సీమా రాయల్, విధి నిర్వహణలో సీమా రాయల్
పెళ్లిచేసి అత్తారింటికి పంపించే ఆడపిల్లకు చదువెందుకు? చదివి ఊళ్లు ఏలాలా! దేశాన్ని ఉద్ధరించాలా? వంటి మాటలన్నెంటినో దాటుకుని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజినీర్‌గా రాణిస్తోంది సీమా రాయల్. మగవాళ్లు ఎక్కువగా ఉండే ఈ రంగంలో ఈజీగా ఆయిల్‌ను తోడేస్తోంది.
రాజస్థాన్‌కు చెందిన సీమా రాయల్‌కు ముగ్గురు తమ్ముళ్లు. ఒక్కతే అమ్మాయి కాబట్టి అల్లారుముద్దుగా పెరిగి ఉండొచ్చు అనుకోవడానికి లేదు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి అనేక అడ్డంకులను దాటాల్సి వచ్చింది. ఆడపిల్ల ఇంటి పనులు నేర్చుకుంటే చాలన్న భావన ఉన్న సమాజంలో పుట్టిన సీమకు చదువుకోవడమే పెద్ద సవాలు. చదువు ఎందుకు అనే మాటలను పోగొట్టడానికి ఆమె చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదువుకునేది. జూడో, కరాటే ప్రాక్టీస్ చేస్తూనే ఇంటి పనులన్నింటినీ నేర్చుకుంది. సీమ చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి మాటలను పట్టించుకోకుండా తనని చదువుకునేందుకు ప్రోత్సహించేవారు.
ఫైనలియర్‌లో ఉండగానే..
చిన్నప్పటి నుంచి క్రీడల్లో చురుకుగా ఉండే సీమ ..ఇంజినీరింగ్ కాలేజీలో తోటి విద్యార్థులు ఎవరూ క్రీడలపై ఆసక్తి కనబర్చక పోవడం కనిపించింది. దీంతో సీమానే అమ్మాయిలతో ఒక టీమ్‌ను ఏర్పరిచి రకరకాల ఆటలపోటీలలో పాల్గొనేది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటూనే ఇంజినీరింగ్ సబ్జెక్టులను ఏకాగ్రతతో చదివేది. ఫైనలియర్‌లో ఉండగా కాలేజీలో క్యాంపస్ ఇంటర్య్వూలు జరిగాయి. ఇంటర్య్వూలో పాసవ్వడంతో.. కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సీమకు ఉద్యోగం వచ్చింది. కానీ ఇంటికి దూరంగా బర్మర్ ప్రాంతంలో కంపెనీ ఉంది.
‘‘అంతదూరం వెళ్లి అమ్మాయి ఉద్యోగం చేయాలా? ఆయిల్ కంపెనీ అంటే అంతా మగవాళ్లే ఉంటారు! ఎందుకొచ్చిన గోల ’’ అంటూ ఇరుగుపొరుగు సీమ తల్లిదండ్రులకు పదేపదే చెప్పేవారు. ఈ మాటలేవీ పట్టించుకోని కుటుంబసభ్యులు సీమను ఉద్యోగం చేసేందుకు అనుమతించారు. దీంతో కెయిర్న్ కంపెనీలో ‘ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్’గా చేరింది. కంపెనీలో పనిని వేగంగా నేర్చుకుని పై అధికారుల మన్ననలను అందుకుంది. సీమ పనితీరు మెచ్చిన కంపెనీ యాజమాన్యం ఆమెను అనేక పదోన్నతులతో ప్రోత్సహించింది.
ప్రమాదకరమైనప్పటికీ..
‘‘ఇన్‌స్ట్రమెంట్ ఇంజినీర్ అంటే చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఆటోమాటిక్‌గా పనిచేసే అనేక పరికరాలను చూసుకోవాల్సి ఉంటుంది. బావి నుంచి ఆయిల్ తియ్యాలి. కొన్ని మెషిన్లతో, కొన్నింటిని మ్యానువల్‌గా తీయాలి. నీళ్లు, గ్యాస్, మట్టి నుంచి ఆయిల్‌ను వేరుచేసి పైప్‌లైన్లకు పంపించాలి. ఈ మొత్తం ప్రక్రియలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది.
ఇనుస్ట్రుమెంట్ ఇంజినీర్ నుంచి సీనియర్ ఇంజినీర్‌గా పదోన్నతి వచ్చినప్పుడు బాధ్యతలు పెరిగాయి. ప్రస్తుతం సూపరిండెంట్, ఇన్‌స్టాలేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. పద్నాలుగేళ్లలో నేను ఎదిగేందుకు కంపెనీ అనేక అవకాశాలు కల్పించింది. ఇప్పటికీ రాజస్థాన్‌లో ఉన్న అమ్మాయిలు అంత చురుగ్గా ముందుకు సాగడం లేదు. టీచర్ ఉద్యోగం చేస్తే చాల్లే అనుకునేవారే ఎక్కువ. ఇంతకు మించి ఆలోచించడం లేదు. ఆయిల్ గ్యాస్ కంపెనీలవైపు అసలే చూడడంలేదు.
నా పెళ్లి అయ్యాక భర్తతో పాటు కుటుంబం కూడా చాలా ప్రోత్సహించింది. వృత్తిపరంగా కొన్నిసార్లు ఇంటికి దగ్గరగా, మరికొన్ని సార్లు ఇంటికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా వాళ్లు నాకు అండగా నిలిచారు. అందువల్లే ఒకపక్క ఉద్యోగం, మరోపక్క పిల్లల్ని చూసుకోగలిగాను. ఎప్పుడూ మంచి జరుగుతుందనే ఆశావహ దృక్పథంలో ఉండేదాన్ని. ఎంతవరకు కష్టపడగలమో అంతవరకు శ్రమిస్తే విజయం దానంతట అదే వస్తుందని నేను నమ్ముతాను. కష్టాలనేవి సహజం. వాటిని దాటుకుని ముందుకెళ్తేనే జీవితంలో విజయం సాధించగలం. అందుకే ఎంతటి కఠిన రంగంలోనైనా రాణించగలరు’’ అని చెప్పే సీమ ఎంతో మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోంది.
చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!
Comments
Please login to add a commentAdd a comment