రూ.50 వేలకే 9999 | 9999 number plate just Rs.50 only | Sakshi
Sakshi News home page

రూ.50 వేలకే 9999

Published Sat, Jan 9 2016 11:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

రూ.50 వేలకే 9999

రూ.50 వేలకే 9999

భలే మంచి చౌక బేరం
సిఫారసులకే అధికారుల వత్తాసు!
 
విశాఖపట్నం: ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ మామూళ్లగా ఉండదు. వాహనం ధర కంటే నంబర్‌కు ఎక్కువ ధర చెల్లించి కొనుగోళ్లు చేసే వారుంటారు. ఫ్యాన్సీ నంబర్లకు ఉంటోన్న డిమాండ్‌తో రవాణా శాఖకు కూడా ఆదాయం కలసి వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. రవాణా శాఖలో రాజకీయ జోక్యంతో ఫ్యాన్సీ నంబర్లు సిఫారసులకు తలొగ్గాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం భారీగా గండి పడింది. లక్షలాది రూపాయల ధరలు పలికే నంబర్లు కూడా వేల రూపాయలకు అప్పగించడంతో దుమారం రేగుతోంది.
 
 సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఫ్యాన్సీ నంబర్లకు సిఫారసులు చేయడంతో అధికారులు నంబర్లు అప్పగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం కొత్త ఫ్యాన్సీ నంబర్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. పాత సీరీస్‌లో టాప్ క్రేజీ నంబర్ ఏపీ 31 డీసీ 9999 కనీస ధర రూ.50 వేలు పలికింది. ఓ మంత్రి సిఫారసుతో నంబర్ అప్పగించినట్టు తెలుస్తోంది. మూడు నెలల కిందట అదే నంబర్(ఏపీ 31డీబీ) రూ.3.85 లక్షలుగా పలికి రికార్డు సృష్టించింది.
 అంతే క్రేజ్ ఉన్న ఏపీ 31 డీసీ 9999 నంబర్ మాత్రం కేవలం రూ.50 వేలకే కేటాయించడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఒక్క రూపాయి కూడా అదనంగా రాని పరిస్థితి నెలకొంది. ఒక వైపు రాజకీయ నాయకులు ఒత్తిడి లేదంటూనే అధికారులు మరో వైపు ఫ్యాన్సీ నంబర్లను తక్కువ ధరకే కేటాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముకే కేటాయించడం చూస్తుంటే ఒత్తిడి ఎంత మేర ఉందో అర్థమవుతోంది.
 
 అలాగే కొత్త సిరీస్ ఏపీ 31 డీడీ 0001 ధర పోటీ లేకుండా సింగిల్ బిడ్‌గా రూ.50 వేలకు వెళ్లింది. ఇదే నంబర్( ఏపీ 31 డీసీ) గతంలో రూ.1.82 లక్షలకు వేలం పలికింది. ఇంకా 5, 9 నంబర్‌లు రూ.1.30 లక్షలు, 18 నంబర్ రూ.20,250, 27 నంబర్ రూ.15,500, 36 నంబర్ రూ.26,210, 44 నంబర్ రూ.31,810, 45 నంబర్ రూ.25,800, 77 నంబర్ రూ.32,500, 99 నంబర్ రూ.30 వేలకు పలికింది. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా శుక్రవారం రవాణాశాఖకు ఆదాయం రూ.8.23 లక్షలుగా తెలిసింది. ఫ్యాన్సీ నంబర్ కేటాయింపులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో ధరలు పడిపోయాయని రవాణా వర్గాలు తెలిపాయి. దీంతో లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement