Fashion Blogger Santoshi Shetty: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్‌ బ్లాగరా అన్నారు - Sakshi
Sakshi News home page

Santoshi Shetty: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్‌ బ్లాగరా అన్నారు

Published Wed, May 26 2021 1:20 PM | Last Updated on Wed, May 26 2021 5:22 PM

Santoshi Shetty Changing Face Of Fashion In India - Sakshi

పెద్దపెద్ద భవనాలు నిర్మించి మంచి ఆర్కిటెక్ట్‌ అవ్వాలనుకుంది! అనుకోకుండా ఫ్యాషన్‌పై దృష్టిమళ్లడంతో ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో ఫ్యాషన్‌ స్టార్‌గా ఎదిగి లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది సోషల్‌ స్టార్‌ సంతోషి శెట్టి. ‘ద స్టైల్‌ ఎడ్జ్‌’ పేరిట ఫ్యాషన్‌ బ్లాగ్‌ను నడుపుతూ.. ఇండియాలోనే మోస్ట్‌ పవర్‌పుల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎంతోమందికి  ఆదర్శంగా నిలుస్తోంది సంతోషి. 

ముంబైలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన  సంతోషి చిన్నప్పటి నుంచి చురుకైనది. స్కూలు, కాలేజీల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేది. ఒకపక్క ఫుట్‌బాల్‌ ఆడుతూనే మరోపక్క ఫ్యాషన్‌ షోలలో పాల్గొనేది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలనుకునేది. ట్రెండ్‌కు తగ్గట్టు ఉండేందుకు ప్రయత్నించేది. ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చదివేందుకు కాలేజీలో చేరినప్పటికి.. ఫ్యాషన్‌పై తనకున్న ఇష్టాన్ని వదులుకోలేదు. క్యాంపస్‌లో అందరికన్నా భిన్నమైన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో ప్రత్యేకంగా కనిపించేది.

నాన్న ఫోన్లో అకౌంట్‌ క్రియేట్‌ చేసి..
కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో సంతోషి తక్కువ ధరలో దొరికే వాటితోనే ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు ప్రయత్నించేది. డిగ్రీ చదివేటప్పుడు తన స్నేహితులంతా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ గురించి మాట్లాడుతుంటే సంతోషి దగ్గర బేసిక్‌ నోకియా ఫోన్‌ మాత్రమే ఉంది. దీంతో నాన్న ఫోనును తీసుకుని అకౌంట్‌ క్రియేట్‌ చేసి దానిలో తన డైలీ అప్‌డేట్స్‌ ను పోస్టు చేసేది. 

ఒకపక్క డిగ్రీ చదువుతూనే.. తన ఫ్యాషన్‌ కు సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్‌ చేస్తుండేది. ఫైనల్‌ ఇయర్‌ వచ్చేటప్పటికి చదువులో కాస్త వెనకపడ్డప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య బాగా పెరిగింది. దీంతో తనని నెటిజన్లు గుర్తిస్తున్నారని తెలిసి సొంత యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది సంతోషి. డిగ్రీ పూర్తిచేసేందుకు కష్టపడుతూనే.. తన సొంత వెబ్‌సైట్, ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో కొత్తకొత్త ఫ్యాషన్‌ కంటెంట్‌ను పోస్టు చేస్తుండేది. ఫాలోవర్స్‌ పెరగడంతో డిగ్రీ అవగానే ‘ద స్టైల్‌ఎడ్జ్‌’ ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ప్రారంభించి ఫ్యాషన్‌నే కెరీర్‌గా మలుచుకుంది.

తన ఫ్యాషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. 2016లో కాస్మోపాలిటన్‌ బ్లాగర్‌గానూ, ఎలే బ్లాగర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గాను నిలిచింది. 2017 లో పల్లాడియం స్పాట్‌లైట్‌ ఫ్యాషన్‌ బ్లాగర్‌గాను పేరుతెచ్చుకుంది. సోషల్‌ మీడియా స్టార్‌గా అనేక బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తూ ..ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్‌లలో దాదాపు పదిలక్షలమంది ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది 27 ఏళ్ల సంతోషి. 

నల్లగా ఉంది ఫ్యాషన్‌ బ్లాగరా..?
‘‘నేను ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియో లు పోస్టు చేసినప్పుడు ప్రశంసల పరిమళాలతోపాటూ విమర్శల ముళ్లూ నన్ను గుచ్చాయి. నా వీడియోలు చూసిన కొందరు ఇంత నల్లగా ఉన్న అమ్మాయి ఫ్యాషన్‌ బ్లాగర్‌ ఎలా అయ్యింది? అనే కామెంట్స్, మరికొందరు ఆమె ఫోటోలో ఉన్నదానికంటే నల్లగా ఉంది అని అంటుంటే మనస్సు చివుక్కుమనేది. అయినప్పటికీ నా మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా రోజూ కాలేజీకి వెళ్లి కష్టపడి చదవడం, అక్కడ ఇచ్చిన ఎసైన్‌మెంట్స్‌ శ్రద్దగా పూర్తిచేసేదాన్ని. కొత్తకొత్త కంటెంట్‌తో ఇన్‌స్టాలో వీడియోలు పోస్టు చేసేదాన్ని. ఆ ధైర్యమే ఈరోజు నన్ను మ్యాగజీన్ల కవర్‌పేజీపై నా ఫోటో వచ్చేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్‌షోలకు హాజరవుతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించవచ్చు’’ అని చెబుతున్న సంతోషి శెట్టి ఫ్యాషన్‌ స్టార్‌.
చదవండి: ఏదీ సులభంగా రాదు: జోయా అగర్వాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement