సంక్రాంతి.. పల్లెంతా ఇల్లవుతుంది | Sankranti Celebrations At Village | Sakshi
Sakshi News home page

సంక్రాంతి.. పల్లెంతా ఇల్లవుతుంది

Published Thu, Jan 14 2021 8:14 AM | Last Updated on Thu, Jan 14 2021 9:28 PM

Sankranti Celebrations At Village - Sakshi

సంక్రాంతి అంటే మూడు పండుగలు. అటు భోగి, ఇటు కనుమ, నడుమ సంక్రాంతి. గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు మనకు తెలిసిన సంక్రాంతి. పట్టణంలో ఉండేవారికి తెలియని సంస్కృతులు, సంప్రదాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నిన్న భోగి ముగిసింది. నిన్నటి కొనసాగింపుగా, నేడూ సాగి, రేపటికి పూర్తయ్యే ఈ సంరంభాలు పల్లెల్లో ఎలా జరుగుతాయో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. 

భోగి రోజు ఇంటి పెద్ద కొడుకు నిద్రలేచి చిమ్మచీకట్లోనే టార్చిలైటు సాయంతో పొలానికి వెళ్లి గరిక, గుమ్మడి ఆకులు, పువ్వులు తీసుకొస్తాడు. ఇంటిల్లపాదీ తెలవారక ముందే స్నానం చేసి భోగి మంటలో నుంచి నెయ్యిదీపం వెలిగించుకుని నట్టింట పెడతారు. మరో నెయ్యి దీపం నివాసం ముఖద్వారం ముందు ఈశాన్య మూల ఉంచుతారు. అక్కడే గోమూత్రం చల్లి, గోవుపేడతో నాలుగు చిన్న ముద్దలుగా చేసి పసుపు, కుంకుమ పెట్టి దానిపై గుమ్మడిపువ్వులు, గరిక ఉంచుతారు. ఆ తరువాత గుమ్మడి ఆకుల్లో బెల్లం లేదా చక్కెర పెట్టి ప్రత్యేక పూజచేసి పెద్దలను పండుగకు ఆహ్వానిస్తారు. ఇదంతా భోగి నాడు నిన్న జరిగే ఉంటుంది. నేడిక (సంక్రాంతికి) నివాసంలో ఉన్న మహిళలంతా  వివిధ రకాల పిండి వంటకాలు తయారు చెయ్యటానికి సిద్దమవుతారు. 

ఇంటి ముందు పొయ్యి
పిండి వంటల కోసం ఇంటి ముందు పొయ్యి తవ్వుతారు. అక్కడ ఒకటిన్నర అడుగు పొడవు, లోతు పొయ్యి తవ్వుతారు. ఆ పొయ్యి చుట్టూ గోమూత్రం చల్లి ఎర్రమట్టి, ముగ్గుపిండితో ముగ్గువేస్తారు. అందులో వరిపొట్టు, ఎండబెట్టిన గోవుపేడ పిడకలను ఉంచి కర్పూరం వెలిగిస్తారు. ఆ తరువాత ఆ పొయ్యి చుట్టూ మట్టితో తయారుచేసిన ముద్దలను ఉంచి వాటిపై కొత్తగా తయారు చేయించిన మూడు మట్టి కుండలను ఉంచుతారు. అప్పటికే ఆ కుండలకు పల్చగా సున్నం పూసి దారంతో పసుపుకొమ్ము కడతారు. అనంతరం పొయ్యిలో కర్పూరం వెలిగించి మామిడి, వేప కర్రలతో మంటపెడతారు. మూడు మట్టికుండల్లో మొదటగా పాలు పోస్తారు. అవి బాగా వేడెక్కి పొంగుతుండగా తూర్పువైపుగా కొబ్బరి మట్టతో తయారుచేసి ఉంచుకున్న గరిటతో ‘పచ్చా పొంగళ్లు... పాల పొంగళ్లు..’ అంటూ మూడు పర్యాయాలు పాల పొంగును కిందకు తోస్తారు. అనంతరం బియ్యం వేసి వంట సిద్దం చేస్తారు. ఒక కుండలో పెద్దలకు, మరో కుండలో సూర్య  భగవానునికి వంట చేస్తారు. ఇంకో కుండలో గుమ్మడికాయ కూర, ఆ తరువాత మిగిలిన వంటకాలు అదే పొయ్యిపై తయారు చేస్తారు. ఈ వంటకాలన్నిటినీ వరిగడ్డితో తయారుచేసిన కుదురుపై ఉంచుతారు.

దేవునికి మొక్కులు
పిండి వంటలన్నీ తయారు చేసిన అనంతరం మూడు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొదటగా ఇంటి ముఖద్వారం వద్ద ఐదు గుమ్మడి ఆకుల్లో పిండివంటలు, గుమ్మడికాయ కూర, బెల్లం కొద్దికొద్దిగా ఉంచి కొబ్బరికాయ కొట్టి పెద్దలకు మొక్కుతారు. ఆ తరువాత సూర్యుడు కనిపించే ప్రాంతానికి (ఇంటి బయట) నివాసంలో ఉన్న నెయ్యిదీపాన్ని, ఐదుగుమ్మడి ఆకుల్లో ఉంచిన పండివంటలను ఒక తట్టలో తీసుకెళ్తారు. అక్కడ సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజ పూర్తయ్యాక నేతి దీపం ఆరకుండా  ఇంటికి తీసుకొస్తారు. కనుమ పండగ నాడు పశువులు ఉన్న వారు వాటి కొమ్ములకు రంగులు వేసి గజ్జలు, గంటలు కట్టి ముస్తాబు చేస్తారు. సాయంత్రం పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. – తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement