కారు నెంబర్ కోసం రూ. 60 కోట్లు వెచ్చించాడు!
లక్కీ నెంబర్లు, ఫ్యాన్సీ నెంబర్లంటే మనవాళ్లకు మహా మోజు. ఇక్కడే కాదు.. ఏ దేశంలో ఉన్నా కూడా అలాంటి నెంబర్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరన్న విషయం మరోసారి రుజువైపోయింది. దుబాయ్‌లో ఒక కారు నెంబర్ కోసం భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త ఏకంగా రూ. 60 కోట్లు వెచ్చించాడు. బల్వీందర్ సహానీ అనే ఆయన ఆర్ఎస్‌జీ ఇంటర్నేషనల్ అనే వ్యాపార సంస్థకు యజమాని. భారతదేశంతో పాటు అమెరికా, యూఏఈ, కువైట్ లాంటి దేశాల్లో ఈ కంపెనీ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ పనులు చేస్తుంటుంది. ఈ సహానీకి అబు సబా అనే మారుపేరు కూడా ఉంది. ఈయన 'డి5' అనే నెంబరు కోసం దుబాయ్ రోడ్డు రవాణా వ్యవస్థకు రూ. 60 కోట్లు చెల్లించాడు.
అరుదైన నెంబరు ప్లేట్లు సేకరించడం తనకు ఇష్టమని.. ఈ నెంబరు రావడం చాలా గర్వంగా ఉందని సహానీ తెలిపారు. తనకు 9 అంకె అంటే ఇష్టమని, డి 5 కలిపితే మొత్తం 9 అవుతుందని.. అందుకే తాను ఈ నెంబరును కొన్నానని చెప్పారు. గత సంవత్సరం తాను 09 అనే నెంబరు ఉన్న ప్లేటును 45 కోట్లు పెట్టి కొన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తాను 10 నెంబరు ప్లేట్లు కొన్నానని, త్వరలోనే మరిన్ని కూడా కొంటానని, అది తనకు సరదా అని అన్నారు. తాజాగా కొన్న ప్లేటును తనకున్న రోల్స్ రాయిస్ కార్లలో ఒకదానికి అమరుస్తానన్నారు.
డి5 నెంబరు కోసం దాదాపు 300 మంది పోటీపడ్డారు. ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ల కోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి లైవ్ వేలం జరుగుతుంది. మొత్తం 80 రకాల నెంబరు ప్లేట్లను ఈసారి వేలానికి పెట్టారు. 'క్యు77' అనే నెంబరు 8.20 కోట్ల రూపాయలు పలికింది.