బాల్యం నుదుట అక్షరం ఆమె  | Shantha Sinha On child rights School Students | Sakshi
Sakshi News home page

బాల్యం నుదుట అక్షరం ఆమె 

Published Wed, Aug 10 2022 3:42 AM | Last Updated on Wed, Aug 10 2022 3:42 AM

Shantha Sinha On child rights School Students - Sakshi

ప్రొఫెసర్‌ శాంతాసిన్హా

బాల్యాన్ని అక్షరానికి దూరం చేస్తున్నది ఎవరు? పేదరికమా? తల్లిదండ్రుల అమాయకత్వమా? పిల్లలు పనికి పోతే పేదరికం పోతుందా? పేదరికం అల్లుకున్న జీవితాల్లో ఇది బదుల్లేని ప్రశ్న! శాంతాసిన్హా ను ఆలోచింప చేసిన ప్రశ్న కూడా! ఇది... మన రాష్ట్రాల్లో ఎనభైల నాటి సామాజిక చిత్రం. మరి... పేదరికం పోయేదెలాగ?  బడికి పోతే పోతుందా! పనికి పోతే పోతుందా!! బాలలను కార్మికులుగా మారుస్తున్న ధోరణి ఏమిటి? పిల్లలకు హక్కులుంటాయి... ఆ హక్కులను పరిరక్షించేదెలా? వీటన్నింటికీ పరిష్కారాలను సూచించారామె. చట్టాల రూపకల్పనలో ‘అక్షరం’గా మారారామె. 

ప్రొఫెసర్‌ శాంతాసిన్హా బాలల హక్కుల కార్యకర్త. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నెల్లూరు పట్టణం. ఆమె బాల్యం, విద్యాభ్యాసం స్థిరనివాసం హైదరాబాద్‌లో. ఉస్మానియాలో ఎం.ఎ చేసిన తర్వాత ఢిల్లీ జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేసి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తర్వాత శ్రామిక్‌ విద్యాపీఠం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టు ఆమెలో ఓ లక్ష్యానికి బీజం వేసింది. అది మొలకెత్తి మహావృక్షంలా విస్తరించింది. బాలలకు హక్కులుంటాయనే స్పృహను సమాజానికి కల్పించింది. అలాగే రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ రూపకల్పనలో ముసాయిదా సంఘ సభ్యురాలిగా విధివిధానాలకు అక్షరం రూపమిచ్చే వరకు కొనసాగింది. ఇటీవల గీతం యూనివర్సిటీ ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం... ఆమె సేవలను మరోసారి ఈ తరానికి గుర్తు చేసినట్లయింది. ఈ సందర్భంగా శాంతాసిన్హా సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు. 
 
షేరింగ్‌... షేరింగ్‌!!
‘‘మాది ఉమ్మడి కుటుంబం. తాతగారి నుంచి పెదనాన్న పిల్లలం, మేము... చిన్న పెద్ద అంతా కలిసి ఓ ముప్పై మంది ఉండేవాళ్లం. ఒక ఇంట్లో అంతమంది కలిసి జీవించడం ఈ తరానికి ఊహకు కూడా అందదు. అలా కలిసి పెరగడంతో షేరింగ్‌ బాగా ఉండేది. ఇంట్లో వస్తువులను అందరూ ఉపయోగించుకోవడం వంటి భౌతికమైన షేరింగ్‌ మాత్రమే కాదు, అభిప్రాయాలను పంచుకోవడం, భావాలను చెప్పగలగడం వరకు అన్నమాట. ఇంట్లో ఉదారవాద భావజాలం, అభ్యుదయ చర్చలు ఉండేవి. ఏదో ఒక టాపిక్‌ మీద డిబేట్‌ అన్నమాట. ఆ వాతావరణంలో పెరగడంతో సమాజం పట్ల కొంత అవగాహన ఉండేది. కాలేజ్‌ రోజుల్లో మా స్టూడెంట్స్‌ మధ్య వియత్నాం యుద్ధం గురించిన చర్చలుండేవి. ఉద్యమాలు, ఆందోళనల్లో పాల్గొనలేదు. కానీ, సామాజిక చైతన్యంతోనే పెరిగాను.

ఆ నేపథ్యం నన్ను శ్రామిక్‌ విద్యాపీఠ్‌ ప్రాజెక్ట్‌ కోసం అంకితమై పని చేయడానికి దోహదం చేసింది. శ్రామికుల పిల్లలను విద్యావంతులను చేసే ప్రయత్నం ఆ ప్రాజెక్టు ఉద్దేశం. మూడేళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తయింది కానీ నేను పని అంతటితో ఆపలేకపోయాను. అప్పటికే మా తాతగారు మామిడిపూడి వెంకట రంగయ్య పేరుతో ఎమ్‌వీ ఫౌండేషన్‌ ఉంది. పేద పిల్లలకు పుస్తకాలు, పరీక్ష ఫీజుకు సహాయం చేస్తుండేది. చిన్న పిల్లల కోసం ఏదో చేయాలని, మొదలు పెట్టిన పనిని సగంలో ఆపకూడదనే నా ఆసక్తిని గమనించి మా ఇంట్లో వాళ్లు ‘మన ఫౌండేషన్‌ వేదికగా నువ్వు చేయాలనుకున్నది చేయవచ్చు కదా’ అని సూచించారు. యూనివర్సిటీలో పాఠాలు చెప్తూనే ‘పిల్లలను పంపించాల్సింది పనికి కాదు, బడికి’ అనే ఉద్యమాన్ని నిశ్శబ్దంగా విస్తరింపచేశాను. 

గౌరవ డాక్టరేట్‌ అందుకుంటున్న శాంతాసిన్హా 

అప్పటి చట్టాలు అలా ఉండేవి! 
అప్పట్లో ‘బాల కార్మిక వ్యవస్థ’ అనే పదం వినిపించేది కాదు. చట్టాలు కూడా పిల్లల చేత ప్రాణాపాయానికి దారి తీసే ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేయించరాదని మాత్రమే చెప్పేవి. వ్యవసాయ పనులు, ఇళ్లలో (సంపన్నుల ఇళ్లలో జీతానికి) పనులు చేయడం మీద ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు. ఆ పనులకు సామాజిక అంగీకారం మెండుగా ఉండేది. పనులు చేసే పిల్లల కోసం ప్రభుత్వం రాత్రి బడులు నిర్వహించేది. ఈ పరిస్థితుల్లో నేను ‘పిల్లలకు హక్కులుంటాయి. వాటిని పరిరక్షించాలి. వాళ్ల చేత పనులు చేయించరాదు’ అని ఎలుగెత్తి చాటాల్సి వచ్చింది.

అన్నింటికీ సమాధానంగా ఒకటే పదం వినిపించేది... పేదరికం. పిల్లల చేత పని చేయిస్తే పేదరికం పోతుందా? అంటే... సమాధానం మౌనమే. ‘అక్షరం ఆలోచనను పెంచుతుంది. ఆలోచన వివేచననిస్తుంది. వివేకానికి విజ్ఞానం తోడైతే జీవితం సుఖమయం అవుతుంది’ అని తల్లిదండ్రులకు పాఠం చెప్పినట్లు చెప్పాల్సి వచ్చేది. మా యూనివర్సిటీ చుట్టు పక్కల గ్రామాలతోపాటు దాదాపుగా తెలంగాణ జిల్లాలన్నీ తిరిగాను. ‘బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలందరూ బాలకార్మికులే, బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి, పనిలో కాదు’ అనే నిర్వచనాన్ని అధికారికంగా తీసుకువచ్చేసరికి 2016 వచ్చింది.  
 
బ్రిడ్జి వేశారు! 
నా ఈ సామాజికోద్యమంలో మొదటి దశ బాలలు కార్మికులు కాకూడదు. రెండవది బాలలకు హక్కులుంటాయి, వాటిని పరిరక్షించాలి. మూడవది పాఠశాలలన్నీ రెగ్యులర్‌ స్కూళ్లే అయి ఉండాలి తప్ప నైట్‌ స్కూల్‌ విధానం వద్దు. ఇక నాలుగవది బ్రిడ్జి కోర్సు. బాల కార్మికులను గుర్తించి వారి చేత పని మాన్పించిన తర్వాత బడిలో చేర్చాలంటే ఏ క్లాసులో చేర్చాలనేది ప్రధాన సమస్య అయింది. అప్పటికే పన్నెండు– పదమూడేళ్లుంటాయి.

ఒకటో తరగతిలో చేర్చినా క్లాసులో కలవలేరు. అలాంటి పిల్లలకు ఏడాది–రెండేళ్ల పాటు ప్రత్యేకశిక్షణనిచ్చి సెవెన్త్‌ క్లాస్‌ పరీక్ష రాయించడం, అందులో పాసైన తర్వాత ఎనిమిదో తరగతిలో రెగ్యులర్‌ స్కూల్లో చేర్చడం బ్రిడ్జి స్కూల్‌ ఉద్దేశం. ‘రైట్‌ టు ఎడ్యుకేషన్‌’ చట్టం రావడానికి వెనుక మా లాంటి ఎంతోమంది సేవలున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం నాకు ఆ చట్టానికి ముసాయిదా సంఘ సభ్యురాలిగా విధివిధానాలు రూపొందించడంలో ఉపయోగపడింది. ఎన్‌సీపీసీఆర్‌(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌) చైర్‌పర్సన్‌గా ఆరేళ్లు ఢిల్లీలో విధులు నిర్వర్తించాను. 
ప్రతీకాత్మక చిత్రం 

మంచి మార్పు వచ్చింది! 
సంతోషం ఏమిటంటే... ఇన్ని దశాబ్దాలపాటు చేసిన ఉద్యమం ద్వారా సమాజంలో మంచి మార్పునే చూస్తున్నాను. తల్లిదండ్రుల్లో చైతన్యం వచ్చింది. తమ పిల్లలను చదివించాలనే ఆసక్తి మాత్రమే కాదు, చాలా తపన పడుతున్నారు. ఆర్థికంగా అనేక సర్దుబాట్లు చేసుకుంటూ కూడా పిల్లలను చదివిస్తున్నారు. అయితే సమాజంలో వచ్చిన చైతన్యానికి తగినన్ని సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాల వెనుకబాటుతనం కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు నా దృష్టి కౌమార దశలో ఉన్న వారి మీద ఉంది.

ముఖ్యంగా 14–18 ఏళ్ల అమ్మాయిలు ఎదుర్కొంటున్న లైంగిక వివక్ష, విద్య గురించి వాళ్లకు రక్షణ కల్పించే చట్టాలు లేవు. పాలసీలు బలహీనంగా ఉన్నాయి. పటిష్టమైన చట్టాల రూపకల్పన జరగాలనేది నా ఆశయం. అందుకోసం నా సామాజికోద్యమం కొనసాగుతోంది’’ అని చెప్పారు ప్రొఫెసర్‌ శాంతా సిన్హా.. ఆమె పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పద్మశ్రీ (1999), రామన్‌ మెగసెసె అవార్డు (2003) గౌరవాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు వచ్చిన మరో డాక్టరేట్‌ కరోనాతో వచ్చిన స్తబ్ధతను తొలగించి బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు ప్రొఫెసర్‌ గారు నవ్వుతూ. 
– వాకా మంజులారెడ్డి 
ఫొటోలు : నోముల రాజేశ్‌ రెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement