lucky number
-
6వ అంతస్తులో.. 6 ఫైళ్లపై సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో ప్రారంభించారు. తర్వాత 6వ అంతస్తులోని తన చాంబర్‌కు వెళ్లి సీట్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా తన సెంటిమెంట్ లక్కీ నంబర్ 6కు తగ్గట్టుగా 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. ♦ 2023–24లో దళితబంధు పథకం అమలుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున లబ్దిదారులకు ఈ పథకాన్ని వర్తింపచేసే ప్రతిపాదనలను ఆమోదించారు. ♦ పోడుభూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తంగా లక్షా 35 వేల మందికి దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇవ్వనున్నారు. ♦ సీఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీకి సంబంధించిన ఫైలుపై సీఎం మూడో సంతకం చేశారు. ♦గర్భిణులకు పౌష్టికాహారం అందించే.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు సంబంధించిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ ఏడాది 6.84 లక్షల మంది గర్భిణులకు 13.08 లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.రెండు వేలు. ఈ పథకానికి ప్రభుత్వం మొత్తం రూ.277 కోట్లు ఖర్చు చేయనుంది. ♦ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై సీఎం ఐదో సంతకం సంతకం చేశారు. ♦ పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలుపై ఆరో సంతకం చేశారు. కరివెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్‌లకు తాగునీటిని సరఫరా చేసే కాల్వల పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. -
నందమూరి తారకరత్నకు కలిసిరాని 9వ సంఖ్య.. అదే శాపంగా మారిందా?
నందమూరి తారకరత్న మృతి ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తుంది. తీవ్ర గుండెపోటుతో గత 27న బెంగళూరులోని నారాయణ హృదయాలలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్నను బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తారకరత్నకు 9 సంఖ్య కలిసిరాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీలో చాలామంది న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు. ఇక ఎక్కువగా తొమ్మిది అంకెను లక్కీ నెంబర్ అని భావిస్తారు. కానీ తారకరత్నకు మాత్రం 9కలిసి రాలేదని చెప్పాలి.తారకరత్న ముందుగా ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002లో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అదే ఏడాది వరుసగా 9సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇందులో కేవలం మూడు సినిమాలు మాత్రమే సెట్స్ మీదకి వెళ్లాయి. ఇక గత నెల 27న ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ రెండు అంకెలను కలిపితే వచ్చేది 9 (2+7=9). ఇక ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 18,(1+8=9) ఈ రెండు అంకెలను కలిపినా తొమ్మిదే వస్తుంది. ఇలా జరిగిన పరిణామాలన్నీ చూస్తే తారకరత్నకు తొమ్మిదవ నెంబర్ కలిసి రాలేదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. -
ఇదేమి రిక్రూటింగ్ పాలసీ: ఫోన్ నంబర్ మార్చుకుంటేనే ఉద్యోగం!
ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలేముంటాయి? అతనికి సరైన క్వాలిఫికేషన్స్ లేకపోవడం, ఆ పొజిషన్‌కు సరిపోడను కోవడం.. వగైరా. కానీ కేవలం ఫోన్ నెంబర్ లో ఓ దురదృష్టకరమైనసంఖ్య ఉందని చెప్పి.. అభ్యర్థులను తిరస్కరించింది ఓ చైనీస్ ఎడ్యుకేషన్ కంపెనీ. ఫోన్‌నెంబర్‌లోని 5వ స్థానంలో నెంబర్ 5 ఉన్న అభ్యర్థులను వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగం తప్పనిసరిగా కావాలనుకుంటే... మొబైల్ నెంబర్ మార్చుకొని రావాలని సూచించింది. గాంగ్డాంగ్లోని షెంగెన్కు చెందిన ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టిన ఈ నిబంధన చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ అతీత శక్తులను, మూఢనమ్మకాలను అనుసరించే చైనా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఎడ్యుకేషన్ కంపెనీ ఇలాంటి పిచ్చి రిక్రూటింగ్ పాలసీలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. ఇది వివక్ష చూపడమే నంటున్నారు. ఉద్యోగులను కాకుండా జ్యోతిష్యం చెప్పే ‘ఫెంగ్ షూయ్ మాస్టర్’ను రిక్రూట్ చేస్తే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే... పురాతన చైనీస్ భవిష్యవాణి ‘బుక్ ఆఫ్ చేంజెస్’ ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యని, అందుకే కొందరు దాన్ని అనుసరిస్తారని చైనీస్ సంఖ్యాశాస్త్ర నిపుణుడు, బ్లాగర్ జిమెంజున్ చెబుతున్నాడు. -
వెరైటీ: అయితే ఎరుపు లేదంటే తెలుపు
ప్రతి వ్యక్తికి తనకిష్టమైన రంగు ఒకటుంటుంది. జీవితం ‘చీకటి–వెలుగుల రంగేళీ..’ అన్నారు. కానీ, ఎరుపు– తెలుపులతోనే సహజీవనం అంటోంది బెంగళూరులోని సేవన్రాజ్ కుటుంబం. వారు వేసుకునే దుస్తులు దగ్గర నుంచి ఇంట్లో ప్రతీది ఎరుపు–తెలుపు రంగులోనే దర్శనమిస్తుంది. ఈ ఎరుపు–తెలుపు కథ ఈ నాటిది కాదు. సేవన్రాజ్ వయసు 58 ఏళ్లు. పద్దెనిమిదేళ్ల వయసు నుంచి ఎరుపు–తెలుపు... ఈ రెండు రంగులతోనే దోస్తీ చేశాడు. చిన్ననాటి నుంచి నలుగురిలో భిన్నంగా కనిపించాలని అనుకునేవాడు సేవన్రాజ్. తను జీవించినంతకాలం ఎరుపు–తెలుపు రంగులనే ఆస్వాదించాలని 18 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నట్టు చెబుతాడు సేవన్రాజ్. ప్రత్యేకమైన జీవనశైలితో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాలనే ఆలోచన కూడా సేవన్రాజ్లో ఉంది. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్లు, మొబైల్స్, గోడలు, కార్లు, కార్యాలయాలు, అద్దాలు, షూస్, సాక్స్, టాయ్‌లెట్స్, టూత్ బ్రష్‌లు ... ఇలా ప్రతీది ఎరుపు– తెలుపు రంగులలోనే ఉంటాయి. సేవన్రాజ్ భార్య పుష్ప కూడా తన ఇంటికి ఈ రెండు రంగుల వస్తువులనే కొంటుంది. వీరి కొడుకు భరత్‌రాజ్, కూతురు మనీషా కూడా ఎరుపు–తెలుపు రంగులనే ధరిస్తారు. ఈ కుటుంబం లో అందరూ ఒకేసారి ఎక్కడైనా కనబడితే చాలు సెల్ఫీల కోసం పోటీపడతారు అభిమానులు. ‘చాలా మంది తెలుపు రంగును ఇష్టపడతారు. నేను దానికి ఎరుపును జోడించాను’ అంటాడు సేవన్రాజ్. ఈ రెండు రంగులతో దేశ విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందారు ఈ రంగు పిపాసి. ‘నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, నేను చనిపోయే వరకు ఈ రెండు రంగులతోనే జీవిస్తానని ప్రమాణం చేశాను. మొదట్లో నా చుట్టూ ఉన్నవారు నాకున్న ఈ అభిరుచికి నవ్వేవారు. కానీ, ఇప్పుడు వాళ్లూ ప్రత్యేకంగా చూస్తున్నారు’ అంటాడు సేవన్రాజ్. 7వ సంఖ్య ఎరుపు–తెలుపులోనే కాదు ‘7’ అంకె తన లక్కీ నంబర్‌గా చెబుతాడు సేవన్రాజ్. తల్లిదండ్రులకు తను ఏడవ సంతానం. అతని కారు నంబర్ 7. ఏడు భాషలు మాట్లాడతాడు. ఇంట్లో అందరి దుస్తులకు 7 గుండీలు, 7 జేబులూ ఉంటాయి! -
కారు నెంబర్ కోసం రూ. 60 కోట్లు వెచ్చించాడు!
లక్కీ నెంబర్లు, ఫ్యాన్సీ నెంబర్లంటే మనవాళ్లకు మహా మోజు. ఇక్కడే కాదు.. ఏ దేశంలో ఉన్నా కూడా అలాంటి నెంబర్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరన్న విషయం మరోసారి రుజువైపోయింది. దుబాయ్‌లో ఒక కారు నెంబర్ కోసం భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త ఏకంగా రూ. 60 కోట్లు వెచ్చించాడు. బల్వీందర్ సహానీ అనే ఆయన ఆర్‌ఎస్‌జీ ఇంటర్నేషనల్ అనే వ్యాపార సంస్థకు యజమాని. భారతదేశంతో పాటు అమెరికా, యూఏఈ, కువైట్ లాంటి దేశాల్లో ఈ కంపెనీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ పనులు చేస్తుంటుంది. ఈ సహానీకి అబు సబా అనే మారుపేరు కూడా ఉంది. ఈయన 'డి5' అనే నెంబరు కోసం దుబాయ్ రోడ్డు రవాణా వ్యవస్థకు రూ. 60 కోట్లు చెల్లించాడు. అరుదైన నెంబరు ప్లేట్లు సేకరించడం తనకు ఇష్టమని.. ఈ నెంబరు రావడం చాలా గర్వంగా ఉందని సహానీ తెలిపారు. తనకు 9 అంకె అంటే ఇష్టమని, డి 5 కలిపితే మొత్తం 9 అవుతుందని.. అందుకే తాను ఈ నెంబరును కొన్నానని చెప్పారు. గత సంవత్సరం తాను 09 అనే నెంబరు ఉన్న ప్లేటును 45 కోట్లు పెట్టి కొన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తాను 10 నెంబరు ప్లేట్లు కొన్నానని, త్వరలోనే మరిన్ని కూడా కొంటానని, అది తనకు సరదా అని అన్నారు. తాజాగా కొన్న ప్లేటును తనకున్న రోల్స్ రాయిస్ కార్లలో ఒకదానికి అమరుస్తానన్నారు. డి5 నెంబరు కోసం దాదాపు 300 మంది పోటీపడ్డారు. ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ల కోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి లైవ్ వేలం జరుగుతుంది. మొత్తం 80 రకాల నెంబరు ప్లేట్లను ఈసారి వేలానికి పెట్టారు. 'క్యు77' అనే నెంబరు 8.20 కోట్ల రూపాయలు పలికింది. -
రూ.50 వేలకే 9999
భలే మంచి చౌక బేరం సిఫారసులకే అధికారుల వత్తాసు! విశాఖపట్నం: ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ మామూళ్లగా ఉండదు. వాహనం ధర కంటే నంబర్‌కు ఎక్కువ ధర చెల్లించి కొనుగోళ్లు చేసే వారుంటారు. ఫ్యాన్సీ నంబర్లకు ఉంటోన్న డిమాండ్‌తో రవాణా శాఖకు కూడా ఆదాయం కలసి వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. రవాణా శాఖలో రాజకీయ జోక్యంతో ఫ్యాన్సీ నంబర్లు సిఫారసులకు తలొగ్గాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం భారీగా గండి పడింది. లక్షలాది రూపాయల ధరలు పలికే నంబర్లు కూడా వేల రూపాయలకు అప్పగించడంతో దుమారం రేగుతోంది. సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఫ్యాన్సీ నంబర్లకు సిఫారసులు చేయడంతో అధికారులు నంబర్లు అప్పగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం కొత్త ఫ్యాన్సీ నంబర్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. పాత సీరీస్‌లో టాప్ క్రేజీ నంబర్ ఏపీ 31 డీసీ 9999 కనీస ధర రూ.50 వేలు పలికింది. ఓ మంత్రి సిఫారసుతో నంబర్ అప్పగించినట్టు తెలుస్తోంది. మూడు నెలల కిందట అదే నంబర్(ఏపీ 31డీబీ) రూ.3.85 లక్షలుగా పలికి రికార్డు సృష్టించింది. అంతే క్రేజ్ ఉన్న ఏపీ 31 డీసీ 9999 నంబర్ మాత్రం కేవలం రూ.50 వేలకే కేటాయించడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఒక్క రూపాయి కూడా అదనంగా రాని పరిస్థితి నెలకొంది. ఒక వైపు రాజకీయ నాయకులు ఒత్తిడి లేదంటూనే అధికారులు మరో వైపు ఫ్యాన్సీ నంబర్లను తక్కువ ధరకే కేటాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముకే కేటాయించడం చూస్తుంటే ఒత్తిడి ఎంత మేర ఉందో అర్థమవుతోంది. అలాగే కొత్త సిరీస్ ఏపీ 31 డీడీ 0001 ధర పోటీ లేకుండా సింగిల్ బిడ్‌గా రూ.50 వేలకు వెళ్లింది. ఇదే నంబర్( ఏపీ 31 డీసీ) గతంలో రూ.1.82 లక్షలకు వేలం పలికింది. ఇంకా 5, 9 నంబర్లు రూ.1.30 లక్షలు, 18 నంబర్ రూ.20,250, 27 నంబర్ రూ.15,500, 36 నంబర్ రూ.26,210, 44 నంబర్ రూ.31,810, 45 నంబర్ రూ.25,800, 77 నంబర్ రూ.32,500, 99 నంబర్ రూ.30 వేలకు పలికింది. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా శుక్రవారం రవాణాశాఖకు ఆదాయం రూ.8.23 లక్షలుగా తెలిసింది. ఫ్యాన్సీ నంబర్ కేటాయింపులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో ధరలు పడిపోయాయని రవాణా వర్గాలు తెలిపాయి. దీంతో లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. -
లక్కీ నంబర్
-
లక్కీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు పెట్టొచ్చా?
-
లక్కీ....లక్కీ....లక్కీ నెంబర్స్
-
అంకెల పొంకం
వివరం: మన దగ్గర ముగ్గురు కలిసి వెళ్లకూడదంటారు. అదే స్వీడన్లో మూడు శుభానికి సంకేతం. ‘మంచివన్నీ మూడింటి బృందంగా వస్తాయి’ అని అక్కడి సామెత. ఇంగ్లీషు భాష ఇంతగా ఆదరణ పొందడానికి కారణం, అందులోని 26 అక్షరాలట! 2+6=8. ఎనిమిది పాశ్చాత్యులకు అదృష్టసంఖ్య. ఇంతకీ ఈ ‘ఎనిమిది’ అంటే ఏమిటి? కుక్కల్లాగా, పిల్లుల్లాగా అవి కనబడతాయా? నిజానికి, ఎనిమిదిగా దానికి ఏ విలువా లేదు. కానీ ‘ఎనిమిదింటిని’ చూపడానికి ఒక సంకేతంగా నిలబడుతోంది కాబట్టి, ఒక విలువను సంతరించుకుంది. మనుషులు అంకెలను ఎప్పుడు తమ జీవితంలో భాగంగా చేసుకున్నారో అప్పుడే కొన్నింటి మీద ఇష్టమూ, కొన్నింటి మీద అయిష్టమూ పెంచుకున్నారు. వాటిల్లోని అర్థం, పరమార్థం ‘దేవుడికే’ తెలియాలి. ఎందుకు దేవుడికే తెలియాలి అంటే అంకెల్ని కూడా దేవుడే సృష్టించాడని కూడా ఒక నమ్మకం ఉండటం వల్ల! మనిషిది మొదటినుంచీ, అంకెలతో ప్రేమ-ద్వేష సంబంధమే. అంకెలకు ఉనికిని ఇచ్చినప్పటినుంచీ ఇది కొనసాగుతూనే ఉంది. కొన్నింటిని నమ్ముతాడు. కొన్నింటిని భయంగా చూస్తాడు. ఆ చొక్కా వేసుకుంటే మంచి జరగదని విశ్వసించడానికి, ‘మరింత కాకతాళీయత’ లాంటిదేదో కారణం అయ్యుండాలి. అయినా ‘రిస్కు’ తీసుకోవడం ఎందుకు? అన్న ధోరణిలో వీటిల్లో విశ్వాసాన్ని పెంచుకున్నాడు. అంకెల్లో జీవితం మానవ జీవితం అంకెలతో ముడిపడి ఉంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇంటి చిరునామా, వాహనం నెంబరు, ఫోన్ నెంబరు... అన్నింటా మనకి సంఖ్యలతో సంబంధం ఉంది. ఈ అంకెలు మనిషి మీద చూపగల ప్రభావాన్ని తెలియపరిచేదే న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం). ఇందులో కబాలా, పైథాగరస్, చాల్దియన్ అనే మూడు రకాలున్నాయి. అన్నింట్లోకీ చాల్దియన్ పద్ధతి పురాతనమైంది. అయితే, గ్రీకు శాస్త్రజ్ఞుడు పైథాగరస్ న్యూమరాలజీని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన పేరుమీదున్నదే ఎక్కువగా వాడుతున్నాం. న్యూమరాలజీ భారతదేశంలో కంటే, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి పాశ్చాత్య దేశాలు, ఆసియా దేశాలైన చైనా, మలేషియాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. దైనందిన జీవితంలో వారు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బైబిల్లోనూ పేర్ల మార్పు వర్ణమాలలో (ముఖ్యంగా ఆంగ్ల వర్ణమాల) ఉన్న అక్షరాలకు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య ఇవ్వటం జరిగింది. ఎ=1, బి=2, సి=3, వై=25, జడ్=26. అక్షరాలకు ఉన్న అంకెల వల్ల పేర్లకు కూడా సంఖ్య వస్తుంది. దానినే నామ సంఖ్య అంటారు. మానవ జీవితంపై ప్రధానంగా నామ సంఖ్య, జన దిన సంఖ్యల ప్రభావం ఎక్కువ. జన్మ తేదీకి, నామ సంఖ్యకు సఖ్యత ఉన్నట్లయితే, ఆ వ్యక్తి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. జన్మ తేదీని మార్పు చేసుకోలేం కాబట్టి, దానికి అనుకూలంగా నామ సంఖ్యను మార్పుచేసినట్లయితే, మంచి ఫలితాలు వస్తాయని ఈ శాస్త్రం చెబుతుంది. ఇది పురాతనమైన శాస్త్రం. పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా పేరు మార్పు వలన కలిగే ప్రయోజనం గురించి తెలియజేయటం జరిగింది. దైవ సందేశానుసారంగా అబ్బరం తన పేరును అబ్రహాంగా, సారా (Sara) తన పేరును సారాః (Sarah)గా, జాకబ్ తన పేరును ఇజ్రాయెల్గా మార్పు చేసుకోవటం లాంటి ఉదంతాలు వివరింపబడ్డాయి. అంకెలు- దేశాలు ప్రాచీన కాలం నుంచీ వివిధ దేశాల్లో అంకెల గురించిన బలమైన విశ్వాసాలున్నాయి. ఒకటి నుంచే ప్రతీ అంకె పుడుతుంది కాబట్టి, ఇది అన్ని అంకెలకీ మూలంగా భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పదిగా పరిగణిస్తారు. 1+1=2, 1+2=3. అందుకే, ఒకటిని దేవుడిగానూ, సృష్టిగానూ చూస్తారు. అదే చైనాలో సున్న పూర్ణ సంఖ్య కాబట్టి, దాన్ని గొప్పదిగా చూస్తారు. డబ్బును సంఖ్యాపరంగా తెలియజేసినప్పుడు అది ప్రధానంగా సున్నాతోనే ముగుస్తుంది. రూ. 10, 20, 50, 100, 500, 1000. చైనీయులు 2ను మంచి సంఖ్యగా భావిస్తారు. ‘మంచి విషయాలు జంటగా వస్తాయి’ అనేది చైనావాళ్ల సామెత. అదే స్వీడన్ వాళ్లకు మంచి విషయాలు మూడింటిగా వస్తాయి. ఇటలీ వాళ్లకు కూడా 3 అదృష్ట సంఖ్య. తక్కువ భుజాలతో త్రిభుజాన్ని, అంటే ఒక పర్ఫెక్ట్ షేప్‌ని ఏర్పరుస్తుంది కాబట్టి మూడు వాళ్లకు ప్రత్యేకమైన అంకె. చైనా భాషలో 3 ఉచ్ఛారణ ‘పుట్టుక’ అనే శబ్దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్లకూ ఇది మంచి అంకెనే! 4ను చైనీయులు, జపనీయులు, కొరియన్లు చాలా చెడు సంఖ్యగా భావిస్తారు. దీని ఉచ్ఛారణ వారి భాషలో ‘మరణం’ అనే శబ్దానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ సంఖ్యను వారు వాడరు. నోకియా సెల్ఫోన్లు 4 సంఖ్యతో ప్రారంభం కావు. కొన్ని తూర్పు ఆసియా దేశాల్లోని భవనాలలో 4వ అంతస్తు ఉండదు. 14, 24, 34 కూడా ఉండవు. 50 అంతస్తుల భవనం అంటే అందులో నిజంగా 35 అంతస్తులు మాత్రమే ఉంటాయి. విచిత్రంగా, జర్మనీలో 4 లక్కీ నంబర్. దీనికి వాళ్లు చెప్పే ప్రధాన కారణం క్లోవర్కు నాలుగు ఆకులుంటాయి! స్వర్గంలోంచి ఈవ్ వెంట తెచ్చుకున్నది క్లోవర్నే! అయితే, మూడు ఆకుల క్లోవర్లు కూడా ఉంటాయిగానీ వాటిని లెక్కలోకి తీసుకోరు. చాలా దేశాల్లో 2ని స్త్రీగానూ, 3ను పురుషుడిగానూ రెండూ కలిపితే వచ్చే 5ని వివాహానికి ప్రతీకగానూ భావించడం ఉంది. ఇంకో నమ్మకం ప్రకారం 3ని పురుషుడికీ, 4ను స్త్రీకీ ప్రతీకగా చూస్తారు. అన్ని సరిసంఖ్యల్నీ స్త్రీగానూ, అన్ని బేసి సంఖ్యల్నీ పురుషుడిగానూ చూడటమూ ఉంది. ఇందులో మంచిదేది? చెడ్డదేది? రష్యావాళ్లు బేసివన్నీ అదృష్టాన్నీ, సరివన్నీ దురదృష్టాన్నీ తెస్తాయని నమ్ముతారు. చైనీయుల నమ్మకం ప్రకారం, ఐదు పంచభూతాలకు ప్రతీక (భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి). దాన్ని సర్వ నామమైన ‘ఐ (ఐ)’లా ఉచ్ఛరిస్తారు. కాబట్టి మంచి సంఖ్యగా భావిస్తారు. అలాగే, 6 వాళ్లకు సంపదను సూచిస్తుంది. దాని ఉచ్ఛారణ ‘ప్రవాహం’ శబ్దానికి దగ్గరగా ఉంటుంది. అందువలన ఇది వ్యాపారానికి మంచిదిగా భావిస్తారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో 7 అదృష్ట సంఖ్య. దేవుడు ఏడు రోజుల్లో ఈ సృష్టిని చేశాడని దాన్ని శుభసంకేతంగా భావిస్తారు. చైనీయులు కూడా ఈ సంఖ్యను బంధానికి చిహ్నంగా భావిస్తారు. చైనాభాషలో దీని ఉచ్ఛారణ ‘లేచుట’, ‘జీవితం’ అనే శబ్దాలకు దగ్గరగా ఉంటుంది. చైనాలోనూ పాశ్చాత్య దేశాలలోనూ అదృష్ట సంఖ్యగా భావింపబడే ఏకైక సంఖ్య 7. కొరియా, జపాన్, చైనాలో 8 చాలా శుభప్రదమైనది! తిరగేసినా ఈ అంకె రూపు మారదు, అన్ని అంకెలూ కిందికి అంతమవుతే, ఎనిమిది మాత్రం ఊర్ధ్వముఖంగా ముగుస్తుంది. అందుకే, వారికి దీని మీద వారికి ఎక్కువ గురి. అయితే, హిందువులు జ్యోతిష పరంగా 8, 9 (1+8 = 9) సంఖ్యలను శుభ సంఖ్యలుగా పరిగణించరు (మినహాయింపుల్తో). అష్టమి, నవమి దినాలలో ప్రయాణం చేయరు. ఇక్కడ 8 శనికి చిహ్నం. 9 నార్వే వాళ్లకు మంచిది. జపాన్ వాళ్లకు మంచిది కాదు. ఒక మనిషిని తొమ్మిది మంది నిందిస్తున్నారంటే అది సరైన నిందే అయ్యుంటుందట! 12ను దైవ సంబంధమైనదిగా అన్ని మతాలవారు భావిస్తారు. 12 నెలలు, 12 గంటలు (పగలు, రాత్రి వేరుగా), ఒలంపస్లో 12 మంది దేవతలు, ఇజ్రాయెల్‌లో 12 తెగలు, క్రీస్తు 12 మంది శిష్యులు, మహమ్మద్ ప్రవక్త 12 మంది వారసులు, 12 రాశులు, పుష్కరం (12 సంవత్సరాలు) మొదలైనవి దీనికి కారణం. 13, శుక్రవారం పాశ్చాత్యుల సెంటిమెంటు ప్రకారం, 13 అతి ప్రమాదకరమైనది. గ్రెగెరియన్ క్యాలెండర్లో 13వ రోజు మంచిది కాదు. ఈ నమ్మకం ఏసుక్రీస్తు కాలంలో ప్రారంభం అయ్యిందంటారు. ద లాస్ట్ సప్పర్ జరిగినప్పుడు మొత్తం 13 మంది ఆ విందులో పాల్గొన్నారు. ఇది గుడ్ ఫ్రైడే ముందురోజు రాత్రి జరిగింది. మరుసటిరోజు ఏసుక్రీస్తుని శిలువ వేయటం జరిగింది. అయితే, 19వ శతాబ్దానికి ముందు ఈ నమ్మకం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారం లేదని కొందరి వాదన. ఇటాలియన్ సంగీత విద్వాంసుడు గియాచినో రోసినీ, 1868 నవంబర్ 13, శుక్రవారం నాడు చనిపోయిన తరువాత ఈ నమ్మకం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నమ్మకం ప్రబలడానికి కారణం, 13 మంచి సంఖ్య కాదు. శుక్రవారం చెడు దినం (క్రీస్తు చనిపోయిన దినం). అందుకే పాశ్చాత్య దేశాల్లోని కొన్ని భవనాలలో 13వ అంతస్తు ఉండదు. ఫార్ములా వన్ కార్ల రేసుల్లో కూడా కార్లకు 13 లేకుండా జాగ్రత్తపడతారు. అయితే, మన దేశంలో 13 (త్రయోదశి) ను మంచి తిథిగా భావిస్తారు. వైద్య పరిభాషలో 13వ తేదీ శుక్రవారం పట్ల భయాన్ని PARASKAVEDEKATRIAPHOBIA అంటారు. గ్రీకు భాషలో ‘PARASKEVI’ అంటే శుక్రవారం, ‘ఈఉఓఅఖీఖఐఅ’ అంటే 13. స్పానిష్ భాష మాట్లాడే దేశాల్లో 13వ తేదీ మంగళవారం చెడు దినంగా భావిస్తారు. గ్రీకులు కూడా దీన్ని చెడు దినంగా పరిగణిస్తారు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మంచిరోజు కాదంటారు. ఇటలీ వాళ్లకు 17వ తేదీ శుక్రవారం చెడు దినం. 1993లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన పరిశోధనా పత్రం ప్రకారం, శుక్రవారం 13వ తేదీ నాడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. పాశ్చాత్య దేశాల్లోని కొన్ని భవనాలలో 13వ అంతస్తు ఉండదు. ఫార్ములా వన్ రేసుల్లో కూడా కార్లకు 13 సంఖ్య లేకుండా జాగ్రత్తపడతారు. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది 35వ ఏట. 3+5=8. శ్రీకృష్ణుడు జన్మించింది అష్టమి నాడు. అందువల్ల 8ని అదృష్టసంఖ్యగా భావించేవాళ్లు కొందరుంటే, మరోవైపు 8ని శనికి చిహ్నంగా చూసేవాళ్లూ ఉన్నారు.చైనాలో 2003 లో అన్నీ ‘8’లు ఉన్న ఫోన్ నంబర్ 2,80,000 డాలర్లకు అమ్ముడుపోయింది. 2008లో బీజింగ్‌లో ఒలింపిక్స్ 8/8/8 తేదీన ఉదయం 8 గంటల, 8 నిమిషాల, 8 సెకెన్లకి ప్రారంభం అయ్యాయి. అక్కడ హోటళ్లు, షాపుల్లోని ధరల పట్టికలో 8 ఎక్కువగా కనిపిస్తుంది (38, 58, 88). మలేషియాలో ఉన్న పెట్రినాస్ ట్విన్ టవర్స్ 88 అంతస్తులు కలిగి ఉంది.కొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భవనాలలో 4వ అంతస్తు ఉండదు. 14, 24, 34 కూడా ఉండవు. విచిత్రంగా, జర్మనీలో 4 లక్కీ నంబర్. రష్యావాళ్లు అన్ని సరిసంఖ్యల్నీ స్త్రీగానూ, అన్ని బేసి సంఖ్యల్నీ పురుషుడిగానూ విశ్వసిస్తారు. బేసివన్నీ అదృష్టాన్నీ, సరివన్నీ దురదృష్టాన్నీ తెస్తాయంటారు. 7 వర్గం 49 (7ఁ7). ఈ సంఖ్యను చైనా జానపదాల్లోనూ, బౌద్ధుల కర్మకాండలోనూ ఎక్కువగా నమ్ముతారు. వ్యక్తి మరణించినా అతని ఆత్మ 49 రోజులు ఆ పరిసరాల్లోనే ఉంటుందని వీరి విశ్వాసం. అందుకే చైనీయులు వ్యక్తి మరణించిన 49 రోజులకి మరలా కర్మకాండ నిర్వహిస్తారు. ఈజిప్టువాళ్లకు 2, 3, 4, 7 అదృష్టసంఖ్యలు. ఆఖరికి వీటిని కలుపగా, గుణించగా వచ్చినవి కూడా శుభాన్నిచ్చేవే. 19కీ ఖురాన్కీ సంబంధం పవిత్ర ఖురాన్‌కు, న్యూమరాలజీకి అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకు పవిత్ర ఖురాన్లో 114 అధ్యాయాలు (19ఁ6) ఉన్నాయి. అందులోని మొదటి పవిత్ర వాక్యం ‘బిస్మిల్లా’లో 19 అక్షరాలు ఉంటాయి (అరబిక్). గ్రంథంలోని మొత్తం పంక్తుల సంఖ్య 6346 (19ఁ334). బిస్మిల్లా అనే పదం 114 సార్లు (19ఁ6) వస్తుంది. మొదటి ప్రకటనలో 19 పదాలు ఉంటాయి. దానిలో 76 అక్షరాలు ఉంటాయి (19ఁ4). అల్లా నామం 2,698 సార్లు వినిపిస్తుంది (19ఁ142). అలాగే, ‘అల్లా హో అక్బర్’ నామ సంఖ్య 289 (2+8+9 = 19). ఈ విధంగా పవిత్ర ఖురాన్‌కు 19 సంఖ్యకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, ఇస్లాం మతస్థులు 19ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. విశ్వాసమే బలం గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సెంటిమెంటు ఏర్పడుతుంది. భారతదేశంలో కూడా సెంటిమెంట్లు ఉన్నాయి. కానీ అవి న్యూమరాలజీ కన్నా శకున శాస్త్ర పరంగా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కడికైనా బయల్దేరేముందు, ఎవరైనా తుమ్మితే ఆగిపోతాం. నిండు కుండ ఎదురుగా వస్తే శుభ పరిణామమని భావిస్తాం. సంఖ్యల యొక్క ప్రభావం, కేవలం మనుషులపై మాత్రమే కాదు. అన్ని జీవుల మీద, సంస్థల మీద, స్థలాల మీద, రాష్ట్రాల మీద, దేశాల మీద కూడా ఉంటుంది. ఆ దేశం ఆవిష్కరణ దినం, ఆ దేశం పేరు, దాని నామ సంఖ్య ప్రకారం, ప్రభావం మారుతూ ఉంటుంది. 13 సంఖ్య పాశ్చాత్య దేశాల్లో చెడు ప్రభావం చూపినా మనదేశంలో మంచి ప్రభావం చూపుతుంది. ఇలాంటి విశ్వాసాల గురించిన హేతుబద్ధత గురించి చర్చించటంలో ప్రయోజనం లేదు. ఎందుకంటే సెంటిమెంటు అనేది మనసుకీ, వ్యక్తిగత అనుభవాలకీ సంబంధించినది. కంటికి కనపడనిది, భావోద్వేగానికి సంబంధించినది! - మొహమ్మద్ దావూద్ -
మరుపురాని రోజు 11.12.13
-
మరుపురాని రోజు 11.12.13
హైదరాబాద్: మరుపురాని జ్ఞాపకాలను ‘ముడి’ వేయించే రోజు వచ్చేసింది.పవిత్ర ఘడియలను (11-12-13) చిరస్థాయిగా మిగుల్చుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు సిద్ధమవుతున్నారు. ‘నవ’ జీవితానికి నాంది పలికించే శుభ దినంగా ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. ఈ రోజుకు అత్యంత శక్తి ఉందంటున్నారు వాస్తు, సంఖ్యా నిపుణులు దైవజ్ఞశర్మ. సీక్వెన్స్‌తో కూడిన నెంబర్ కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోవడంతో పాటు.. ఈ రోజు ఆరంభించే పనుల్లో విజయం సాధిస్తారని చెబుతున్నారు. అందరికీ శుభం కలుగుతుంది.. 11-12-13 సంక్షేమ సంఖ్య. 11 అనేది కవలలకు చిహ్నం. ఈ నేపథ్యంలో ట్విన్స్‌కు ఎంతో మంచి రోజు. మహిళలకు ఇది ప్రత్యేకమైన తేదీ. ఈ రోజున వారు ప్రారంభించే పనుల్లో విజయం వైపు పయనిస్తారు. అందుకే అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల ప్రచారానికి హిల్లరీ క్లింటన్ ఈ అరుదైన తేదీ నుంచే శ్రీకారం చుట్టనున్నారు. కొత్త శాస్త్రీయ పద్ధతులకు, అంతరిక్షంలో కొత్త గ్రహాల అన్వేషణకు అనుకూలమైన రోజు. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి శుభదినం. మధ్యలో నిలిపేసిన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఈ రోజు శ్రేయస్కరంగా ఉందని ఆస్ట్రాలజీ సూచిస్తోంది. ఇక చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు ఇదో మంచి తరుణం. కొత్త పనులకు శ్రీకారం.. 11-12-13ను కూడితే చైనీయులు బలంగా విశ్వసించే లక్కీనెంబర్ 9 రావడం మరో విశేషం. చైనీయుల సెంటిమెంట్‌ను అనుసరించే భారతీయులు సైతం ఈ నెంబర్‌నే అదృష్ట సంఖ్యగా భావిస్తారు. స్వీక్వెన్స్ డేట్‌తో ప్రత్యేకమైన రోజుకు తోడు లక్కీనెంబర్ కలిసి వస్తోంది. ఇంకో విశేషమేమంటే లక్కీనెంబర్ తొమ్మిదో తిథి నవమి రావడం. స్పెషల్ డేట్‌తో పాటు సంఖ్యాపరంగా లక్కీనెంబర్ కలిసి రావడంతో కొత్త పనులను శ్రీకారం చుట్టేందుకు అనువైన రోజుగా భావిస్తున్నారు. కలసివచ్చిన ముహుర్తం ప్రత్యేకమైన తేదీతో పాటు 11వ తేదీన బలమైన ముహుర్తం వచ్చిందని న్యూమరాలజిస్ట్ గుళ్లపల్లి వెంకట లక్ష్మిపతి దీక్షితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11-12-13 సంక్షేమ సంఖ్యకు తోడు లక్కీనెంబర్, బలమైన ముహుర్తం కలిసిరావడంతో పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉందంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఘనమైన తేదీన జన్మనిచ్చేందుకు ఈ ప్రత్యేకమైన రోజున కొందరు బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు ఖరారు చేసుకున్నారు. ఇందుకోసం పలువురు సిజేరియన్ ఆపరేషన్ చేయించుకునేందుకు సైతం సిద్ధమయినట్లు వైద్యులు వెల్లడించారు.