బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే.. 40 ఏళ్ల వయసులో సిద్థార్థ్ గుండె పోటుతో మరణించడం కలవరపెడుతుంది. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తుందని వైద్యులు చెబుతారు. అలాంటిది ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సిద్థార్థ్ గుండెపోటుతో చనిపోవడం ఏంటనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది.
దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే అతిగా వ్యాయామం చేయడం. అవును. అతిగా వ్యాయాయం చేయడం వల్లనే సిద్ధార్థ్ గుండెపోటు బారిన పడ్డాడు అంటున్నారు వైద్యులు. సాధారణంగా ప్రతి మనిషికి 30-45 నిమిషాల వ్యాయామం చాలు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు గంటల తరబడి జిమ్‌కే పరిమితం అవుతారు. సిద్ధార్థ్ కూడా రోజు 3 గంటల పాటు వ్యాయామాలు చేసేవాడు. ఇంత అతి వ్యాయామం వద్దని డాక్టర్లు గతంలోనే సిద్ధార్థ్‌కు సూచించినప్పటికి అతడు వైద్యుల మాట వినలేదు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. (చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?)
అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం అతిగా వ్యాయామం చేయడం వల్ల సడెన్ కార్డియాక్ అరెస్ట్, సడెన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశం పెరుగుతుంది వ్యాయామం చేసే సమయం మధ్యస్థంగా ఉండటం వల్ల ఫిట్‌గా ఉండటమే కాక మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని సూచించింది. ఈ క్రమంలో అతిగా వ్యాయామాలు చేసే వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. అలానే వ్యాయామం ఫిట్‌నెస్ యాప్‌ల మీద, సొంత నిర్ణయాల మీద ఆధారపడి కాకుండా.. నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment