
ప్రతి వ్యక్తికి తనకిష్టమైన రంగు ఒకటుంటుంది. జీవితం ‘చీకటి–వెలుగుల రంగేళీ..’ అన్నారు. కానీ, ఎరుపు– తెలుపులతోనే సహజీవనం అంటోంది బెంగళూరులోని సేవన్రాజ్ కుటుంబం. వారు వేసుకునే దుస్తులు దగ్గర నుంచి ఇంట్లో ప్రతీది ఎరుపు–తెలుపు రంగులోనే దర్శనమిస్తుంది. ఈ ఎరుపు–తెలుపు కథ ఈ నాటిది కాదు. సేవన్రాజ్ వయసు 58 ఏళ్లు. పద్దెనిమిదేళ్ల వయసు నుంచి ఎరుపు–తెలుపు... ఈ రెండు రంగులతోనే దోస్తీ చేశాడు.
చిన్ననాటి నుంచి నలుగురిలో భిన్నంగా కనిపించాలని అనుకునేవాడు సేవన్రాజ్. తను జీవించినంతకాలం ఎరుపు–తెలుపు రంగులనే ఆస్వాదించాలని 18 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నట్టు చెబుతాడు సేవన్రాజ్. ప్రత్యేకమైన జీవనశైలితో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాలనే ఆలోచన కూడా సేవన్రాజ్‌లో ఉంది. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్లు, మొబైల్స్, గోడలు, కార్లు, కార్యాలయాలు, అద్దాలు, షూస్, సాక్స్, టాయ్‌లెట్స్, టూత్ బ్రష్‌లు ... ఇలా ప్రతీది ఎరుపు– తెలుపు రంగులలోనే ఉంటాయి.
సేవన్రాజ్ భార్య పుష్ప కూడా తన ఇంటికి ఈ రెండు రంగుల వస్తువులనే కొంటుంది. వీరి కొడుకు భరత్‌రాజ్, కూతురు మనీషా కూడా ఎరుపు–తెలుపు రంగులనే ధరిస్తారు. ఈ కుటుంబం లో అందరూ ఒకేసారి ఎక్కడైనా కనబడితే చాలు సెల్ఫీల కోసం పోటీపడతారు అభిమానులు. ‘చాలా మంది తెలుపు రంగును ఇష్టపడతారు. నేను దానికి ఎరుపును జోడించాను’ అంటాడు సేవన్రాజ్. ఈ రెండు రంగులతో దేశ విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందారు ఈ రంగు పిపాసి. ‘నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, నేను చనిపోయే వరకు ఈ రెండు రంగులతోనే జీవిస్తానని ప్రమాణం చేశాను. మొదట్లో నా చుట్టూ ఉన్నవారు నాకున్న ఈ అభిరుచికి నవ్వేవారు. కానీ, ఇప్పుడు వాళ్లూ ప్రత్యేకంగా చూస్తున్నారు’ అంటాడు సేవన్రాజ్.
7వ సంఖ్య
ఎరుపు–తెలుపులోనే కాదు ‘7’ అంకె తన లక్కీ నంబర్‌గా చెబుతాడు సేవన్రాజ్. తల్లిదండ్రులకు తను ఏడవ సంతానం. అతని కారు నంబర్ 7. ఏడు భాషలు మాట్లాడతాడు. ఇంట్లో అందరి దుస్తులకు 7 గుండీలు, 7 జేబులూ ఉంటాయి!
Comments
Please login to add a commentAdd a comment