం నుంచి తల్లిదండ్రులు బయటపడాలనేది మా సంకల్పం. ప్రస్తుతం ఇది నిర్విఘ్నంగా సాగుతోందంటే దాతల వల్లనే సాధ్యమవుతోంది. నేను కండక్టర్‌గా బస్సులో ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ బస్సు ఎక్కే యువకులకు థలసీమియా గురించి చెప్పి.. రక్తదానం చేయమని కోరేదాన్ని. దాంతో కండక్టర్‌గా నేను ఆ బస్సుకి వస్తే.. నన్ను చూసి భయపడి బస్సు ఎక్కేవాళ్లు కాదు. కొంతకాలం తర్వాత రక్తదానంతో తాము ఒకరికి ్రపాణం పోస్తున్నామని యువకులకు అర్థమైంది. ఇలా మొదలైన ప్రస్థానం యువకుల రక్తదానంతో  ముందుకు సాగుతోంది. థలసీమియాతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వం పింఛన్‌  ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. 
– ్రపోద్దుటూరు అనిత, 
సంకల్ప స్వచ్ఛంద సంస్థ, ఖమ్మం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement